సోషల్ మీడియాను జస్ట్, మొత్తం ఫేక్ న్యూస్ అని తీసిపారేస్తాం కానీ…. కొన్నిసార్లు మంచి కథలు కనిపిస్తయ్… ఇదీ అంతే… ఏదో ఇంగ్లిషులో రాయబడిన చిన్న కథను ఎవరో గూగుల్ ట్రాన్స్‌లేట్ చేసి, అడ్డదిడ్డపు తెలుగులో సర్క్యులేట్ చేస్తున్నారు… కానీ కథ బాగుంది… వెరయిటీగా ఉంది… ఆలోచనాత్మకంగా ఉంది… ఆ పోస్టును కాస్త ‘చదవతగిన తెలుగు’లోకి మార్చుకుందాం, ఓసారి చదవండి… ఇది కదా పది మందికీ షేర్ చేయాల్సింది…
ఆయన వయస్సు 50 ఏళ్లు… నీరసంగా ఉంటున్నాడు… ఏదో డిప్రెషన్ కుంగదీస్తోంది… జీవితం పట్ల నిరాశ, ఏదో అసంతృప్తి, దిగాలుగా కనిపిస్తున్నాడు… నిజానికి ఈ వయస్సులోనే ఎవరైనా సరే, బాధ్యతలన్నీ ఒక్కొక్కటే వదిలించుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి… తనకు ఇష్టమైన వ్యాపకాల్లోకి మళ్లిపోవాలి… ఆఫ్టరాల్ ఆస్తులు, పోస్టులు, డబ్బు వస్తయ్, పోతయ్,… మంచి జ్ఞాపకాలే జీవితాంతం వెన్నంటి ఉంటయ్…
ఆయన భార్య ఓ క్లినికల్ సైకాలజిస్ట్ అపాయింట్‌మెంట్ తీసుకుంది… ఆయన కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాడు… ముందుగా కొన్ని వ్యక్తిగత వివరాలు అడిగాడు… నువ్వు బయటికి వెళ్లి కూర్చోమ్మా అని ఆమెను బయటికి పంపించేశాడు…
Ads
‘‘ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లం ఏమిటి..? ఎందుకు ఈ దిగాలు, డిప్రెషన్… ఏమైంది మీకు, శారీరకంగా కూడా ఏ వ్యాధులూ లేవు… మరిక ఏం బాధ..?’’
‘‘నిజం డాక్టర్, చాలా ఆందోళనగా ఉంటోంది… చాలా చిక్కులు… ఉద్యోగంలో ఒత్తిడి పెరిగింది, పిల్లల చదువులు ఓ కొలిక్కి రావాలి, వాళ్లు స్థిరపడాలి, పెళ్లిళ్లు కావాలి, ఇంటి లోన్ తీర్చాలి, కార్ లోన్ అలాగే ఉండిపోయింది… అన్నీ ప్రెజర్ పెంచుతున్నయ్…’’
ఆయన ఓ డిఫరెంట్ సైకాలజిస్టు… పదే పదే కౌన్సిలింగు సెషన్స్ తీసుకుంటూ డబ్బులు పీక్కునే రకం కాదు…
‘‘నువ్వు పదో తరగతి ఏ స్కూల్‌లో చదివావ్..?’’
