Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాడు మొనగాడు – చేతిలో పార, గడ్డపార… కళ్లెదుట ఓ ‘దారి’…!

July 31, 2026 by M S R

.

ముందుగా ఓ కథ చదవండి… నిజమైనదే… నేను రాసిందే కొన్నాళ్ల క్రితం, మళ్లీ కొన్ని ఫేస్‌బుక్ పేజీల్లో యథాతథంగా పోస్ట్ చేసుకుంటున్నారు… ఒకరిద్దరు దీన్నే నాకు వాట్సప్ చేసి, ఏం, మీరు రాయలేరా ఇలాంటివి అనీ అడిగారు..!! సరే, ఓసారి లుక్కేయండి… తరువాత ఫాలో అప్ చెబుతాను…

ఆమె…. డాక్టర్ బృంద ఐఏఎస్… కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె…! కాస్తోకూస్తో జనం కోణంలో… ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్…! అదసలే ఒడిశా… బీమారు రాష్ట్రాల్లో ఒకటి… అంతులేని పేదరికం, జాడ తెలియని అభివృద్ధి… అనేకానేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే ఉండదు, వైద్యం అందదు… ఆమె ఓరోజు పత్రికలు చదువుతుంటే ఆమెను ఓ వార్త ఆకర్షించింది…

Ads

అది సంపూర్ణంగా చదివింది… వివరాలు తెప్పించుకున్నది… ఓ కలెక్టర్‌గా సిగ్గుపడింది… ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా అని తలవంచుకున్నది… డ్రైవర్‌ను పిలిచింది, గుమ్సాహి అనే ఊరి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పింది… డ్రైవర్ పరేషాన్… ఆమె బయల్దేరింది…

ఆ ఊరు చేరుకున్నది… ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు అని అడిగింది…. ఏమిటీ కథ నేపథ్యం..?ఆయన ఓ మట్టిమనిషి… వయసు 45… పుల్బనీ తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు… ఒంటిచేత్తో కొండను తొలిచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ్ మాంఝీ కథ తెలుసు కదా… సేమ్, ఈయన ఒడిశా మాంఝీ… ఎందుకో తెలుసా..? తనూ అంతే… ఆ ఊరికి రోడ్డు లేదు, నిజం చెప్పాలా..? కరెంటు కూడా లేదు, మంచినీటి సరఫరా ఆశించేదే లేదు…

ఒక్కొక్కరే ఊరు విడిచి వెళ్లిపోయారు… ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ జలంధర్… ఎందుకు..? తన ఊరి నుంచి పుల్బనీలోని పాఠశాలకు పిల్లలు వెళ్లాలన్నా అవస్థలే… ఎవరిని ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదాయె… లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు అస్సలు పట్టదాయె… అసలు ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నాయకులు, ఈ అధికారులు అని అర్థమైంది…

దాంతో ఓ ఆలోచనకు వచ్చాడు… కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేనా…? భార్య సద్దిమూట కట్టి ఇచ్చింది… ఓ పలుగూ, ఓ పార పట్టుకుని బయల్దేరాడు… రోజూ పొద్దున మొదలు పెట్టి సాయంత్రం దాకా తనే రోడ్డు వేయడం మొదలు పెట్టాడు…

రాళ్లూరప్పల్ని తొలగిస్తూ, రోడ్డు వేసుకుంటే పోతున్నాడు… మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు తన టార్గెట్… ఒక్కడూ సహకరించినవాడు లేడు… అయితేనేం..? ఆ గడ్డపార ఆగలేదు, ఆ పార అలిసిపోలేదు… రెండేళ్లు… నమ్మండి… రెండేళ్లపాటు కష్టపడ్డాడు…

నా జీవిత లక్ష్యం అదే అని తీర్మానించుకుని అదే పనిలో మునిగిపోయాడు… 8 కిలోమీటర్ల రోడ్డు తనొక్కడే నిర్మించాడు… ఓరోజు ‘గుండెలో తడి’ ఇంకా మిగిలిన ఓ స్థానిక పత్రిక జర్నలిస్టు ఆ కథను రాశాడు… అదీ ఆ కలెక్టర్ దగ్గరకు చేరింది… ఆమె చదివింది… ఆమె కళ్లు చెమర్చాయి… అప్పటికింకా ఐఏఎస్ తాలూకు దుర్వాసనలు ఏమీ అంటనట్టున్నాయి…

ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా సిగ్గుపడాలి కదానే భావన ఆమెను తలవంచుకునేలా చేసింది… అందుకే ఆ ఊరికి బయల్దేరింది…అతన్ని కలిసింది… మాట్లాడింది… ‘ఏం లేదు మేడమ్… మూడేళ్లు ఆగండి, నేనా రోడ్డును పూర్తి చేస్తాను’ అన్నాడు జలంధర్… ఆమె మరింత సిగ్గుపడింది… ఓసారి రోడ్డు చూద్దామంటూ వెళ్లింది…

ఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని, నిబద్ధతను, కష్టాన్ని, సంకల్పాన్ని చూసింది… ఆమెలో కలెక్టర్ అనే పాత్ర నిద్రలేచింది… అయ్యా, మీ త్యాగం నిరుపమానం అని ఆయన చేతులు పట్టుకున్నది… మిగతా ఆ ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇక నాకు వదిలెయ్ అని చెప్పింది… తనకు అందుబాటులో ఉన్న ఏవో నిధులను అడ్జస్ట్ చేసింది…

inspirational story

ఆ రోడ్డు పూర్తయ్యేదాకా దాని నిర్మాణ పర్యవేక్షణకూ తననే నియమించింది… అంతేకాదు, ఇప్పుడా ఊరికి కరెంటు పోల్స్, లైన్స్ పడుతున్నాయి… మంచినీటి సరఫరా ప్రణాళికా రూపుదిద్దుకున్నది…

మరో విషయం… ఈ రెండేళ్లపాటు తను చేసిన పనికి ఉపాధి హామీ కింద డబ్బులు ఇవ్వటానికి కూడా ఆమె అంగీకరించింది… వావ్… ఇవీ కదా సక్సెస్ స్టోరీలు… ఇవీ కదా పది మందికీ స్పూర్తినిచ్చే అసలు విజయగాథలు…!!

……. ఇదీ అసలు కథ… కాపీ చేసుకుని, పోస్ట్ చేసుకునేవారు కనీసం దాని ఫాలోఅప్ ఏమిటో రాసినా బాగుండు, అదీ చేయరు… నిజానికి జరిగింది ఏమిటంటే..? ఆ కలెక్టరమ్మ ఉపాధి హామీ కింద తనకు డబ్బులిచ్చింది, కరెంటు వచ్చింది, వెహికిల్స్ వచ్చీపోయేలా రోడ్డు పూర్తి చేసింది… అక్కడే తాగునీటి పథకం పెట్టారు… ఆ కలెక్టరమ్మ ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్, ఒడిశా మిషన్ డైరెక్టర్‌గా చేస్తోంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వాడు మొనగాడు – చేతిలో పార, గడ్డపార… కళ్లెదుట ఓ ‘దారి’…!
  • కేసీయార్ సార్, మీ విజ్ఞతపై ఇంకా నమ్మకముంది… మరి ఇదేం పోకడ !?
  • ప్రతి పనికీ పార్టీ ఆమోదమా? ఇవి సీఎం ముందరికాళ్లకు బంధాలు?
  • అనుకున్నదే ! బొద్దింకలకు జతగా క్రిమినల్స్ ! ఏదో ప్రిప్లాన్‌డ్ స్కెచ్ !!
  • రామాయణ్ దర్శకుడు నితేశ్ తివారీ నాకెక్కడ నిజంగా నచ్చాడంటే..!?
  • రక్తసంబంధాలు పెళుసుగా మారి… ఇంటింటికో ఇలాంటి కథ!
  • నిండుకుండ ఎల్లంపల్లి గేట్లు ఓపెన్ ! – గులాబీ నోళ్లు క్లోజ్ !!
  • పెద్ది సుదర్శన్ రెడ్డి కాలధర్మం ! ఫలించని ఆధునిక వైద్య చికిత్స !
  • తెలంగాణ ప్రభుత్వమా… బహుపరాక్! నీళ్లను జనరేట్ చేయలేం..!!
  • ఒక సిద్ శ్రీరామ్ – ఒక ఎస్పీ బాలు … పూర్తి కంట్రాస్టు ఉచ్చారణ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions