ఒక విమర్శ కనిపించింది ఆన్‌లైన్‌లో… తెలుగువాళ్లు భారతీయుడు-2 సినిమా చూడాలంటే 350 చెల్లించాలి ఒక్కొక్కరికి… సరే, పాప్ కార్న్, సమోసా, సాఫ్ట్ డ్రింక్స్, పార్కింగు మన్నూమశానం సరేసరి… తమిళనాడులో (తమిళ సినిమా) చూడాలంటే 190 చెల్లిస్తే సరి… అఫ్‌కోర్స్, ఇతర దోపిడీలు అక్కడా ఉంటాయి…
నిజమే కదా… అసలు టికెట్ల రేట్లు పెంపునకు ఎందుకు ప్రభుత్వాలు అవకాశం ఇవ్వాలి..? ఇదీ అసలు ప్రశ్న… పేరుకు భారతీయుడు సినిమా అవినీతి పట్ల జీరో టాలరెన్స్ అట… మరి ఈ దోపిడీని ఏమనాలి కమలహాసన్..? ఇదీ ఓరకమైన అవినీతి, అక్రమమే కదా… దోచుకోవడం కాదా..?
నిర్మాణవ్యయం ఇంత పెట్టాం, అంత పెట్టాం అనేది దొంగ సాకు… దొంగ లెక్కలు… ఐనా నువ్వు చేసేది దందా… నీకు ఖర్చు ఎక్కువైందనీ, నువ్వు నటీనటులకు అడ్డగోలుగా పారితోషికాలు తగలెట్టావని సగటు ప్రేక్షకుడు ఎందుకు తన పర్సును తగలేయాలి..? నువ్వు చేసేది ఏమైనా సమాజోద్దరణా..? చారిటీయా..? లాభాలొస్తే సొసైటీకి నయాపైసా ఇవ్వరు కదా ఎలాగూ…
Ads
మరి ఈ దరిద్రం మన తెలుగువాళ్లకే ఎందుకు..? ఎవరు, ఎప్పుడు స్టార్ట్ చేశారో గానీ మహానుభావులు… ప్రేక్షకుడి పర్సులకు కత్తెర్లే..! పైగా ఆ రేట్ల పెంపుకి ఓ పద్ధతీ పాడు కూడా ఉండదు… అసలు మల్టీప్లెక్స్ అనేదే ఓ మాయ, భ్రమ… థియేటర్లలోనే ఓ క్యాంటీన్, ఓ బట్టల కొట్టు పెట్టేస్తే సరి, అది మల్టీప్లెక్స్… ఇంకేం, అడ్డగోలుగా టికెట్ రేట్లు…
తిరుమలకు వెళ్లిన డి.సురేష్‌బాబు చెబుతున్నాడు… (అసలు కొండ మీద ఈ ప్రెస్‌మీట్లు ఏమిట్రా బాబోయ్… దీన్నెవడూ నిరోధించలేడా..?) ‘‘టికెట్ రేట్లు పెంచుకోవడం పెద్ద ఇష్యూ కాదు, సింప్లిఫై చేస్తున్నారు, జీవోలు తెచ్చేసుకోవచ్చు… కానీ టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉండాలి, థియేటర్లకు ప్రేక్షకులు ఎక్కువగా రావాలి, అది పెంచుకోవాలి’’ అని మస్తు నీతులు చెప్పాడు…
తను నైజాం ఏరియాకు ఇదే భారతీయుడు-2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్… అక్కడ అలా చెప్పాడు కదా, వెంటనే తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ల రేట్ల పెంపు మీద జీవో తెప్పించేసుకున్నాడు… రేట్లు పెంచడం అంటే అందరికీ సినిమా వ్యూయింగ్ అందుబాటులోకి తీసుకురావడమా సురేష్ బాబయ్యా…? కనీసం ఆ తిరుమల వెంకన్న సన్నిధిలో నిలబడైనా నిజాయితీతో, నైతికతతో మాట్లాడకపోతివి కదా…
ఈ టికెట్ల రేట్ల పెంపును చంద్రబాబు ఎలాగూ సమీక్షించడు, సరిదిద్దడు… తనది సినిమా కుటుంబమే, డిప్యూటీ సీఎందీ సినిమా కుటుంబమే… టీడీపీలో బోలెడంత మంది సినిమా ప్రముఖులు… మరి తెలంగాణ ప్రభుత్వమైనా సమీక్షిస్తుందా..? లేదు, ఆ ఆశ కూడా పోయింది… డ్రగ్స్ మీద చిన్న వీడియో తీయండి, మేం సంతృప్తి పొందుతాం, మీ టికెట్ల రేట్లు మీరు పెంచుకోవచ్చు అని అత్యంత ఉదారంగా రేవంతుడు ప్రకటించేశాడు…
ఎస్, అసలు మారాల్సింది ప్రేక్షకుడు… ఏం..? సినిమా రిలీజు కాగానే చూడకపోతే కొంపలు మునిగిపోతాయా..? విపత్తులు ఏమైనా సంభవిస్తాయా..? కష్టపడి సంపాదించింది ఎందుకు తగలేసుకోవడం..? ఇది ఫ్యానిజం తాలూకు దుష్ప్రభావం… దీనికితోడు బెనిఫిట్ షోలు అనబడే మరో దోపిడీ సరేసరి… ఎస్, అసలు తప్పు ప్రేక్షకుడిదే… తొలివారం చూడకండి, వదిలేయండి, మౌత్ టాక్ బాగుంటే రెండో వారం వెళ్లండి, లేదంటే మరో మంచి ఐడియా ఏమిటంటే..? ఓటీటీలో వచ్చేవరకు ఆగండి..!!
లేదంటే ఈ అక్రమం ఆగదు… పిచ్చి గెంతులు, తిక్క ఫైట్లు, అడ్డదిడ్డం కథలు, అమ్మాయిలతో వెకిలి వేషాలు, బిల్డప్పులతో హీరోలు వేల కోట్లు వెనకేసుకుంటారు, సొంత ఫ్లయిట్లు కొనుక్కుంటారు… ప్రేక్షకుడేమో కష్టపడి సంపాదించిన కాసింత సొమ్మునూ థియేటర్ల సిండికేట్లకు సమర్పించుకుంటాడు…!!
Share this Article