.
తారా సుతారియా… ఈ బాలీవుడ్ గాయని, నటి రీసెంట్ ‘టాక్సిక్’లో హాట్‌గా దర్శనమిచ్చింది గుర్తొచ్చిందా… తాజా వార్త ఏమిటంటే..? ఆమెకు మ్యాథ్స్ లర్నింగ్ కష్టంగా ఉండే ఓ అరుదైన వ్యాధి, అంత పదం అక్కర్లేదు అనుకుంటే, ఓ డిజార్డర్, ఓ డిఫికల్టీ… ఇదేమిటీ అంటారా..?
కాస్త రీల్ వెనక్కి తిప్పుదాం… మొన్నటి బిగ్‌బాస్ తెలుగు సీజన్‌లో టీవీ సెలబ్రిటీ, అప్పట్లో కొన్ని వివాదాల్లో కనిపించిన రీతూ చౌదరి… చివరకు రెండు రెళ్లు కూడా చెప్పలేదు ఏదో గేమ్‌లో, అందరూ నవ్వుతారు, ఆమె జ్ఞానం అంతేలే అనుకుని నవ్వారు ప్రేక్షకులు, కానీ సేమ్, తారా సుతారియాకు ఉన్న డిజార్డరే ఆమెకూ ఉందేమో బహుశా…
Ads
కాకపోతే తార చెప్పుకుంది, రీతూ చెప్పుకోలేదేమో! నిజానికి చాలామంది పిల్లలకు మ్యాథ్స్ అంటేనే గొట్టు సబ్జెక్టు… ఇప్పుడంత సీన్ లేదులే గానీ అప్పట్లో, అంటే మన చిన్నప్పుడు లెక్కలు రాక, చేయరాక, చేయలేక, చేయక వాయిల్ బరిగెల దెబ్బలు తిన్నవాళ్లే ఎక్కువ… అఫ్‌కోర్స్, దాని తరువాత ఇంగ్లిష్ ఓపట్టాన జీర్ణం కాకపోతుండె…
ఇంకాస్త వివరంగా చెప్పాలంటే… లెక్కలు… ఒకరికి 2+2 ఎంత అంటే వెంటనే నాలుగు వచ్చేస్తుంది. ఇంకొకరికి అదే 2+2 కూడా కాస్త ఆలోచించాలి. మరొకరికి 17, 18, 19… అంటూ ఎక్కాలు చెప్పమంటే నాలుక తిరగదు. ఇంకొందరికి నంబర్లు, తేదీలు, ఫోన్ నంబర్లు, డబ్బు లెక్కలు అన్నీ ఒకటే గందరగోళంగా అనిపిస్తాయి.
అయితే ఇదంతా తెలివితక్కువతనమేనా? కాదు. ఇదిగో ఇప్పుడు బాలీవుడ్ నటి తార సుతారియా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పడంతో ఈ చర్చ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం యష్ హీరోగా వచ్చిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’లో Rebeccaగా కనిపిస్తున్న తార సుతారియా తనకు Dyscalculia అనే learning disability ఉందని వెల్లడించింది.
అంటే… లెక్కలు నేర్చుకోవడంలో, సంఖ్యలను అర్థం చేసుకోవడంలో, వాటితో వ్యవహరించడంలో ఇబ్బంది కలిగించే ఒక ప్రత్యేకమైన learning disorder. తార స్వయంగా చెప్పిన మాటే మరింత ఆసక్తికరం.
తనకు డబ్బు, పెట్టుబడులు, బ్యాంకింగ్ వ్యవహారాలు అర్థం చేసుకోవాలనే ఆసక్తి ఉందని, కానీ లెక్కలు చేసే దగ్గర మాత్రం తరచూ తప్పులు చేస్తానని చెప్పింది. అందుకే తన తండ్రి, accounts team ఆర్థిక వ్యవహారాల్లో తనకు సహాయం చేస్తారని వెల్లడించింది.
అంటే కోట్ల రూపాయల ఆస్తులు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ గురించి నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్న ఒక నటికి… సాధారణ లెక్కలే తలనొప్పి! ఇక్కడే dyscalculia అనే పదం ఆసక్తికరంగా మారుతుంది.
మరి ‘తారే జమీన్ పర్’లో చూపించింది ఇదేనా? ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. మనకు వెంటనే గుర్తొచ్చేది అమీర్ ఖాన్ నటించిన ‘తారే జమీన్ పర్’. ఆ సినిమాలో చిన్నారి ఈషాన్ అవస్థీ చదవడంలో, రాయడంలో విపరీతమైన ఇబ్బందులు పడుతుంటాడు. చివరకు అతనికి ఉన్న సమస్య Dyslexia అని తెలుస్తుంది.
Dyslexia అంటే ప్రధానంగా చదవడం, రాయడం, అక్షరాలు- పదాలను గుర్తించడం వంటి భాషా సంబంధిత నేర్చుకునే సామర్థ్యాల్లో ఇబ్బంది. Dyscalculia మాత్రం… సంఖ్యల ప్రపంచంలో ఇబ్బంది. రెండూ learning disabilities. రెండింటిలోనూ సాధారణంగా కనిపించే విషయం ఏమిటంటే— బయటివాళ్లు దాన్ని చాలాసార్లు ‘తెలివి తక్కువ’గా పొరబడటం.
