ఆరోజు అనుకోకుండా కలిశాడు తను… నా పాత క్లాస్‌మేట్… దాదాపు ముప్ఫయ్ సంవత్సరాలు అయ్యిందేమో మేం ఒకరికొకరం చూసుకుని… ఆ హోటల్ లాబీలో తనను చూడగానే మొదట సంబరం అనిపించింది… పాత మిత్రుడిని చూసినందుకు… అదేసమయంలో వాడిని చూసి జాలేసింది…
మామూలు సాదాసీదా బట్టల్లో ఉన్నాడు… నా ఆడంబరపు అప్పియరెన్స్‌తో పోల్చుకుంటే వాడి మీద జాలేసింది అందుకే… నన్ను చూసి, నా పలకరింపు విని బాగా ఆనందపడ్డాడు… ఇద్దరమూ ఫోన్ నంబర్లు మార్చుకున్నాం… నా నంబర్ తీసుకుంటున్నందుకు వాడికి గర్వంగా ఉందేమో అని నాకనిపించింది…
పద, నిన్ను నా రేంజ్ రోవర్‌లో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాను… వద్దులే, నా హోండా నాకుందీ అన్నాడు… ఈలోపు గేటు వద్దకు తన కార్ వచ్చింది… పాత 2001 మోడల్ హోండా అకార్డ్ అది… రేపు మా ఇంటికి లంచ్‌కు రావాలని ఇన్వయిట్ చేశాను, సరేనన్నాడు… నా సక్సెస్, నా జీవితం, నా ఇల్లు, నా సంపద వాడికి చూపించాలనేది నా అభిప్రాయం… నిజాయితీగా చెప్పాలంటే వాడికి ఏవైనా వ్యాపార అవకాశాల్లో ఏమైనా సాయం చేయాలనీ అనిపించింది నాకు…
Ads
నేనుండే పార్క్ వ్యూ ఏరియాకు తనే డ్రైవ్ చేస్తూ వచ్చాడు… అదే కారు… నా ఇంటిని చూపి బాగా ఇంప్రెస్ అయినట్టు కనిపించింది… నిజానికి ఆ ఇంటిని తనఖా పెట్టి పెద్ద మొత్తంలో లోన్స్ తీసుకున్నాను నేను… భారీ ఈఎంఐలు కడుతుంటాను… లంచ్ చేస్తూ ఏం చేస్తుంటావ్ అనడిగాను… ఏదో చిన్న వ్యాపారం, అదీ రియల్ ఎస్టేట్‌కు సంబంధించింది అన్నాడు…
అంతేకాదు, బిజినెస్ డిస్కషన్స్ మీద ఆసక్తి చూపలేదు… నేనేమైనా సాయం చేయగలనా అనడిగాను… నో, నో, నేను బాగానే ఉన్నాను అన్నాడు… కావాలంటే ఎక్కువ బ్యాంకు రుణాలు ఇప్పించగలననీ చెప్పాను… నవ్వి, వద్దులే అని అక్కడే కట్ చేశాడు సంభాషణను… లంచ్ అయిపోయింది, నన్ను తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించి తను కారులో తిరిగి పోతుంటే అనుకున్నాను… అన్ని వేళ్లూ ఒకేలా ఉండవు కదాని… అంటే, నేను పెద్ద వేలు అని…
రెండు వారాల తరువాత నేనూ, నా భార్య బయల్దేరాం… రిమోట్ ఏరియాలో ఉంది… నా భార్యకు సామాన్యుల ఇళ్లకు వెళ్లడం ససేమిరా ఇష్టముండదు… నామోషీ… మొన్న వాడు మా ఇంటికి వచ్చినప్పుడు తనను చూసి అస్సలు ఇంప్రెస్ కాలేదు ఆమె… కానీ కాలేజీలో మేం చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌మి అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చాను… ఇక తప్పలేదు ఆమెకు…
అదొక చిన్న ఇల్లు, 4 బెడ్రూం బంగళా… ఇంటి ముందు నాలుగు కార్లు పార్క్ చేసి ఉన్నాయి… ఇంట్లోకి అడుగుపెట్టాం, సాదరంగా లోనికి ఆహ్వానించాడు… భోజనం బాగుంది… తన భార్య మరీ అడిగి అడిగి వడ్డించింది తనే…
లంచ్ చేస్తున్నప్పుడు మీ ఎండీ ఎలా ఉన్నాడు అనడిగాడు నన్ను… నేను కాస్త ఆశ్చర్యపోయి, నీకు తెలిసా అనడిగాను… మేం ఫ్రెండ్స్‌మి అన్నాడు… లంచ్ చేస్తున్న టేబుల్ పక్కన మరో టేబుల్ మీద ఒక కంపెనీ పేరుతో ఓ కానుక కనిపించింది… నేను పనిచేసే కంపెనీలో ఆ కంపెనీకి 38 శాతం షేర్లున్నాయి…
నా ఆశ్చర్యాన్ని చూసి తనే చెప్పాడు… ఆ కంపెనీ నాదే, ఇప్పుడు ఈ ఇల్లున్న ఈ ఎస్టేట్ కూడా నాదే… ఒకరకంగా తనే నాకు జీతం ఇచ్చేది… నా విలాసం, నా అట్టహాసం తన పుణ్యమే… విస్తుపోయి చూస్తూ ఉన్నాను… ఎంత తక్కువ అంచనా వేశాను తనను… ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు… ఏదో ఇబ్బంది… తను గమనించాడు… భుజం తట్టాడు, భోజనం బాగుందా అనడిగి, అప్పుడప్పుడూ వస్తుండు అన్నాడు…
తిరుగు ప్రయాణంలో నా భార్య ఫుల్లు సైలెంట్… అందుకే అంటారు ముఖచిత్రం చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దని… లోతుల్లో వేగంగా సాగే ప్రవాహాలు నిశ్శబ్దంగా ఉంటాయని, పైన శాంతగోదావరిలా కనిపిస్తాయని…! (ఫేస్‌బుక్‌లోనే కనిపించిన ఓ ఇంగ్లిషు పోస్టుకు తెలిసీతెలియని నా అనువాదం ఇది…)
Share this Article