Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాడిపై లాఠీలు విరుగుతుంటే జనం చప్పట్లు! ఎందుకంటే!

September 7, 2026 by M S R

.

న్యాయస్థానాలపై నమ్మకం పోతే… లాఠీలే న్యాయమవుతాయా? మొన్నటి నుంచీ రెండు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి… గుజరాత్, భావనగర్… బస్‌స్టాండు గేటు దగ్గర ఓ మనిషిని పోలీసు జీపుకు కట్టేసి కొడుతుంటే లాఠీలు విరుగుతున్నయ్… బస్టాండ్ అంత కలియదిప్పుతూ వాడిని జనం ముందే విరగ తంతున్నారు…

ఇది థర్డ్ డిగ్రీ విచారణ కాదు… పోలీసులు బహిరంగంగా అమలు చేస్తున్న ఓ శిక్ష… ఈ వీడియోల కింద కామెంట్లలో 90 శాతానికిపైగా జనం పోలీసు చర్యను సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు, మెచ్చుకుంటున్నారు… ఒకరకంగా లాఠీలు విరిగేకొద్దీ ప్రజల చప్పట్లు మోగుతున్నాయి…

Ads

ఇది ఒకరకంగా మన న్యాయవ్యవస్థ సంపాదించుకున్న మరక… పోలీసులే విచారణాధికారులైపోయి, పోలీసులే జడ్జిలు అయిపోయి, తీర్పులు చెప్పేసి, పోలీసులే బహిరంగంగా దండన అమలు చేయడాన్ని నాగరిక సమాజం అంగీకరించకూడదు నిజానికి…

కానీ జరుగుతున్నది..? అసలు ఈ కేసు ఏమిటో చూద్దాం…  వీడి పేరు ఫైజల్… కాజల్ బెన్‌తో సహజీవనంలో ఉన్నాడు… కొద్దిరోజుల క్రితం వాడికి అనుమానం వచ్చింది, ఆమె ఇంకెవడితోనో సాన్నిహిత్యంలోకి వెళ్లిందని, అంతే… నరరూప రాక్షసుడు ఆమెపై బస్టాండ్‌లో దారుణంగా దాడి చేశాడు, ఆ దెబ్బలు ఎంత ఘోరంగా తగిలాయంటే హాస్పిటల్ స్టాఫ్ చేతులెత్తేశారు, ఆమె మరణించింది…

జనం పోలీసుల్ని తిట్టసాగారు… దాంతో పోలీసులు సీన్ రీక్రియేషన్ లేదా సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరిట అదే బస్టాండుకు పట్టుకొచ్చారు… ఆమె ఎటెటు ప్రాణభయంతో పరుగులు తీస్తూ వీడి దెబ్బలకు గురైందో, అవే ప్లేసుల్లో వాడిని ‘శిక్షించారు’…

మామూలుగా థర్డ్ డిగ్రీ గానీ, ఎన్‌కౌంటర్ గానీ ఏ ఆధారాలూ దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటారు, ఎందుకంటే మన కోర్టులు నేరగాళ్లను శిక్షించలేవు గానీ ఇలాంటి కేసుల్లో పోలీసులను శిక్షిస్తాయి కదా… కానీ ఇక్కడ ఎవరికీ ఏ మాస్కులు లేవు, జనాగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నట్టుగానే కసిగా కొడుతున్నారు… ఏమైతే అది కానివ్వు, డోన్ట్ కేర్ అన్నట్టుగా…

bhavanagar busstand

పక్కాగా చెప్పాలంటే… ఇది మన న్యాయవ్యవస్థకు ప్రజలు, పోలీసుల అభిశంసన ఒకరకంగా…! ఎలాగంటే..? జనం పోలీసులను తిట్టలేదు. “బాగా చేశారు.” “ఇలాంటి వాళ్లకు ఇదే శిక్ష.” “ఇంకా కొట్టాలి.” అనే స్పందనలు వచ్చాయి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది…

హత్యను మించిన మరో ప్రమాదకరమైన ప్రశ్న… కాజల్‌బెన్ బరైయాపై ఫైజల్ చేసిన దాడి ఎంత దారుణమో CCTV దృశ్యాల ద్వారా బయటపడింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఆమెను కింద పడేసి పదేపదే తన్నాడు, కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చనిపోయింది. ఇలాంటి దృశ్యాలు చూసిన తర్వాత ఎవరికైనా కోపం రావడం సహజం. “ఇలాంటి వాడిని ఏం చేసినా తప్పేంటి?” అనిపించడమూ సహజమే.

