.
ఓ ఆపరేషన్ చేయాలి… అనస్తీషియా ఇచ్చే ముందు డాక్టర్ అడిగాడు రోగిని, తన తరఫు అటెండెంట్‌ను… ‘మీరు కోమట్లా?… నిజమే… మీరు చదివింది నిజమే… ఓ మెడికల్ ప్రొసీజర్‌కు ముందు కులం అడగడం ఏమిటి అనే సందేహం వచ్చిందా మీకు..? కులాన్ని బట్టి వ్యక్తి మెడికల్ కాన్సిస్ట్యూషన్ ఉంటుందా..?
అసలు విషయం ఏమిటంటే..? వైశ్య సమూహంలో పరంపరగా వస్తున్న ఓ జన్యులోపం… అందరికీ పనిచేసే ఓరకం అనస్తీషియా కోమట్లకు పనిచేయకపోవడమే కాదు, కొన్నిసార్లు విపరిణామానికి దారితీస్తుంది… ఈ కథన రచయిత ఈ సమస్య వల్ల సొంత తమ్ముడిని కోల్పోయాడు కొన్నేళ్ల క్రితం…
Ads
ఇంకా వివరాల్లోకి వెళ్దాం… ఒక్క కోమట్లే కాదు, తెలంగాణ రెడ్లకు కూడా ఈ జన్యు డిజార్డర్ సమస్య ఉందని తాజా అధ్యయనం తేల్చింది… అంటే కులాన్ని బట్టి కొన్ని వ్యాధులు లేదా కొన్ని సున్నిత ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని ఆరోగ్య బలహీనతలు వారసత్వంగా తరతరాలకు సంక్రమిస్తూనే ఉన్నాయి… ఇదీ ఆ స్టడీ తేల్చిన వాస్తవం…
తరతరాలుగా ఒకే సమాజంలో పెళ్లిళ్లు.. లక్షల మందికి జన్యు వ్యాధుల ముప్పు? మన పూర్వీకుల నుంచే వచ్చిన కొన్ని జన్యువులు.. 100 తరాలు దాటినా మనలోనే!
ఒకే సమాజంలోనే తరతరాలుగా పెళ్లిళ్లు జరుగుతుంటే ఏమవుతుంది? ఇది కేవలం సామాజిక అంశం మాత్రమే కాదు.. మన శరీరంలోని జన్యువులపైనా ప్రభావం చూపుతుంది. దక్షిణాసియాలో నిర్వహించిన ఒక భారీ జన్యు అధ్యయనం ఇప్పుడు ఇదే విషయంపై ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. (మేనరికం పెళ్లిళ్లు కూడా వద్దనేది ఇందుకే… అది మరీ జన్యుసున్నితం…)
భారత్ సహా దక్షిణాసియాలోని 260 వేర్వేరు జనాభా సమూహాలకు చెందిన 2,800 మంది జన్యు సమాచారాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. అందులో కనీసం 14 సమాజాల్లో బలమైన ‘ఫౌండర్ ఎఫెక్ట్’ ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఆ సమాజాల్లో ప్రతి ఒక్కటి జనాభాపరంగా పది లక్షలకు పైగా ఉన్నవే…
ఇక్కడ ‘ఫౌండర్ ఎఫెక్ట్’ అంటే పెద్దగా జుత్తుపీక్కొని మరీ అర్థం చేసుకోవాల్సిన సంక్లిష్ట విషయం ఏమీ లేదు. ఒక కులసమూహంలోనే పెళ్లిళ్లు (క్రాస్ బ్రీడ్ జరగకుండా) పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటే, కొన్ని జన్యు సమస్యలు తరతరాలుగా సంక్రమిస్తూనే ఉంటాయి… శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ కుల సమూహాల్లోని కొన్ని జన్యు భాగాలు కనీసం 100 తరాలుగా తరం నుంచి తరానికి వస్తూనే ఉన్నాయి.

అన్నట్టు... ఆంధ్రాలో పట్టపుకాప, వడ్డె, అగ్నికుల క్షత్రియ కులాల్లో కూడా ఈ జన్యులోప పరంపర కొనసాగుతోంది...
యూదులు, ఫిన్లాండ్ కంటే కూడా ఎక్కువ! … ఇందులో ఆసక్తికరమైన విషయం మరొకటి ఉంది. ప్రపంచంలో జన్యుపరమైన ‘ఫౌండర్ ఎఫెక్ట్’కు ప్రసిద్ధ ఉదాహరణలు అష్కెనాజీ యూదులు, ఫిన్లాండ్ ప్రజలు… ఈ జనాభాల్లో కొన్ని అరుదైన జన్యు మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల కొన్ని వారసత్వ వ్యాధులు కూడా సాధారణ జనాభాతో పోలిస్తే ఎక్కువగా కనిపిస్తాయి.
కానీ దక్షిణాసియాలో గుర్తించిన మన 14 సమూహాల్లో… కొన్ని సందర్భాల్లో కనిపించిన ఫౌండర్ ఎఫెక్ట్ అష్కెనాజీ యూదులు, ఫిన్లాండ్ జనాభాలో ఉన్నదానికంటే కూడా బలంగా ఉంది… అంటే.. మన దేశంలో కొన్ని పెద్ద సామాజిక సమూహాల్లో కూడా తరతరాలుగా కొనసాగుతున్న జన్యు లక్షణాలు, వారసత్వం ఎంత బలంగా ఉన్నాయో ఈ అధ్యయనం సూచిస్తోంది.
ఈ పరిశోధనకు హైదరాబాద్‌లోని సీసీఎంబీ (CCMB)కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ నాయకత్వం వహించాగా, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఇందులో భాగస్వాములయ్యారు.
అధ్యయనంలో పరిశీలించిన సమాజాల్లో తమిళనాడుకు చెందిన అరుంధతీయర్లు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బనియాలు, మణిపూర్ బ్రాహ్మణులు, నేపాల్ బ్రాహ్మణులు, జమ్మూ కశ్మీర్‌కు చెందిన గుజ్జర్లు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుమ్హార్లు, పుదుచ్చేరికి చెందిన యాదవులు, తెలంగాణకు చెందిన రెడ్డి, వైశ్య కులసమూహాలు ఉన్నాయి.
మరి దీని వల్ల ఏం ప్రమాదం? ఇక్కడే అసలు విషయం ఉంది. మనలో ప్రతి ఒక్కరి దగ్గరా కొన్ని జన్యువులు ఉంటాయి. వాటిలో కొన్ని వ్యాధులకు కారణమయ్యే మార్పులను కలిగి ఉండొచ్చు. ఐతే అవి తప్పనిసరిగా వ్యాధుల్ని కలిగిస్తాయని కాదు… ఇంకాస్త మెడికల్ పరిభాషలో చెప్పాలంటే…
కొన్ని జన్యు వ్యాధులు ‘రిసెసివ్’ రకం. అంటే తల్లిదండ్రుల్లో ఒక్కరి నుంచి మాత్రమే ఆ లోపభూయిష్ట జన్యువు వస్తే సాధారణంగా వ్యాధి బయటపడకపోవచ్చు. కానీ తల్లి, తండ్రి ఇద్దరి దగ్గరా అదే లోపభూయిష్ట జన్యువు ఉండి, అది బిడ్డకు ఇద్దరి నుంచీ వస్తే వ్యాధి బయటపడే అవకాశం ఉంటుంది. (ఎంజైమ్ లోపాలు ప్రధానంగా…)
ఒకే సమాజంలో తరతరాలుగా వివాహాలు ఎక్కువగా జరుగుతుంటే, ఒకప్పుడు ఆ సమాజంలోని చిన్న వ్యవస్థాపక జనాభాలో ఉన్న అరుదైన జన్యు డిజార్డర్స్ మళ్లీ మళ్లీ అదే సమూహంలో కలిసే అవకాశం పెరుగుతుంది. అందుకే ఒకే కులంలో కొన్ని అరుదైన వారసత్వ వ్యాధులు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది.
తెలంగాణ వైశ్య సమాజంపై కూడా ఆసక్తికరమైన విషయం… అధ్యయనంలో దక్షిణ భారతదేశంలోని వైశ్య సామాజికవర్గానికి సంబంధించిన జన్యు సమాచారం కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ వర్గంలో ఫౌండర్ ఎఫెక్ట్ ఫిన్లాండ్ జనాభా కంటే 1.2 రెట్లు బలంగా ఉన్నట్టు అధ్యయనం గుర్తించింది.
గత పరిశోధనల్లో ఈ కులానికి చెందినవారిలో ఒక నిర్దిష్ట ఎంజైమ్ లోపం సాధారణంకంటే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు… దీని వల్ల కొన్ని మందులకు, ముఖ్యంగా శస్త్రచికిత్సకు ముందు ఉపయోగించే కొన్ని మత్తుమందులకు రెసిస్టెన్స్ ఉండటం!
పెళ్లిళ్లకూ జన్యు పరీక్షలు? ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు సూచిస్తున్న మరో విషయం మరింత ఆసక్తికరమైనది. ఇలాంటి కుల సమాజాల్లో ఎక్కువగా కనిపించే అరుదైన జన్యు వ్యాధి కారకాలను ముందుగానే గుర్తిస్తే మంచిది…
ఇలాంటి విధానం అష్కెనాజీ యూదులలో ఇప్పటికే అమలులో ఉంది. పెళ్లికి ముందు యువతలో కొన్ని సాధారణమైన రిసెసివ్ వ్యాధులకు సంబంధించిన జన్యు మార్పులను పరీక్షిస్తారు. ఆ వివరాలను గోప్యమైన డేటాబేస్‌లో ఉంచుతారు. ఎందుకంటే ఇద్దరూ ఒకే రిసెసివ్ వ్యాధి జన్యువుకు వాహకులైతే.. వారి పిల్లలకు ఆ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది…
ఇలాంటి పరీక్షలు, వైద్య సలహాల వల్ల అష్కెనాజీ యూదులలో కొన్ని వారసత్వ వ్యాధుల రేటు దాదాపు సున్నాకు చేరినట్టు హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ రైచ్ పేర్కొన్నారు… మన కులాల్లో పెళ్లిళ్లకు ముందు ఈ జన్యుపరీక్షల్ని ఊహించగలమా?
సమస్య తీవ్రత లేదు కాబట్టి నిర్లక్ష్యంగా వదిలేస్తాం… అందుకే తరతరాలుగా జన్యుసమస్యలు వారసత్వ పరంపరలో మనకు సంక్రమిస్తూనే ఉన్నాయి… ఇదీ నిజం… తెలంగాణ రెడ్లు, కోమట్లు ఈ జాబితాలో ఉన్నారని చెప్పడమే ఈ కథన ఉద్దేశం…
పెళ్లిళ్లకు ముందు గోత్రాలు, వివాహ పొంతన గణాల లెక్కలు… ఆస్తి, కుటుంబ నేపథ్యం, కొలువు, దైహిక లక్షణాలు, జాతకాలే కాదు… ఏమో, రేపు రేపు జన్యుపరీక్షల రిపోర్టులు కూడా ప్రధానం అవుతాయేమో!!
చివరగా... మరీ ప్రధానంగా... కులవాదులకు, సంప్రదాయవాదులకు రుచించకపోవచ్చునేమో గానీ... కులాల మధ్య పెళ్లిళ్లు బెటర్... అందుకే కులాంతర వివాహాలను నెగెటివ్‌గా చూడకండి... మార్పు మంచికే !!
Share this Article