Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘చీట్ స్మాల్… చీట్ మెనీ…’ ఓ ఫేక్ మేట్రిమోనీ..! ఇదోరకం ఫ్రాడ్ మనీ !!

September 17, 2026 by M S R

.

మోసములు బహురకములు… కొన్ని నమ్మబుల్ కావు… ఇదీ అలాంటిదే… అసలు అమ్మాయిల్లేరు, పెళ్లిళ్లూ లేవు, ఓ ఫేక్ మేట్రిమోనీని ఓ కంపెనీ తరహాలో నడిపించడం, అబ్బాయిల నుంచి డబ్బు వసూలు చేయడం… ఫేక్ అమ్మాయిలతో దాదాపు ఓ కాల్ సెంటర్ ధోరణిలో ఈ యవ్వారం నడిచింది… ఆ డబ్బు కూడా పరిమితంగా, రియల్ మేట్రిమోనీ అని నమ్మేట్టుగా… ఆ వార్తలోకి వెళ్దాం…

అమ్మాయి లేదు.. పెళ్లి లేదు.. అయినా పెళ్లి మాటలు మాత్రం నిజమే! ₹15 వేల చొప్పున మోసం వెనుక భారీ కాల్‌సెంటర్ గుట్టు… ‘షాదీ పార్ట్‌నర్’ పేరుతో వింత మ్యాట్రిమోనియల్ మోసం…

Ads

పెళ్లి కోసం మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ చూసుకున్నారు…. ఫోటో నచ్చింది…. అవతలి అమ్మాయి కూడా మాట్లాడింది… ఒక రోజు కాదు… రెండు రోజులు కాదు… కొన్ని రోజుల పాటు ఫోన్‌లో మాట్లాడింది… కుటుంబం గురించి చెప్పింది… తన గురించి చెప్పింది… పెళ్లి విషయాలూ మాట్లాడింది…

ఇంతవరకు అంతా నిజంగానే అనిపిస్తుంది… కానీ ఒకరోజు ఆ పెళ్లి సంబంధం కుదరదు… ‘జాతక దోషం ఉంది’ అనో.. ‘కుటుంబం ఒప్పుకోవడం లేదు’ అనో.. ‘మరో సంబంధం కుదిరిపోయింది’ అనో ఏదో ఒక కారణం… అయితే అప్పటివరకు మీరు మాట్లాడింది ఎవరో తెలుసా?

ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి కాదు. అసలు పెళ్లి సంబంధమే కాదు! అమ్మాయిల ఫొటోలు ఇంటర్నెట్ నుంచి తీసుకుని… వాటితో నకిలీ ప్రొఫైల్స్ తయారు చేసి… వాటిని చూసిన పురుషులకు ఫోన్ చేసి… అమ్మాయిలుగా నటిస్తూ మాట్లాడిన ఒక కాల్‌సెంటర్..!

ఇది సినిమా కథ కాదు… ఢిల్లీలో బయటపడిన ఒక మ్యాట్రిమోనియల్ సైబర్ ఫ్రాడ్ కేసు… ఆగ్రాలో నడుస్తున్న ఈ వ్యవహారాన్ని ఢిల్లీ పోలీసులు ఛేదించారు…

ముందు పెళ్లి చూపులు.. తర్వాత డబ్బుల వసూలు… ‘Shaadi Partner’ పేరుతో నడిచిన ఈ వ్యవహారం పైకి చూస్తే ఒక సాధారణ మ్యాట్రిమోనియల్ సంస్థలాగే కనిపించేది. పెళ్లి కోసం అమ్మాయిలను వెతుకుతున్న పురుషులను టార్గెట్ చేసేవారు… ఇంటర్నెట్ నుంచి అమ్మాయిల ఫొటోలు సేకరించేవారు… వాటితో నకిలీ ప్రొఫైల్స్ తయారు చేసేవారు…

ఆ తర్వాత వాటిని నిజమైన సంబంధాల్లా చూపించేవారు… ఎవరైనా ఆసక్తి చూపితే అసలు ఆట మొదలయ్యేది… కాల్‌సెంటర్‌లో పనిచేసే మహిళా టెలీకాలర్లు కాబోయే వధువులుగా మాట్లాడేవారు… కొన్నిసార్లు అమ్మాయి కుటుంబ సభ్యుల్లాగా కూడా మాట్లాడేవారు… అంటే అబ్బాయికి అవతల నిజంగానే ఒక కుటుంబం ఉందనే నమ్మకం కలిగించేలా మొత్తం సీన్‌ను తయారు చేసేవారు…

