Amrut Distilleries from Bengaluru wins “World’s Best Whiskey” title at 2024 International Spirits Challenge in London…. అని ఓ వార్త కనిపించింది పొద్దున్నే… లండన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ స్పిరిట్స్ చాలెంజ్ పోటీలో వరల్డ్ బెస్ట్ విస్కీ అవార్డు కొట్టేసిందట… సరే, మంచిదే… రకరకాల పోటీలు జరుగుతూ ఉంటాయి, జరిపిస్తూ ఉండాలి, అదే స్పిరిట్ అంటే… ఎందుకంటే..?
ప్రచారం కోసం, మార్కెటింగ్ కోసం ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఉండాలి కదా… అప్పట్లో దట్టమైన పొగ, ధారాళమైన దగ్గు అని ఓ సిగరెట్ యాడ్‌కు సెటైర్ వినిపించేది… ఇప్పుడూ అంతే… అసలే సింగిల్ మాల్ట్ విస్కీల్లో ఇండియన్ డిస్టిలరీస్ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి… విదేశాల నుంచి దిగుమతి కాదు, ఎగుమతులు చేస్తున్నాం… మన దేశంలో మద్యం యాడ్స్ నిషిద్దం… ఏదో సోడా పేరు, మినరల్ వాటర్ పేరు పెట్టేసి సరోగసీ యాడ్స్ (పరోక్షంగా బ్రాండ్ ప్రమోషన్) చేసుకోవాల్సిందే గానీ వేరే దేశాల్లో వోకే…
మొన్నామధ్య మన ఇండియన్ బ్రాండ్ ఇంద్రి ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ విస్కీగా ఎంపికైంది అని వార్తలొచ్చాయి… ఇప్పుడు అమృత్… అందుకే ముందే చెప్పుకున్నాం కదా, బోలెడు పోటీలు… మనం అవార్డులు చేజిక్కించుకోవాలి అని… ఈ సందర్భంగా మనం అప్పట్లో, అంటే ఏప్రిల్‌లో రాసుకున్న ఓ కథనం మరోసారి…
Ads
బ్రాండీ, విస్కీ, వోడ్కా, జిన్, రమ్, బీర్, షాంపేన్… మద్యంలో బోలెడు రకాలు… మళ్లీ వాటిల్లోనూ రకరకాలు… ఉదాహరణకు విస్కీలో స్కాచ్, బ్లెండెడ్, సింగిల్ మాల్ట్ వంటివి… అన్ని స్కాచులూ విస్కీలే కానీ విస్కీలన్నీ స్కాచులు కావు అని ఓ పాపులర్ సేయింగ్… ధర, ఫ్లేవర్, ఏజ్, సాఫ్ట్ నెస్, అందుబాటు, హ్యంగోవర్, ఆల్కహాల్ పర్సంటేజీ… వీటిని బట్టి జనం ఇష్టాయిష్టాలు ఆధారపడి ఉంటయ్…
బీర్ ఎంత ఫ్రెషయితే అంత ఇష్టం… అదే విస్కీ ఎంత పాతదైతే అంత రేటు… అలాగే ఏ టైంకు, ఏ సందర్భానికి, ఏ మూడ్‌కు ఏం తాగాలో కూడా లెక్కలుంటయ్… తాగడం వేరు, చప్పరించడం వేరు… వోడ్కాలో సోడా, కోక్ వంటివేమీ కలపరు… స్కాచ్‌లో జస్ట్ ఐస్‌క్యూబ్స్ అంతే… ఇలా మద్యం ఓ అనంతమైన సబ్జెక్టు… తాగితే ఒడవదు, అంతూదరీ దొరకదు… అసలు మద్యం సంస్కృతిలోనే ఉంది కదా… పాత రోజుల్లో దేవతల ఉత్సవాలు అంటే, అడవుల్లో, వెన్నెల్లో, బలులు, మద్యం, నడుమ నెగడు, సామూహిక నృత్యాలు, సంభోగం, పాటలు ఎట్సెట్రా…
నిజానికి మద్యంపై ఇష్టం ధరను బట్టి, ఏజ్‌ను బట్టి, కిక్కును బట్టి, తయారీ సరుకును బట్టి కాదు… కొన్ని కొందరికి నచ్చేస్తాయి, వదలరు… టాలీవుడ్ ప్రముఖుడొకరికి చీపైనా సరే మ్యాన్షన్ హౌజ్ బ్రాండీ ఐతేనే ఎక్కుతుంది… అది వదలడు… మరొకాయనకు రమ్ కావాలి… బ్రాండ్ ఏదనేది అనవసరం… ఇంకో హీరో జస్ట్ రెడ్ వైన్ తాగేసి పడుకుంటాడు… ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, ప్రపంచ మద్యం ఇండస్ట్రీ తేల్చేసింది ఏమిటంటే..? ఇండియా విస్కీ ప్రియ దేశం అని…