ఆయన ఏదో చెప్పాడు… తరువాత డాక్టర్ ఆయనకు ఓ సలహా ఇచ్చాడు, తరువాత తన దగ్గరికి రమ్మన్నాడు… మందులు కాదు, యోగ కాదు, మెడిటేషన్ కాదు, ఎక్కడికైనా గాలిమార్పిడి, స్థలమార్పిడికి వెళ్లమనే సూచన కూడా కాదు… నిజానికి అది విని ఆశ్చర్యపోవడం రోగి వంతైంది…
‘‘మీరు మీ బడికి వెళ్లండి, మీరు టెన్త్ క్లాసులో ఉన్నప్పటి రిజిష్టర్ అడిగి తీసుకొండి, మీ క్లాస్‌మేట్ల పేర్లన్నీ రాసుకొండి, అడ్రెస్సులు సేకరించండి, వారు ఇప్పుడు ఎలా ఉన్నారో వివరాలు సేకరించండి… మీ మైండ్ డైవర్ట్ కావడమే కాదు, మిమ్మల్ని యథాస్థితికి తీసుకొస్తుంది… బహుశా మీరు మళ్లీ నా దగ్గరకు రాకపోవచ్చు…’’
ఆ పెద్దమనిషి డాక్టర్ చెప్పినట్టుగానే బడికి వెళ్లాడు… ఎక్కడో పాత బీరువాలో ఉన్న ఆ పాత రిజిష్టర్ తీసుకుని, దుమ్మదులిపాడు… ‘‘ఏం సార్, స్టడీ సర్టిఫికెట్ కావాలంటే నేనిస్తాను కదా, మీకెందుకు ఈ పేర్ల తనిఖీలు..?’’ అన్నాడు ఓ క్లర్కు నవ్వుతూ…
‘‘కాదు సార్, అల్యూమినీ (పూర్వ విద్యార్థుల) భేటీ ప్లాన్ చేస్తున్నాను’’ అన్నాడు… ఈమధ్య ఆ ట్రెండ్ కనిపిస్తోంది కదా, క్లర్క్ అభినందనగా చూసి తలపంకించాడు…
మొత్తం 120 పేర్లున్నయ్, తన సెక్షన్, మరో సెక్షన్ కలిపి… ఇక ఇంటికెళ్లి, ఒక నెల మొత్తం ఇదే పనిలో పడ్డాడు… రేయింబవళ్లూ ఫోన్లు, వివరాల సేకరణ… అంతా రాసిపెడుతున్నాడు… కేవలం 80 మంది వివరాలు మాత్రమే దొరికాయి…
ఆశ్చర్యం… వారిలో 20 మంది ఆల్‌రెడీ చనిపోయారు… ఏడుగురు తమ జీవిత భాగస్వాములను కోల్పోయారు… 13 మంది విడాకులు తీసుకున్నారు… 10 మంది వ్యసనాలకు బానిసలయ్యారు… ఎలా బతుకుతున్నారనేది విలువ లేని విషయం… అయిదుగురు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు… ఆరుగురు మాత్రం బాగా ధనికులయ్యారు… ఇద్దరికి పక్షవాతం, సగం మందికి సుగర్ లేదా ఆస్తమా ఉంది… ఇద్దరు కేన్సర్ రోగులు… ఒక జంట ప్రమాదంలో గాయపడి, వెన్నెముక దెబ్బతిని మంచం మీదే బతుకుతోంది… ఒకడు జైలులో ఉన్నాడు… మరొకాయన రెండు విడాకుల అనుభవాల తరువాత మూడో పెళ్లి కోసం వెతుకుతున్నాడు… ఇద్దరి పిల్లలు మానసిక వికలాంగులు, ముగ్గురో నలుగురి పిల్లలో బేవార్స్‌గా తిరుగుతూ అన్‌వాంటెడ్ ఎలిమెంట్స్‌గా మారిపోయారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి పేరు వెనుక ఓ విషాదపర్వం… దాదాపుగా…
తాను రాసుకున్న సమాచారాన్ని ఓ క్రమపద్ధతిలో పాయింట్ల వారీగా క్రోడీకరించాడు, ఆ డాక్టర్ వద్దకు వెళ్లాడు, వినిపించాడు… ఇప్పుడు చెప్పు నీకు ఏమనిపిస్తోంది అనడిగాడు డాక్టర్ చిరునవ్వుతో…
‘‘నీకు రోగాల్లేవు, ఆకలి బాధల్లేవు, కోర్టు కేసుల్లేవు, నీ కుటుంబసభ్యులు కూడా ఆరోగ్యంగా ఉన్నారు, తెలివైనవాళ్లు… పైగా జరగబోయేది ఏదైనా సరే, నువ్వు ఆపలేవు, ఆహ్వానించాల్సిందే… ఏం జరుగుతుందో కూడా ఎవడూ చెప్పలేడు… మరి రేపటి మీద చింతతో ఈరోజును ఎందుకు నాశనం చేసుకోవడం..? మీరిక వెళ్లిరండి’’ అన్నాడాయన… తను డోర్ తీస్తుండగా మళ్లీ తనే ఓ మాటన్నాడు…
‘‘ఇతరుల పళ్లేలలో ఏముందో చూడటం మానేయండి, మీ పళ్లెంతో ఆహారాన్ని ఆస్వాదించండి… ఇతరులతో పోలిక వద్దు, ఎవరి జీవితం వాళ్లదే…’’
ఏమిటి… మీకు కూడా బడికి వెళ్లి, పదో తరగతి రిజిష్టర్ తిరగేయాలని అనిపిస్తోందా… శుభం…
Share this Article