కానీ చట్టం మాత్రం ‘సహజ కోపం’ మీద నడవదు. అందుకే న్యాయవ్యవస్థ ఉంది. నిందితుడిని అరెస్టు చేయాలి. దర్యాప్తు చేయాలి. సాక్ష్యాలు సేకరించాలి. కోర్టులో ప్రవేశపెట్టాలి. నేరం రుజువైతే శిక్ష పడాలి. అది ఎంత కఠినమైన శిక్ష అయినా న్యాయస్థానమే విధించాలి. పోలీసులు కాదు.

మరి పోలీసులు ఎందుకు కొట్టారు? ఇక్కడే భావనగర్ ఘటనలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఉంది. నీలంబాగ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ డి.పి. ఉనద్కట్ పోలీసుల చర్యను సమర్థిస్తూ, ఈ ఘటనతో పోలీసుల ప్రతిష్ఠ దెబ్బతిందని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం తగ్గిందని, అందుకే తాము “ఎక్స్‌ట్రా మైల్” వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు… నిందితుడికి “ఒక ఉదాహరణ” చూపించాల్సిన అవసరం ఉందని కూడా ఆ పోలీసు అధికారి పేర్కొన్నాడు…

చట్టం కోణంలో ఇది కరెక్టు కాదు, మరి ఏది కరెక్టు..? మన న్యాయవ్యవస్థ ఎవరినీ శిక్షించలేదు, లాయర్లను పెట్టుకోలేని పేద, అక్రమ కేసులు బాధితుల్ని, ఏళ్ల తరబడీ జైళ్లలో పెట్టడం తప్ప… ఇలాంటి నేరగాళ్లను ఏమీ చేయలేకపోతోంది… అందుకే జనం నుంచి పోలీసుల సమర్థన…

వేల ఎన్‌కౌంటర్లు జరిగినా యూపీలో ఒక్కరంటే ఒక్కరూ యోగీని తిట్టిపోయలేదు… కారణం, రాష్ట్రాన్ని మాఫియా రాజ్యంగా మార్చిన నేరగాళ్ల వేట కాబట్టి… జనం చప్పట్లు కొట్టారు తప్ప వ్యతిరేకించలేదు… ఇదీ అంతే… జనం వీటిని ఎందుకు సమర్థిస్తున్నారో న్యాయవ్యవస్థ ఆత్మవిమర్శ చేసుకున్నరోజు… పోలీసులు జడ్జిలైపోకుండా, వాళ్లే తీర్పులు చెప్పకుండా అడ్డుకోవచ్చు…

ఇప్పుడు న్యాయవ్యవస్థపై ఎవరికీ నమ్మకాల్లేవు… గతంలో “పట్టుకున్నారుగా… ఇక కోర్టులో శిక్ష పడుతుంది” అని జనం అనుకునేవారు. కేసులు సంవత్సరాల తరబడి సాగుతాయి. సాక్షులు మారిపోతారు. సాక్ష్యాలు బలహీనపడతాయి. నిందితులు బెయిల్‌పై బయటకు వస్తారు. కేసులు వాయిదాల మీద వాయిదాలు పడతాయి. చివరకు శిక్ష పడినా అది ఎప్పుడు పడుతుందో తెలియదు.

పడినా సరే పెరోల్స్ మీద బయటికీ లోనికీ తిరుగుతాడు… ఏమో, కాలం కరుణిస్తే సత్ప్రవర్తన కింద శిక్షాకాలం తగ్గించుకుని బయటికి వచ్చేయగలడు… ఇలాంటి అనుభవాలన్నీ కలిసినప్పుడు ప్రజల్లో ఇదుగో ఈ లాఠీస్వామ్యానికి సమర్థ భావనే పెరుగుతుంది…

మరో ట్రాజెడీ ఏమిటంటే..? దిమాగీ నక్సల్స్… ఇలాంటి క్రూరమైన నేరగాళ్లను వెనకెేసుకొస్తాయి… బాధితులకు న్యాయం, సమాజంలో శాంతి, భద్రత వాళ్లకు అక్కర్లేదు… ఇక్కడా అంతే, పీయూసీఎల్ ఎంటరైంది… ఎవరో లాయర్ బెయిల్ ఇప్పిస్తాడు… వాడు బచాయించబడతాడు…

ఇక్కడే కోర్టులు తమకుతామే వేసుకోవాల్సిన ప్రశ్న… పోలీసింగ్, దర్యాప్తు నాణ్యత, ప్రాసిక్యూషన్, సాక్షుల రక్షణ, కేసుల పెండెన్సీ, వేగవంత విచారణ … మనం నిజంగా నేరగాళ్లను శిక్షించగలుగుతున్నామా..?