మరి ఇంతటి విస్కీ ప్రియ దేశం కదా, తయారీలో అమ్మకాల్లో టేస్టులో ప్రపంచాన్ని దున్నేయాలి కదా అంటారా..? ఎందుకు ఈరోజుకూ స్కాచ్ విస్కీయే రాజ్యమేలుతుందీ అంటారా..? నో, ఆ రోజులు గతిస్తున్నాయి… ఇప్పుడు ఇండియన్ మేడ్ విస్కీ సరిహద్దులు దాటి విస్కీ పాత రాజ్యాల్ని కూలగొట్టేస్తోంది… ప్రత్యేకించి సింగిల్ మాల్ట్ (ఒకేరకం గ్రెయిన్స్ నుంచి తయారీ) లో… తాజాగా ప్రపంచ అత్యుత్తమ విస్కీగా ఇంద్రీ ఎంపికైంది… బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్‌తో పాటు 25 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న భారత మద్య దిగ్గజం…
జస్ట్, నవంబర్ 2021లో ప్రారంభించిన తయారీ ఇది… ప్రపంచ విస్కీ అవార్డ్స్, ఇంటర్నేషనల్ విస్కీ కాంపిటీషన్ వంటి ప్రఖ్యాత ఈవెంట్లలో మంచి అవార్డులు కొట్టింది… సరే, స్కోచ్ ర్యాంకు- ఆస్కార్ అవార్డులలాగే ఇవీ మేనేజ్డ్, మార్కెటెడ్, అరేంజ్డ్… ఇలాంటివి బోలెడు సంస్థలు బోలెడు అవార్డులు ఇస్తాయి, అవన్నీ పక్కన పెడితే… గత ఏడాది కంటే 599 శాతం వృద్ధితో, పికాడిలీ డిస్టిలరీస్ యాజమాన్యంలోని ఇంద్రి, భారతదేశంలో మార్కెట్ వాటాలో 30 శాతానికి పైగా ఆధిపత్యం కైవసం చేసుకుని, హద్దులు దాటి అనేక దేశాల్లోకి వ్యాపించింది… ఇవి ఇండస్ట్రీ వేసిన లెక్కలే…
ఐతే ఇండియాలోనే చాలాచోట్ల ఇది దొరకదు, కారణాలు బోలెడు ఉండవచ్చుగాక… సింగిల్ మాల్ట్ ఇండియన్ మార్కెట్‌లో గత ఏడాది Confederation of India Alcoholic Beverages Companies (CIABC). లెక్కలు పరిశీలిస్తే… 6.75 లక్షల కేసులు అమ్ముడుబోతే అందులో 3.45 లక్షల కేసులు ఇండియా తయారీయే… మిగతావి స్కాటిష్, ఇతరత్రా… అంటే దిగుమతి మద్యంకన్నా (సింగిల్ మాల్ట్ కేటగిరీలో) మన తయారీ మద్యమే ఇక రాజ్యమేలబోతోంది…
సింగిల్ మాల్ట్ బ్రాండ్లలో ఇండియాలో అమృత్, పాల్ జాన్, గ్యాన్ చంద్, రాంపూర్, ఇంద్రి బ్రాండ్ల ధరలు 3 వేల నుంచి 10 వేల వరకూ ఉంటాయి… ఏజ్ బట్టి..! కొన్ని స్కాచ్ కంపెనీలు ఏకంగా ఇండియాలోనే తయారీ ప్రారంభించాయి… మరి వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ కదా… లోకల్ మేడ్‌తో తయారీ చౌక, పోటీ ఈజీ, మార్జిన్ ఎక్కువ… ఇండియాలో, ప్రత్యేకించి సౌత్ ఇండియాలో పైన చెప్పిన బ్రాండ్స్ సేల్స్ తక్కువే… ఎంతసేపూ జానీవాకర్, గ్లెన్ బ్రాండ్… హైదరాబాద్ విస్కీ మార్కెట్ అయితే, సింగిల్ మాల్ట్, బ్లెండెడ్ వంటి తేడాల్లేకుండా మరీ టీచర్స్, వ్యాట్69, బ్లాక్ అండ్ వైట్ సేల్సే అధికం… సో, మొత్తానికి మేక్ ఇన్ ఇండియా నినాదం విస్కీ తయారీలో కూడా కిక్కు అయినట్టే అన్నమాట… సారీ, క్లిక్కయినట్టే అన్నమాట..!! (ఏప్రిల్ 14, 2024)
Share this Article