నో డౌట్… నాకూ ఇష్టుడే… గులకరాళ్ల డబ్బా హోరులో సినీసంగీతం కొట్టుకుపోతున్నవేళ… అనితర సాధ్యమైన బాణీలతో, స్వరాలతో, కూర్పులతో… ఆప్ట్ బీజీఎం, మెలొడీ, ప్రయోగాలతో సినిమా సంగీతానికి ఓ కొత్త ఒరవడిని, ఉరవడిని చూపిన సంగీత దర్శకుడు తను… ఓ సినిమా కూడా వస్తోంది తన బయోపిక్‌గా… లబ్ధి ప్రతిష్టులే చేతులెత్తేసే సౌత్ ఇండస్ట్రీలో ఓ మారుమూల గ్రామం నుంచి, అనామక నేపథ్యం నుంచి వచ్చి ఆ రికార్డులు సృష్టించడం మామూలు విషయం కాదు…
కానీ ప్రతిభ వేరు.., వ్యక్తిగతం వేరు… తనెందుకో గానీ మరీ ఈమధ్య విసుగెత్తిస్తున్నాడు తన ధోరణితో… అదేదో స్టూడియోలో (చెన్నై ప్రసాద్ స్టూడియో..?) అప్పుడెప్పుడో ఫలానా గదిలో ఉండి, నీ ట్యూన్స్ చూసుకోవయ్యా అని ఆ స్టూడియో యజమాని చాన్సిస్తే, ఇక దాన్ని తనకే రాసిచ్చినట్టు కోర్టుకెక్కి హంగామా చేశాడు… ఎస్పీ బాలుతో రాయల్టీ డబ్బుల గురించి గొడవ, రచ్చ… ఆమధ్య ఏదో తత్వాలు పాడాడు ఏదో సినిమాలో… కర్ణకఠోరం… పాడేవాడు పాడాలి, స్వరాలు కూర్చేవాడు స్వరాలు కూర్చాలి స్వామీ…
ఆమధ్య ఆరుగురు నిర్మాతలు కూడా ఏదో అంశంపై తనపై కోర్టుకెక్కారు… డబ్బుల వ్యవహారమే… ఇప్పుడు కూడా అదే ఎకో వంటి రికార్డింగ్ సంస్థలు… ఇళయరాజాకు సంబంధించి 1000 సినిమాలు, 4500 పాటలు… వాళ్లు హక్కులు కొన్నారు… నో, ఆ గడువు అయిపోయింది, ఇక నా పాటలు వాడటానికి వీల్లేదు అని కోర్టుకెక్కాడు… కోర్టు ఆయా కంపెనీలకే అనుకూలంగా తీర్పు చెప్పింది… ఈ స్వరజ్ఞాని అప్పీల్‌కు వెళ్లాడు… అక్కడా చుక్కెదురే…
Ads
రాజా తరఫు లాయర్ కోర్టులో వాదిస్తూ తన క్లయింట్ అందరికంటే గొప్పవాడనే రీతిలో చెప్పుకొచ్చాడు… తోపు, తురుము అనే కాదు, దేవుడికన్నా తక్కువ, మిగతా అందరికన్నా ఎక్కువట… దీనికి స్పందించిన న్యాయ మూర్తులు సంగీత త్రిమూర్తులుగా చెప్పుకునే ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజర్, శ్యామశాస్త్రి కంటే ఇళయరాజా గొప్పవాడా అనడంతో ఇళయరాజా లాయర్ల నుంచి నో ఆన్సర్… నిజమే కదా, సినిమా సంగీతంలో దిట్ట కావచ్చుగాక, ఇక నాఅంత వారు లేరని అహం తలకెక్కాక… ఇక తనేమీ కానట్టే లెక్క… నిష్ఠురంగా ఉన్నా ఇదే నిజం…
ఇలా అనేక వివాదాలు తనను స్వరజ్ఞాని కాదు, అపస్వరజ్ఞానిని చేస్తున్నాయి… అసలు ఒక విషయంలోకి కాస్త లోతుగా వెళ్దాం… తను డబ్బు తీసుకున్నాడు, స్వరాలు కూర్చాడు, అంతే… పని, డబ్బు చెల్లింపు, ఖేల్ ఖతం… లాభనష్టాలు, వ్యయప్రయాసలు నిర్మాత వంతు… కానీ దానికి రాయల్టీ… గాయకుడికి కొంత… మళ్లీ ఇప్పుడు ఆ రాయల్టీకి అదనంగా డబ్బు కావాలి… ఒకవైపు అందరికీ హక్కులు అమ్మేసి స్పోటిఫై తదితర సంస్థలకూ ఆ పాటలు వాడుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాడట, డబ్బు కోసం… (నిజానిజాలు దేవుడికెరుక)… కొన్ని సంస్థలేమో ఈ వివాదాలకు కావాలనే దూరంగా ఉన్నాయట… పాటల మీద నిజమైన హక్కు ఉండాల్సింది నిర్మాతకు కదా… వాడు కదా లాభనష్టాలకు జవాబుదారీ… మరి నడుమ వీళ్లెవరు..? అసలు వీళ్లు ఆథర్స్ కూడా కాదు కదా… అమ్మకాల మీద రెగ్యులర్ రెవిన్యూ ఆశించడానికి…
సపోజ్, ఒక దర్శకుడు ఉన్నాడు… ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తాడు, అన్నీ పర్యవేక్షిస్తాడు, సినిమా అయిపోయాక ఆ ప్రాజెక్టు అయిపోయినట్టే… సినిమా బయ్యర్లు, డిస్ట్రిబ్యూషన్, ఆడియో రైట్స్, టీవీ రైట్స్, ఓటీటీ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, రీమేక్ రైట్స్ వంటి సవాలక్ష రైట్స్… రిస్క్ నిర్మాత భరిస్తాడు… దర్శకుడికి ఇక ఏ సంబంధమూ లేదు… ఈమధ్య అన్నీ రీరిలీజ్ అంటున్నారు కదా, మరి నా రాయల్టీ మాటేమిటని అడగడం లేదు కదా దర్శకుడు…
సేమ్, నృత్య దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, ప్రొడక్షన్ మేనేజర్లు, నటీనటులు ఎట్సెట్రా… వీళ్లంతా లేనిదే సినిమా లేదు కదా… మరి వాళ్లకు ఈ అదనపు డబ్బు చెల్లింపుల మాటెందుకు రాదు..? పాటలకే ఈ ఫాయిదా దేేనికి..? నిర్మాత పని చేయించుకున్నాడు, డబ్బులు ఇచ్చాడు… అక్కడ ఔట్ సోర్సింగ్ జాబ్ అయిపోయినట్టే కదా… హేమిటో, ఈ ఫీల్డ్ అర్థమే కాదు… ఇళయరాజా తత్వంలాగే…!! కొత్త రక్తం జోరు మీదుంది, ఈయన వంటి పాతనీరు కొట్టుకుపోతోంది… ఆ నైరాశ్యం నుంచి పుట్టుకొచ్చిన ఫ్రస్ట్రేషనా, లేక తన తత్వమే అదా..?!
Share this Article