కొన్ని రోజుల పాటు ఇలా మాట్లాడిన తర్వాత భావోద్వేగ అనుబంధం ఏర్పడేలా చేసేవారు… ఆ తర్వాత అసలు పని… రిజిస్ట్రేషన్ ఫీజు.. ప్రొఫైల్ యాక్టివేషన్ ఫీజు.. కాంటాక్ట్ అన్‌లాకింగ్ ఫీజు.. మ్యాచ్ వివరాల కోసం మరొక చార్జీ.. ఇలా ఒక్కో పేరుతో డబ్బులు తీసుకునేవారు… ఒక బాధితుడి నుంచి మొత్తం ₹15,000 వరకు వసూలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు…

₹15 వేలే ఎందుకు?… ఇక్కడే ఈ మోసం వెనుక ఉన్న ‘బిజినెస్ మోడల్’ మరింత ఆసక్తికరంగా మారుతుంది… ఒక్కో వ్యక్తి నుంచి లక్షలు కొట్టేయాలని వాళ్లు ప్రయత్నించలేదు… ₹15 వేల దగ్గరే ఆపేయాలని టెలీకాలర్లకు టార్గెట్ ఇచ్చారు… ఎందుకు?

ఎందుకంటే… ₹10 వేలు, ₹15 వేలు పోయిన వ్యక్తి వెంటనే పోలీసుల దగ్గరకు పరుగెత్తకపోవచ్చు… ‘ఏదో మ్యాట్రిమోనియల్ సర్వీస్ ఫీజు పోయింది’ అని వదిలేయవచ్చు… అదే వేల మందికి చేస్తే? అక్కడే అసలు లెక్క.

పోలీసుల మాటల్లో చెప్పాలంటే ఇది ‘చీట్ స్మాల్.. చీట్ మెనీ’ వ్యూహం… చిన్న మొత్తమే కదా అని బాధితుడు వదిలేస్తాడు… అదే చిన్న మొత్తాలను వందలు, వేల మందితో వసూలు చేస్తే మోసం పెద్ద మొత్తంగా మారిపోతుంది… అమ్మాయి మాత్రమే కాదు.. ఆమె కుటుంబం కూడా నకిలీ! ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఒక అమ్మాయితో మాట్లాడిన తర్వాత అబ్బాయికి అనుమానం వస్తే?

మరో ‘కుటుంబం’ రంగంలోకి దిగేది… అమ్మాయి తల్లిదండ్రుల్లా మాట్లాడటం… సంబంధంపై అభిప్రాయాలు చెప్పడం… సామాజిక, ఆర్థిక కారణాలు చూపిస్తూ అబ్బాయిని తిరస్కరించడం… ఇలా మొత్తం పెళ్లి ప్రక్రియనే ఒక నాటకంలా నడిపేవారు…

ఒక సంబంధం కుదరకపోతే ఇంకో అమ్మాయి ప్రొఫైల్… అదీ కుదరకపోతే మరో ప్రొఫైల్… నెట్‌లో ఫోటోలకు కరవు లేదు కదా… అలా బాధితుడు ఇంకా సంబంధం కోసం ప్రయత్నిస్తూనే ఉండేలా చేసేవారు… కొంతమందిని రెండు మూడు నెలల పాటు ఈ వలలో ఉంచినట్టు పోలీసులు చెబుతున్నారు… చివరకు ‘మీ మెంబర్‌షిప్ గడువు ముగిసింది’ అని చెప్పి కథ ముగించేవారు…

అంటే… పెళ్లి సంబంధం వెతికిన వ్యక్తికి పెళ్లి కాదు.. ఒక ‘మెంబర్‌షిప్ ఎక్స్‌పైరీ’ మాత్రమే దక్కింది! ఇది సాధారణ కాల్‌సెంటర్ కూడా కాదు.. ఈ వ్యవహారానికి మరో పొర ఉంది…

బయటికి కనిపించడానికి సంస్థను నిజమైన వ్యాపారంలా తయారు చేశారు… సంస్థకు MSME, లేబర్ డిపార్ట్‌మెంట్ రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు… ఉద్యోగులను జాబ్ యాప్స్, పత్రిక ప్రకటనల ద్వారా నియమించుకున్నారు…

వాళ్లకు నెల జీతం… దానికి అదనంగా బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుపై ఇన్సెంటివ్… టెలీకాలర్లకు సుమారు ₹6,000–₹7,000 బేస్ జీతంతో పాటు వసూలు చేసిన మొత్తంపై 10 శాతం ఇన్సెంటివ్ ఇచ్చేవారు… నెలకు కనీస వసూళ్ల టార్గెట్లు కూడా ఉండేవి…

అంటే ఒక నకిలీ పెళ్లి సంబంధం కూడా ఇప్పుడు టార్గెట్, ఇన్సెంటివ్, కస్టమర్ కన్వర్షన్ అనే కార్పొరేట్ భాషలో నడిచిందన్నమాట… అసలు మాస్టర్‌ మైండ్ ఎవరు? ఈ వ్యవహారం వెనుక 29 ఏళ్ల ప్రాక్టీసింగ్ అడ్వొకేట్ ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు…

