.
జగన్ వూరకుంటే ప్రజల సొత్తు దోచేయవచ్చా? ఈ శీర్షికతో జమీన్ రైతు పత్రికలో ఓ బ్యానర్ స్టోరీ వచ్చింది… దాని గురించి చెప్పుకోవడానికి రెండు కారణాలు… వర్తమాన జర్నలిజంలో సోషల్ మీడియా, చిన్న మీడియా మాత్రమే పెద్ద విషయాలను చెబుతున్నాయి ప్రజలకు… మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉత్త చప్పిడి కూడు…
రెండో కారణం… ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కంట్రాక్టర్లే శాసిస్తున్నారు, కంట్రాక్టులే శాసిస్తున్నాయి అనడానికి ఓ ఉదాహరణ… కాకపోతే జగన్ హయాంలో ఒక కుల కంట్రాక్టర్లను టార్గెట్ చేసినట్టు కనిపించేది… చంద్రబాబు పీరియడ్ కులాతీతం, తన ప్రయోజనాలే ముఖ్యం అనిపిస్తుంది… వార్తలో మరో ఇంట్రస్టింగు పాయింట్… ఈనాడు- సాక్షి వైఖరుల మీద…
Ads

ఆ వార్త ముఖ్యాంశాలు చదవండి…
- ధరలు పెంచి, నియమాలు తుంగలో తొక్కి విద్యుత్ టెండర్లు కట్టబెట్టారు.
- రాష్ట్రంలో ఏ కాంట్రాక్ట్ పనైనా జగన్ ఆంతరంగిక కూటమికే అప్పచెప్తున్నారు.
- ‘ఈనాడు’ పత్రిక విమర్శలకు కూడా స్పందించనంతగా తోలు మందం.
2019 ఎన్నికల సమయంలో, చందాల కోసం ప్రయత్నం చేస్తే వీరివరూ తన ఫోన్ కూడా ఎత్తలేదని వాపోయేవాడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… కానీ ఇప్పుడు అదే కూటమికి చంద్రబాబు తోడ్పాటు, ప్రాధాన్యత… నైతిక ప్రమాణాలను తుంగలో తొక్కుతున్నది కూటమి ప్రభుత్వం… ఎవరెన్ని విమర్శలు చేసినా, స్వంత పార్టీ మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినా పట్టించుకోవడం లేదు.
ఇందుకొక తాజా ఉదాహరణ – విద్యుత్ శాఖలో పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయంగా కరెంట్ సరఫరా ఇవ్వడం కోసం పనులు. జగన్ కాలంలోనే వీటికి టెండర్లు పిలిచారు. అయితే తను శ్రద్ధ చూపకపోవడంతో ఆ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. చంద్రబాబు వచ్చిన తర్వాత వాటిని మళ్లీ మొదలు పెట్టారు.
1039 కోట్ల రూపాయల విలువైన పనులివి. కానీ వున్నట్లుండి, వెబ్సైట్లో టెండర్ నోటిఫిరేషన్ తీసిపారేసి, ధరలు పెంచి 1200 కోట్ల రూపాయలకు అవే పనులకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి, ఆ టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లెవ్వరూ పాల్గొనకుండా నిబంధనలు మార్చేశారు. ఈ పనుల అంచనాలు, కాంట్రాక్టర్లు కోరిన రీతిలో భారీగా పెంచారుట. రూపాయి ఖర్చుకు, రెండు రూపాయల అంచనా.
సహజంగానే ప్రతిపక్షంగా జగన్ కానీ, ఆయన స్వంత పత్రిక ‘సాక్షి’ కానీ ఈ నిలువు దోపిడీ గురించి పల్లెత్తు మాట అనలేదు. తోడు దొంగ కాబట్టి, దొంగకు తేలుకుట్టినట్లు వూరకుండి పోయారు. విచిత్రంగా ‘ఈనాడు’ దినపత్రిక ఈ కుంభకోణంపై ఒకటికి రెండు పర్యాయాలు వివరమైన వార్తలు ప్రచురించింది. ధరలు పెంచి, నిబంధనలు మార్చి, అంతేవాసులైన కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని విమర్శించింది.
సాధారణంగా ‘ఈనాడు’లో ఒక విమర్శ వస్తే, వెంటనే పొరపాటు సవరించుకోవడం చంద్రబాబు నాయుడుకి ఆనవాయితీగా వస్తున్న అలవాటు. కానీ ఇప్పుడు ‘ఈనాడు’ ఎంత ఘాటు విమర్శలు చేస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదు. పద్ధతి మార్చుకోవడం లేదు.
ఎవడబ్బ సొత్తని, ప్రభుత్వ నిధులను ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెడుతున్నారని జగన్ ఎలాగూ అడగడం లేదు. అంటే, ఇంకెవరూ అడగరని ధీమానా..? ప్రతిపక్షం తోడు దొంగగా వ్యవహరించినంత మాత్రాన, ఇటువంటి దుర్మార్గాలు ప్రజల దృష్టిలో పడవని భ్రమ పడడం పిల్లి కళ్లు మూసుకొని పాలు త్రాగడంతో సమానం…
ఇదీ ఆ వార్త… పత్రిక కథనంలో కంట్రాక్టర్ల పేర్లు, ఈ కంట్రాక్టుల్లో మతలబులు కూడా పేర్లతో సహా రాశారు… అంటే అడగాల్సిన ప్రతిపక్షం, దాని పత్రిక కిక్కుమనడం లేదు, తమ అనుకూల కంట్రాక్టర్లే కాబట్టి..! కానీ ప్రభుత్వ అస్మదీయ పత్రిక మాత్రం ఈ అన్యాయాన్ని ఎత్తిచూపుతోంది. ఐనా ఆ కంట్రాక్టర్లు కోరుకుంటున్నట్టే వ్యవహారాలు నడుస్తున్నాయి… పార్టీ ఏదైతేనేం, వ్యవహారాల్ని శాసించేది కంట్రాక్టర్లే అని ఈ వార్తాకథనం సారాంశం…
Share this Article