Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో తెలుగు సినిమాల్లో భలే కథాంశాలు… ఈ బుడ్డిమంతుడు కూడా అదే…

February 26, 2024 by M S R

Subramanyam Dogiparthi……. బాపు గారి క్లాస్ & మాస్ సినిమా . ఉత్తర ధృవం , దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు . మాధవాచార్యులు , గోపాలాచార్యులు . విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే .


బడి vs గుడి . ఏది ముఖ్యం ? ఇప్పటి రోజుల్లో గనక ఇలాంటి చర్చను సినిమాలో పెడితే , ఆ సినిమాను బహిష్కరించమని సోషల్ మీడియాలో పిలుపు ఇస్తారు . ఘట్టి ఆస్తికులు ఇదే చర్చ మసీదుకు , చర్చికి కూడా పెడతారా అని నిలదీస్తారు కూడా .

భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా బులబాటం తీర్చుకుంటే తప్పు లేదురా అనే చార్వాకం పాట , నను పాలింపగ నడిచీ వచ్చితివా మొరలాలింపగ తరలీ వచ్చితివా గోపాలా అనే భక్తితో నిండిన పాట రెండు విభిన్న జీవన శైలులను చూపిస్తాయి . ఇంత కన్నా గొప్ప వేదాంత చర్చ ఏముంటుంది !! గుడిలో ఏముంది, అంతా బడిలోనే ఉంది అనే ఎర్ర పాట . తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా గడసరి తుమ్మెదా , పచ్చి మిరపకాయలాంటి పడుచుపిల్లరో దాని పరువానికి గర్వానికి పగ్గమేయరో , గుట్ట మీద గువ్వ కూసింది కట్ట మీద కౌజు పలికింది పాటలు శ్రావ్యంగా ఉంటాయి .

Ads

కుర్రాళ్ళంగా ఉన్న రోజుల్లో భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా అనే హుషారయిన పాట ఫేవరేట్ సాంగ్ . కంఠస్థం చేసాం కూడా . బాపు గారంటే నదులు , పడవలు , తోటలు , ప్రకృతి ఉండాలి కదా ! ఈ పాట బోటు మీదనే . మరో గొప్ప పాట టాటా వీడ్కోలు గుడ్ బై ఇంక సెలవు . కె వి మహదేవన్ సంగీతం , ఆరుద్ర దాశరధి నారాయణరెడ్డిల సాహిత్యం అద్భుతం . ఈ సినిమాలో పాటలు పాపులర్ కావటానికి సంగీతం దోహదపడిందా లేక సాహిత్యం దోహదపడిందా అనే చిరకాల చర్చను గుర్తుకు తెస్తుంది .

ముళ్ళపూడి వారి మాటలు తూటాలే . సినిమాలో చాలా డైలాగులు ఆ తరం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే . నాగభూషణాన్ని ఏడిపించే గుమ్మడి కాయ ప్రహసనం సరదాగా ఉంటుంది . చాలా గ్రామాల్లో ఆరోజుల్లో పాఠశాలలు ఎలా ఉంటాయో చక్కగా చూపించారు .

విజయనిర్మలకు ANR సరసన హీరోయిన్ గా చక్కని పాత్ర . తల్లిగా శాంతకుమారి పాత్ర , ఆమె నటన చాలా గొప్పగా ఉంటుంది . నాగభూషణం , అల్లు రామలింగయ్య , రుక్మిణి , సూరేకాంతం , గుమ్మడి , కృష్ణంరాజు , సంధ్యారాణి , భానుప్రకాష్ , పద్మనాభం ప్రభృతులు నటించారు .

ఈ సినిమాలో మరో హైలైట్ మాధవయ్య కృష్ణునితో తాదాత్మ్యత చెందుతూ కబుర్లు చెప్పటం . ANR , శోభన్ బాబుల చేత బాపు ఎంత బాగా నటింపచేసారంటే మనమే కృష్ణుడితో మాట్లాడుతున్నామా అని అనిపిస్తుంది . సూపర్బ్ సన్నివేశాలు . నిత్యం పూజించుకునే దైవానికి దూరం చేసినప్పుడు మాధవయ్య పాత్రలో ANR నటన మరచిపోలేనిది .

షూటింగ్ ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలోని ర్యాలీ , వెలిచేరు ప్రాంతాలలో జరిపారు . సాక్షి కూడా ఈ ప్రాంతంలోనే తీసారట . స్టూడియోలలో కృత్రిమ సెట్టింగులలో సినిమా తీయడమంటే బాపు గారిని చీకటి కొట్లో బంధించినట్లే . ఆయన్ని ప్రకృతికి వదిలేస్తే , స్వేఛ్ఛగా హాయిగా మనస్ఫూర్తిగా సినిమా తీసుకుంటారు . 1975 లో తమిళంలోకి , 1994 లో హిందీ లోకి రీమేక్ అయింది .

మా నరసరావుపేటలో నాగూర్వలి టాకీసులో అడింది . ఓ అయిదారు సార్లు చూసి ఉంటానేమో ! టి విలో అయితే లెక్కే లేదు . వచ్చిన ప్రతి సారీ కాసేపయినా చూడాల్సిందే . అంత ఇష్టమైన సినిమా నాకు . ఈ సినిమాతో నాకు మరో బంధం కూడా ఉంది . ఈ సినిమాలో ANR సైకిల్ లాగానే నా సైకిల్ కూడా యమా షోగ్గా , సోగ్గా ఉండేది . రెండు బెల్లులు , హార్న్ , పిల్లలు కూర్చునే సీటు , హబ్బో అన్నీ ఉండేవి . నా సైకిల్ని బుధ్ధిమంతుడు సైకిల్ అని పిలిచే వారు . అదీ మా బంధం.

యూట్యూబులో ఉంది . ఈ తరంలో చూడని పిల్లకాయలు ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి . ఇలాంటి క్లాస్ & మాస్ కళాఖండం చూడకపోతే ఎలా !? Hats off to Bapu , the Romantic – Theistic – Nature Director . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels #telugucinema #TeluguCinemaNews 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బెంగాల్ ఎన్నికలు..! నట్లు బోల్టులు టైట్ చేస్తున్న ఎన్నికల సంఘం…!
  • చిట్టిబాబు లీక్స్..! తనకూ ఓ పేజీ ఉంది టాలీవుడ్ చరిత్ర పుస్తకంలో..!!
  • కాళేశ్వరం తీర్పు… క్లీన్ చిట్ కాదు… కమిషన్ రూల్స్ పాటించలేదు అని…
  • Inter Caste Marriages… ‘కులాన్ని’ దాటేస్తున్న కొత్త తరం…
  • పొద్దున్నే పుట్టింది చందమామ… మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ…
  • వీడు ఓ ఎంపీ… మహిళా నేతలపై రోత వ్యాఖ్యలు… కిక్కుమనని విపక్షం…
  • ‘యాంటీ హిందూ’ లెన్స్‌కార్ట్‌… స్టాక్‌మార్కెట్ బాగానే శిక్షిస్తోంది…
  • సిక్సర్ల అభిషేకుడిని పడేసిన లైలా..! పాత ట్రాజెడీ మరిచి కొత్త బంధం…!
  • పూసల పిల్ల మోనాలిసా కేసులో మరో ట్విస్టు… పోలీసులతో గేమ్స్…
  • ఏమైంది ఈ గ్రూపుకి..? రతన్ టాటా గనుక బతికి ఉంటే ఏమైపోయేవాడో…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions