“శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని,
తనకది హీనమని తలచుకోదు”-
శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా గొప్ప మనిషి పుట్టుక పుట్టాము అని గర్వపడతాముకానీ, నిజంగా మనిషి జన్మను సార్థకం చేసుకుంటున్నామా? అన్నది అన్నమయ్య ప్రశ్న.
ఎప్పుడో 550 ఏళ్ల కిందట కాబట్టి అన్నమయ్య అలా అన్నాడు. ఇప్పుడు కుక్క బతుకు సుఖంగానే ఉంది; మనిషి బతుకే కుక్క కంటే హీనంగా ఉంది. తెలుగు భాష నిండా కుక్కపరిభాష నిందార్థంలోనే ఉంది. దీన్ని ఆధునిక శునక సుఖజీవన ప్రమాణాల ప్రకారం పునర్నిర్వచించాల్సిన అవసరముంది.
కుక్క బతుకు;
కుక్క చావు;
కుక్కను కొట్టినట్లు కొట్టడం;
కుక్కలా పడి ఉండడం;
కుక్కకున్న విశ్వాసం కూడా లేకపోవడం;
కుక్క తోక వంకర;
కుక్కకాటుకు చెప్పు దెబ్బ-
ఇలా చెప్పుకుంటూ పొతే తెలుగు భాష, సామెతల నిండా కుక్కలే కుక్కలు.
Ads
వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు అని ఇందులో ప్రధానంగా రెండు రకాలు. లాబ్రడార్, గోల్డెన్ రిట్రీవర్, జర్మన్ షెపర్డ్, బిగిల్ , హౌండ్స్ ఇంకా నానాజాతిపేర్లు వాటి బ్రీడ్ నుబట్టి, పుట్టిన దేశాలనుబట్టి వచ్చిన పేర్లు. కుక్కను పెంచుకునేవారు సాధారణంగా కుక్కను కుక్క అనరు. దానికి నామకరణ మహోత్సవం ఎస్ వీ ఆర్ చెప్పినట్లు నేత్రోత్సవంగా చేసి ఉంటారు కాబట్టి ఆ పేరుతోనే గౌరవంగా, ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.
“మా యజమానులు కుక్కలను చూసుకుంటున్నారు;
వారి పిల్లలను మేము చూసుకుంటున్నాం;
మమ్మల్ను ఎవరూ చూసుకోరు”- అని కలవారి ఇళ్లల్లో పనిమనుషులు స్వగతంలో విసుక్కుంటూ ఉంటారని లోక అపవాదం.
వీధి కుక్కల బతుకు పోరాటం సరిగ్గా గుర్తింపు పొందలేదేమో అనిపిస్తుంది. వ్యక్తిత్వ వికాస తరగతుల్లో వీధి కుక్కల పాఠాలు స్ఫూర్తిదాయకం కాగలవు.
వీధి కుక్క అన్న మాటలోనే భౌగోళికమయిన సరిహద్దు స్పష్టంగా ఉంది. ఆ వీధి, లేదా ఆ ఏరియా దాని సరిహద్దు. ఒక వీధి కుక్క ఇంకో వీధిలోకి వెళ్లదు. ఆధార్, జి పి ఎస్ ట్యాగ్ లైన్, ప్రాపర్టీ టాక్స్ పిన్ నంబర్లలాంటివేవీ లేకపోయినా వీధికుక్కలు తమ పర్మనెంట్ అడ్రెస్ విషయంలో కన్ఫ్యూజ్ కావు. అవతలి కుక్కలను కన్ఫ్యూజ్ చేయవు.
పెంపుడు కుక్కల్లాగా యజమానులు వేళకింత పడేస్తే తిని మన్ను తిన్న పాముల్లా కనీసం తోక కూడా ఊపకుండా పడి ఉండాల్సిన అవసరం కానీ, అంతటి దీన స్థితి కానీ వీధి కుక్కలకు ఉండదు. తమతో మాట్లాడేవారితో మాట్లాడుతూ, తమను పట్టించుకోనివారిని పట్టించుకోకుండా ఉండే నిర్నిబంధమయిన స్వేచ్ఛ వీధి కుక్కలకు ఉంటుంది.
ఎప్పుడూ గొలుసులు, తాళ్లతో బందీలయిన పెంపుడు కుక్కలు వీధి కుక్కల స్వేచ్చా స్వాతంత్ర్యాలు చూసి అసూయపడతాయి. వ్యాక్సిన్లు, టీకాలు, ప్రోటీన్ ఫుడ్ అంటే ఏమిటో వీధికుక్కలకు తెలియకపోయినా, ఎప్పుడూ వాడకపోయినా వీధికుక్కలు ఆరోగ్యంగానే ఉంటాయి. ఒకవేళ రోగమొస్తే పెంపుడు కుక్కల్లా వెటర్నరీ ఆసుపత్రికి వెళ్లి క్యూలో నిలుచోవు. రెండ్రోజులు మూలన కూర్చుని రెస్ట్ తీసుకుని మందుమాకు లేకుండానే రోగాన్ని నయం చేసుకుని మళ్లీ వీధిమీద పడతాయి.
కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనం కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు.
వీధికుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక అడవికుక్కల గురించి వింటే అడవులపాలయిపోతాం. అడవికుక్క సింహంతో సమానం. అది ఊళ్లోకి రావడంవల్ల గ్రామసింహం అయ్యింది.
అపార్టుమెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో మనుషుల పేర్లు వాడ్డం మానేసి లాబ్రడార్ వాళ్ల ఇల్లు, బొచ్చుకుక్క వాళ్ల ఇల్లు, రెండుకుక్కల వాళ్ల ఇల్లు అని కుక్కగుర్తుగా పనిమనుషులు, సెక్యూరిటీవారు చెప్పుకుంటూ ఉంటారు.
# హైదరాబాద్ షేక్ పేట్ లో ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. దాదాపు 500 అపార్ట్ మెంట్లు ఉంటాయి. ఒక శనివారం సాయంత్రం పిల్లలు ఒళ్లు మరచి ఆడుకుంటున్నారు. చీకటి పడుతోంది. దాగుడు మూతలు ఆడుకుంటూ ఆరేళ్ల పాప లాన్ లో బెంచ్ కింద దాక్కుని…నేనెక్కడున్నానో కనుక్కోండి…అని అరిచింది.
ఆ బెంచ్ పై కునుకు తీస్తున్న వీధి కుక్క ఆ పాపను కరిచింది. వీధి కుక్క వీధుల్లో ఉండకుండా ఇళ్లల్లోకెలా వచ్చింది? వచ్చెను పో! ఏలా కరువవలె? కరిచెను పో! ఆ అమ్మాయి ఏలా అరువవలె? అరిచెను పో! ఆ అమ్మాయి తల్లుదండ్రులు అసోసియేషన్ మీద ఏలా కేసు పెట్టవలె? పెట్టిరి పో! పోలీసులు అసోసియేషన్ వారిని ఏలా స్టేషన్ కు పిలువవలె? పిలిచిరి పో! …
ఇలా ఇప్పుడు ఆ అపార్ట్ మెంట్లో అన్నీ ప్రశ్నలే. కుల మతాలు, ప్రాంతాలకతీతంగా ఇంతకాలం కలిసి ఉన్న 500 కుటుంబాలు ఇప్పుడు వీధికుక్క కాటు వల్ల రెండుగా నిట్ట నిలువుగా చీలిపోయాయి. అసలు అపార్ట్ మెంట్లో పెంపుడు కుక్కలను కూడా నిషేధించాలి అని కుక్కలంటే భయమున్నవారు ఈ సాకుతో గట్టిగా నోరు విప్పారు.
భౌ భౌ అని వీధి కుక్కల్లా అరిచే మీ కంటే…మౌన మునులైన మా పెంపుడు కుక్కలే మంచివి అని ఆ కుక్కల యజమానులు కూడా అంతే గట్టిగా అరుస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో పెంపుడు కుక్కలకు అనుమతి లేదనడానికి వీల్లేదనే సుప్రీం కోర్ట్ తీర్పు కాపీని కుక్కల పార్టీ వారు ముందుకు తెచ్చారు. కుక్కల్లా అలా మీదికొచ్చి మొరుగుతారెందుకు? అని కుక్కల అపోజిషన్ పార్టీ వారు గళమెత్తారు. మొత్తం అపార్ట్ మెంట్ ప్రాంగణమంతా ఇప్పుడు ప్రో డాగ్- యాంటీ డాగ్ వర్గాల యుద్ధసీమగా మారింది. రష్యా- ఉక్రెయిన్ వార్ దీనిముందు దూది పింజ.
# హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో విలాసవంతమైన విల్లాల గేటెడ్ కమ్యూనిటీ. ఆ విల్లాల దగ్గర రోడ్డు పక్కన ఒక ఫ్లెక్సీ బోర్డు. “జర్మన్ షెపర్డ్ కుక్క కనిపించుట లేదు. ఒక కాలు కుంటిది. ఆడకుక్క. పట్టిచ్చినా…ఎక్కడుందో చెప్పినా నగదు బహుమతి”
ఇదివరకు ప్రతి కుక్కకూ జీవితంలో ఒకే ఒక వచ్చేది. ఇప్పుడు ప్రతి కుక్కకూ ప్రతి రోజూ వస్తోంది! ఓ మై గాడ్! డాగ్స్ మస్ట్ బి క్రేజీ!…… – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article