గుజరాత్ డీజీపీ కేఎల్‌ఎన్ రావు 2026 మే 12న పోలీసులకు పంపిన ఆదేశాల్లో నిందితులను తాళ్లతో కట్టడం, బహిరంగంగా ఊరేగించడం, మోకాళ్లపై నడిపించడం, లాఠీలతో కొట్టడం, అవమానించడం వంటి చర్యలు చట్టబద్ధ ప్రక్రియ కాదని స్పష్టం చేశాడు… ఐనాసరే ఈ పోలీసులు ఈ చర్యకు దిగారంటే అర్థం… నేనేదో ఆదేశాలిస్తాను, మీ పని మీరు చేయండని ఆఫ్ ది రికార్డుగా గోఎహెడ్ అనడమే…

ఐతే లాఠీస్వామ్యంలో ఓ భయంకరమైన ప్రమాదం ఉంది… పోలీసుల అవినీతి, అక్రమాలు! ఈరోజు కొట్టబడుతున్న వ్యక్తి నిజంగానే దోషి కావచ్చు. కానీ రేపు? పోలీసులు తప్పుగా అరెస్టు చేసిన వ్యక్తి అయితే? అక్రమ కేసు బనాయించబడిన వ్యక్తి అయితే..? రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనుకున్న వ్యక్తి అయితే? తప్పు సాక్ష్యంతో పట్టుకున్న వ్యక్తి అయితే? అప్పుడు కూడా అదే లాఠీ న్యాయమేనా?

ఇవి చాలా కీలకమైన ప్రశ్నలు… ఇక్కడే భావనగర్ ఘటనను కేవలం “మానవ హక్కుల ఉల్లంఘన” అంటూ ముగించడం కూడా సరిపోదు. ఎందుకంటే పోలీసుల లాఠీలకు జనం చప్పట్లు కొట్టడం కూడా ఒక సామాజిక హెచ్చరిక. ప్రజలు చట్టాన్ని ప్రేమించడం మానేశారు అని కాదు. చట్టం తమను కాపాడుతుందన్న నమ్మకం తగ్గుతోంది అన్న సంకేతం. ఇది ఇంకా ప్రమాదకరం.

ఎందుకంటే ఒకసారి ప్రజలు, “కోర్టు కంటే పోలీసుల లాఠీ వేగంగా న్యాయం చేస్తుంది” అని నమ్మడం మొదలుపెడితే… అది ఇక్కడితో ఆగిపోదు.,. రేప్పొద్దున ఇలాంటి నేరగాళ్ల తరఫున వాదించే లాయర్లు, బెయిళ్లు ఇచ్చే జడ్జిలకు ప్రజాప్రతిఘటన ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు… భావనగర్ బస్టాండ్ చెబుతున్న నిజం ఇదే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వాడిపై లాఠీలు విరుగుతుంటే జనం చప్పట్లు! ఎందుకంటే!
  • అనుప్రియ ! 21 ఏళ్ల ఈ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ కథ తెలుసా మీకు..?
  • రాజీనామా చేసి, జనంలోకి రావయ్యా — అదే గౌరవం- అదే మర్యాద !!
  • ఇదీ ఓ టాక్సిక్ – బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్ ఓ గ్రాండ్ ఫ్లాప్ షో !!
  • జనం ట్రాక్టర్లలో తరలివస్తున్నారు ! ఇరుముడి ఎందుకు కనెక్టయిందంటే..?!
  • మోదీ వెనుక నీడలా ఓ నాగా మహిళ – ఎవరీమె..? నేపథ్యం ఏమిటి..?
  • సరిగమలు! ఓ విశ్వనాథ్ తీయాల్సిన సినిమా ఓ రాఘవేంద్రరావు తీస్తే..?
  • సూపర్‌స్టార్ రజినీకాంత్ అహం పూర్తిగా బద్ధలైన ఆ సందర్భం..!!
  • రేవంత్ రెడ్డిని ‘అండర్ ఎస్టిమేట్’ చేశారు – అడ్డంగా బుక్కయ్యారు !!
  • వావ్ గుజ్జూస్- ఏదైనా మాయ చేయగలరు… 8542 వోట్లు- ఖర్చు 290 కోట్లు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions