ఇప్పుడు ట్రెండ్ కదా… దేశం కోసం ప్రాణాల్ని ఒడ్డే ఏజెంట్ల కథలు… అలాంటి ఓ ఏజెంట్… మస్తు యాక్షన్… కానీ ఓ ఎమోషన్, ఓ ట్విస్ట్, కథలో ఓ విశేషం ఉండాలి కదా, లేకపోతే ఎవడు చూస్తాడు..?
ఓ ఆపరేషన్‌లో కొడుకు దూరం, ఆ కోపంతో భార్య దూరం… కొన్నేళ్ల తరువాత అదే కొడుకును తనే కాపాడుకోవడం, తీరా చూస్తే ఆ కొడుకు తన పాలిట విలన్‌గా కనిపించడం… ఆ తరువాత ఏం జరిగింది..?
నిజానికి సరిగ్గా తీయగలిగితే మంచి కథే… కాకపోతే ఎమోషన్స్ బలంగా పడాలి… ఎంతసేపూ యాక్షన్ ఢాంఢూం, టిష్యూం టిష్యూం అని తుపాకీ కాల్పులు…. మడత నలగని హీరోయిజం చూపిస్తే ఎవడు చూస్తున్నాడు ఈమధ్య… అదుగో అక్కడే విజయ్ నటించిన గోట్ సినిమా దెబ్బతింది…
Ads
చూసినవాడు బకరా… అనగా గోట్… పేరుకు టైటిల్‌లోనేమో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అట… అంత సీన్ ఎంతమాత్రమూ లేదు… సూర్య, రజినీ, విక్రమ్, ధనుష్, కమలహాసన్… చివరకు తనేం మాట్లాడతాడో తనకే తెలియని సిద్ధార్థ్‌కు కూడా తెలుగులో ఫాలోయింగ్ ఉంది… ఎన్నేళ్లుగానో చాలామంది తమిళ హీరోల సినిమాల్ని స్ట్రెయిట్ సినిమాల్లాగానే ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు…
తమిళ ప్రేక్షకులు పెద్దగా తెలుగు సినిమాల్ని మాత్రం పట్టించుకోరు… ఆ తమిళ సినిమాల్ని జస్ట్, అడ్డదిడ్డంగా డబ్ చేసి తెలుగు ప్రేక్షకుల మీదకు వదిలేస్తారు తమిళ నిర్మాతలు… అతి… ఓవరాక్షన్… అదే కల్చర్… ఆ ట్యూన్లలో చిత్రవిచిత్రమైన తెలుగు పదాలు… మేం వదిలాం, మీ ఖర్మ అన్నట్టుగా ఉంటాయి ఆ డబ్ సినిమాలు…
కనీసం మిగతా హీరోలు తమ సినిమాల రిలీజ్ సమయాల్లో (అసలే పాన్ ఇండియా ట్రెండ్ కదా…) ప్రమోషన్‌కో, సినిమా పరిచయానికో పాల్పడతారు… మీరు చదివింది నిజమే, పాల్పడతారు అనే రాశాను… కానీ ఈ గోట్ సినిమాకు వీసమెత్తు హైప్ లేదు, బజ్ లేదు… మీ ఖర్మ, మీ ఇష్టముంటే చూడండిర భయ్ అన్నట్టు రిలీజ్ చేశారు… బలహీనమైన ప్రజెంటేషన్, కథనం… యువ విజయ్‌కు మేకప్, ఎఐ హంగులు అస్సలు నప్పలేదు… ఎడాపెడా ఎలివేషన్లు తప్ప సౌత్ హీరోలకు ఇంకేమీ పనిలేదు… పూరెస్ట్ క్లైమాక్స్…
తమిళంలో స్టార్ల వీరభక్తి ఉంటుంది… విజయ్‌కూ మస్తు పాపులారిటీ ఉంది… రాజకీయ పార్టీ కూడా పెట్టాడు పవన్ కల్యాణ్‌లాగే… అక్కడ తన హీరోయిజం వర్కవుట్ అవుతుంది, సినిమా ఎలా ఉన్నా దాన్ని మోయాల్సిన ఖర్మ తెలుగు ప్రేక్షకులకు ఏం పట్టింది..? అవును, ఇప్పుడదే జరుగుతోంది…
యాక్షన్ యాక్షన్ యాక్షన్… ఎందుకొచ్చిన తలనొప్పి..? హీరో, విలన్ ఓ బలమైన కంట్రాస్టు… నిజంగా బాగా పండాలి సినిమా… కానీ పడుకుండి పోయింది… అలా తీశాం, ఇలా వదిలేశాం అన్నట్టుగా…! బీజీఎం దగ్గర నుంచి ప్రతిదీ నిరాశే… హీరోయిన్ జస్ట్, ఉండాలి కాబట్టి ఉంది… అతిథి పాత్రలకు విలువే లేదు… మరీ వందలు, వేలు తగలేసి థియేటర్ దాకా వెళ్లి నానా పాట్లూ పడాల్సినంత సీనేమీ లేదు… ఆవేశపడకండి… ఆ గుండు బాస్ చెప్పినట్టు డబ్బులు ఊరకే రావు..!!
Share this Article