.
మనం ఓ సీరియస్ అంశం చెప్పుకోవాలి… తెలంగాణ ఉన్నతాధికారగణంలో బట్టబయలవుతున్న భారీ అవినీతి గురించి! మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఏసీబీ ఎవడిని తన్నినా వందల కోట్ల అక్రమార్జన బయటపడుతోంది! ఆ ఆస్తుల వివరాలు పరిశీలిస్తూ ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు…
ప్లాట్లు, ఫ్లాట్లు, కిలోల కొద్దీ బంగారం, వెండి, ఇళ్లు, భూములు… వాట్ నాట్? బినామీల పేర్లతో, బంధువుల పేర్లతో ఆస్తులు… అవన్నీ లెక్కించడానికే ఏసీబీ అధికారులకు రోజుల సమయం పడుతోంది… అంతగా తెగబలిసిపోయారు కొన్ని కీలకశాఖల ఉన్నతాధికారులు…
Ads
గతంలో, అంటే తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వం గాలికి వదిలేసిన పోలీసు విభాగం అవినీతి నిరోధక శాఖ… అసలు ఒక దశలో ఈ రాష్ట్రంలో ఏసీబీ ఉందాని సందేహించాల్సిన దుస్థితి… రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏసీబీ దూకుడుగా వెళ్తోంది… కన్నేసి, వలవేస్తే చాలు పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలు దొరుకుతున్నాయి…
రిజిస్ట్రేషన్ కాగితాల్లో అధికారిక విలువ 100 కోట్లు ఉంటే, అసలు మార్కెెట్ విలువ ఆరేడు వందల కోట్లు దాటుతుంది… కొన్ని ఉదాహరణలు తీసుకుందాం… (అధికారిక లెక్కలే తీసుకుందాం) హెచ్ఎండీఏ అధికారి శివ బాలకృష్ణ 250 కోట్లు, ఆర్అండ్‌బీ జె. మోహన్ నాయక్ 200 కోట్లు, ఇరిగేషన్ హెచ్.నికేష్ కుమార్ 100 కోట్లు, వాటర్ బోర్డ్ అధికారి ఎస్.అనంతకుమార్ 100 కోట్లు, ఇరిగేషన్‌లోనే నూనె శ్రీధర్, మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావులు అంతే… తాజాగా డీఎస్పీ భీమ్‌రెడ్డి 200 కోట్లు… ఎ.వెంకటరెడ్డి డిప్యూటీ కలెక్టర్ 100 కోట్లు…
శివబాలకృష్ణ ఆస్తుల వివరాలు తెలిసి ఆశ్చర్యపోయి చివరకు ఈడీ కూడా రంగంలోకి దిగిందని వార్త… గత ఏడాదిన్నరలో వెలుగులోకి వచ్చిన ప్రధాన DA కేసులను పరిశీలిస్తే, ₹100 కోట్లకు పైగా మార్కెట్ విలువ ఉన్న అక్రమాస్తుల కేసులు వరుసగా నమోదవడం తెలంగాణ ACB చరిత్రలోనే అరుదైన పరిణామంగా న్యాయ నిపుణులు, మాజీ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు…
కాళేశ్వరం, విద్యుత్తు కొనుగోళ్లు, భూముల యవ్వారాలు, గొర్లు- బర్ల స్కీములు, మిల్లర్ల సీఎంఆర్ దగ్గర నుంచి అనేక స్కాములు గత ప్రభుత్వ హయాంలో! వీళ్లకోసమా తెలంగాణ స్వరాష్ట్ర సాధన, వందలమంది అమరుల ప్రాణ త్యాగాలు అని ఓరకమైన నిర్వేదం ఆవరించేంతగా!!
నిజంగా ఏసీబీ సిబ్బంది సంఖ్యను పెంచి, మరిన్ని కీలక విభాగాల ఉన్నతాధికారులపై, అక్రమార్కులైన మాజీ ప్రజాప్రతినిధులపైనా కన్నేసి తవ్వితే… ఇంకెన్ని వందల రెట్ల, వేల కోట్ల బాగోతాలు బయటికొస్తాయో కదా! తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ధనికరాష్ట్రం… ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రం… వట్టిపోయిన ఖజానా… సంపద కొన్ని ఇళ్లల్లోనే పోగుపడింది…
ఇప్పుడు ఓ కీలక ప్రశ్న… ఆయా శాఖల్లో అధికారుల ఇళ్లే అపారమైన సంపద, వైభోగంతో వెలిగిపోతుంటే… వారి సంపాదనలకు ఉపయోగపడే విధాన నిర్ణయాలు తీసుకున్న పాలకుల మాటేమిటి..? బిడ్డలు, కొడుకులు, అల్లుళ్ల ఫామ్ హౌజుల్లో పోగుపడ్డ, విదేశాల్లోకి తరలిపోయిన సంపదల్ని ఎవరు లెక్కించాలి..? ఇంతటి అవినీతి భారతానికి అసలు ‘బాపు’ సంగతేమిటి..?
నిజాలు ఇవి… నిష్ఠురంగానే ఉంటాయి… ఎవరు శుద్ధపూసలు అనే ప్రశ్న వస్తుంది, సహజం… కానీ దున్నుకునేవాడికి దున్నుకున్నంత అనే వాతావరణం క్రియేట్ చేసి, రాష్ట్రాన్ని ఓ అవినీతి పంకిలం చేసిన పాపం ఎవరిది ‘బాపూ’..? జనంలో చర్చ జరగాల్సింది నిజానికి ఇలాంటి కీలకాంశాలపైన! కానీ ఎప్పటికప్పుడు రాజకీయం జనం ఆలోచనల్ని దిక్కుమాలిన, నిరుపయోగ అంశాలపైకి డైవర్ట్ చేయడానికే ప్రయత్నిస్తున్నాయి, ఇది మరో విషాదం!!
Share this Article