అయితే ‘తారే జమీన్ పర్’లో ఈషాన్‌కు గణితంలో కూడా ఇబ్బంది ఉన్నట్టు కొన్ని సన్నివేశాల్లో చూపించినా, సినిమా చెప్పిన ప్రధాన సమస్య dyslexia. ఒక వైద్యపరమైన విశ్లేషణ కూడా ఈషాన్‌కు dyscalculia కాదని, అతని ప్రధాన సమస్య language deficit అని పేర్కొంది.
కాబట్టి… ‘తారే జమీన్ పర్ వ్యాధే ఇది’ అనడం కరెక్ట్ కాదు. కానీ ఆ సినిమా చెప్పిన అసలు సందేశానికి మాత్రం ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతి పిల్లవాడూ ఒకేలా నేర్చుకోడు. ఒక సబ్జెక్టులో వెనుకబడినంత మాత్రాన అతను తెలివితక్కువవాడు కాదు.
మన దగ్గరైతే… ‘లెక్కలు రావా? ఏం చదువుకున్నావురా?’ మన విద్యావ్యవస్థలో లెక్కలు రాకపోవడం అంటే దాదాపు నేరమే! ‘ఎక్కాలు రావా?’ ‘డివిజన్ చేయలేవా?’ ‘పర్సంటేజీ కూడా రాదా?’ ‘ఇంత సింపుల్ లెక్క కూడా చేయలేవా?’ అంటూ పిల్లలను, పెద్దలను కూడా మనం చాలా సులభంగా ఎగతాళి చేస్తుంటాం.
నిజానికి చాలామందికి గణితం కష్టమే. కానీ dyscalculia అనేది అందరికీ ఉండే సాధారణ ‘మ్యాథ్స్ వీక్‌నెస్’ కాదు. అది మరింత తీవ్రమైన, ప్రత్యేకమైన learning difficulty.
సంఖ్యల విలువను అర్థం చేసుకోవడం, లెక్కలు చేయడం, number sequences గుర్తుపెట్టుకోవడం, numerical informationను ప్రాసెస్ చేయడం, రోజువారీ జీవితంలో డబ్బు లేదా సమయంతో వ్యవహరించడం వంటి విషయాల్లో కూడా కొందరికి గణనీయమైన ఇబ్బందులు ఉండొచ్చు.
అందుకే… ‘మ్యాథ్స్ అంటే నాకు భయం’ అనేవాళ్లంతా dyscalculia ఉన్నవాళ్లు కాదు. అదే సమయంలో… ‘లెక్కలు ఎందుకు రావు?’ అని ఎగతాళి చేసేంత సింపుల్ విషయం కూడా కాదు.
మరి రీతూ చౌదరి? ఇక్కడ మనకు తెలుగు బిగ్‌బాస్ గుర్తొస్తుంది. రీతూ చౌదరి బిగ్‌బాస్ తెలుగు కార్యక్రమంలో ఎక్కాలు చెప్పే సందర్భంలో కనబరిచిన గణిత పరిజ్ఞానం చూసి సోషల్ మీడియాలో అప్పట్లో బాగానే నవ్వులు పుట్టాయి. ‘ఈమెకు కనీసం ఎక్కాలు కూడా రావా?’ అనే స్థాయిలో ట్రోలింగ్ కూడా జరిగింది.
అక్కడి నుంచి ఇప్పుడు తార సుతారియా dyscalculia గురించి చెప్పిన విషయం గుర్తొస్తే పోలిక రావడం సహజమే. కానీ… రీతూ చౌదరికి కూడా dyscalculia ఉందని మాత్రం చెప్పలేం. ఏమో, ఉండొచ్చేమో కూడా…
మరి తారకు లెక్కలు రాకపోతే… ఇంతవరకు ఎలా? అదే అసలు పాయింట్! ఒక మనిషి ఒక విషయంలో బలహీనంగా ఉండటం వల్ల మిగతా విషయాల్లో కూడా బలహీనుడైపోడు. తార సుతారియా నటిగా సినిమాలు చేసింది. సంగీతం నేర్చుకుంది. ప్రదర్శనలు ఇచ్చింది. ఇప్పుడు పెద్ద సినిమాల్లో నటిస్తోంది.
అంటే… ఒక మనిషి గణితంలో బలహీనంగా ఉండటం అతని మొత్తం మేధస్సుకు సర్టిఫికెట్ కాదు. ఇది పిల్లల విషయంలో మరింత ముఖ్యమైన విషయం. ఒక పిల్లవాడికి మ్యాథ్స్ రావడం లేదని ‘వీడు వేస్ట్’ అనేయడం ఎంత తప్పో… ఒక పెద్దవాడికి లెక్కలు రావడం లేదని ‘వీడికి బుర్ర లేదు’ అనడం కూడా అంతే తప్పు. ఎందుకంటే మనిషి సామర్థ్యాన్ని ఒక్క సబ్జెక్టు కొలవదు…
తారకు కూడా అంతే, గుణకారాలు, భాగహారాలు, తీసివేతలు, కూడికలు తెలియవు గానీ… ఎంత సంపాదిస్తున్నాను, ఎక్కడ పెట్టుబడి పెడితే పెరుగుతుంది వంటి విషయాల్లో తెలివైందే.,. ఐనా చేతిలో స్మార్ట్ ఫోన్ ఓ పేద్ద కాలిక్యులేటర్‌గా మారిపోయాక… లెక్కలనగా ఎంత..? ఎహె, అసలు లెక్కేలేదు అంటారా..? నిజమే…!
Share this Article