అతను తనను సంస్థకు ‘లీగల్ అడ్వైజర్’గా చూపించుకున్నాడు… సంస్థను ఒక మహిళ పేరుతో నడిపేలా ఏర్పాట్లు చేశాడని, బ్యాంకింగ్ వ్యవహారాలు, సిమ్ కార్డులు కూడా సంస్థ పేరుతో ఉండేలా చేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు…

fake matrimony case

సెప్టెంబర్ 4న ఆగ్రాలోని కాల్‌సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు… మహిళా మేనేజర్‌తో పాటు ఎనిమిది మంది మహిళా టెలీకాలర్లను పట్టుకున్నారు… అయితే అసలు వ్యక్తి అక్కడ కనిపించలేదు… ఫోన్లు ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు… తరువాత టెక్నికల్ సర్వైలెన్స్‌తో చివరకు సెప్టెంబర్ 8న అతడిని గుర్తించి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు…

ఫిర్యాదు వస్తే మరో ‘డ్రామా’… ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఉంది… బాధితుడు పోలీసుల దగ్గరకు వెళ్తాడనే అనుమానం వస్తే డబ్బు తిరిగి ఇచ్చే ప్రయత్నం చేసేవారు… ఎందుకంటే ఒక చిన్న మొత్తాన్ని రీఫండ్ చేసి ఫిర్యాదును ‘సర్వీస్‌పై అపార్థం’గా మార్చగలిగితే వ్యవహారం మళ్లీ కొనసాగుతుంది…

అంటే మోసం చేయడమే కాదు… ఫిర్యాదు వచ్చినప్పుడు దాన్ని కూడా మేనేజ్ చేయడానికి ఒక ప్లాన్! ఆరుగురి ఫిర్యాదులతో మొదలై.. వేల మంది? ఇప్పటివరకు ఒకే బ్యాంక్ ఖాతాతో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన కనీసం ఆరు ఫిర్యాదులకు సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు…

అయితే ఇది అంతటితో ఆగిపోదని అనుమానం… కాల్‌సెంటర్ నుంచి 47 మొబైల్ ఫోన్లు, ఏడు డెస్క్‌టాప్ CPUలు, వాట్సాప్ సంభాషణలు, ఆర్థిక లావాదేవీల వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు… వీటిని విశ్లేషిస్తే అసలు బాధితుల సంఖ్య ఎంతన్నది బయటపడే అవకాశం ఉంది… పోలీసులు వేలాది మంది బాధితులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు…

మోసాలకు కూడా కొత్త కొత్త ‘ఫార్మాట్లు’… డిజిటల్ యుగంలో మోసం అంటే OTP చెప్పించుకోవడం… బ్యాంకు ఖాతా ఖాళీ చేయడం మాత్రమే కాదు… ఎవరి బలహీనత ఏదో, అవసరం ఏదో గుర్తించడం… ఆ బలహీనతకు తగిన కథ తయారు చేయడం… దానికి తగ్గ పాత్రలు పెట్టడం… నమ్మకం కలిగించడం… చిన్న మొత్తంతో మొదలుపెట్టడం… అవసరమైతే భావోద్వేగాలను కూడా పెట్టుబడిగా మార్చడం… ఇదీ ఈ కేసు చెప్పే అసలు విషయం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘చీట్ స్మాల్… చీట్ మెనీ…’ ఓ ఫేక్ మేట్రిమోనీ..! ఇదోరకం ఫ్రాడ్ మనీ !!
  • మళ్లీ ప్రభాస్ ఆదిపురుష్‌పై ట్రోలింగ్ ! గోకి తిట్లు తినడమంటే ఇదే !!
  • హైదరాబాద్ విముక్తి దినం ! తెలంగాణ పార్టీల ఆత్మాభిమాన దరిద్రం !!
  • సీమా పాహుజా ! క్లిష్టమైన ప్రతి సీబీఐ కేసూ ఈమె దర్యాప్తు చేయాల్సిందే !!
  • వింత సర్వేలు ! చిత్త భ్రమలు !! పింక్ క్యాంపు ‘పవర్ డ్రీమ్స్’ !!!
  • యూపీఏ బాదుడులో ఎవరికెంత ఆదాయ వాటా? ఇవీ అసలు లెక్కలు!!
  • నవమినాటి వెన్నెల- దశమినాటి జాబిలి … రాసిన వేటూరికైనా సమజైందో లేదో !!!
  • పర్ సపోజ్ … 10 వేల బిల్లును యూపీఐతో ఐదు భాగాలుగా చెల్లిస్తే..?
  • UPI పై చార్జీల బాదుడు ! అమెరికా ఒత్తిడే కారణమా !?
  • రేవంత్‌రెడ్డి కార్పెట్ బాంబింగ్! కేసీయార్ మార్క్ భారీ భూకుంభకోణం!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions