ముందుగా ఓ ప్రకటన చదవండి… యథాతథంగా… వాట్సప్ గ్రూపుల్లో కనిపించింది…
వాల్తేరు వీరయ్య వేడుకలో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన అసలు మాటలు.
👉 సినిమా నటుల రెమ్యునరేషన్స్ గురించి ఢిల్లీ పెద్దలు రాజ్యసభలో మాట్లాడటం నాకు చాలా బాధ కలిగింది..
Ads
👉 మేము నటించేది సినిమా ఇండస్ట్రీలో కార్మికులు ఆనందంగా జీవించడం కోసం.. ఎన్ని ఎక్కువ సినిమాలు చేస్తే అన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయనేది మా ఉద్దేశం..
👉 నేను దేశ రాజకీయాలు చూశా, వాటి ముందు సినిమా రంగం చాలా చిన్నది..
👉 మా నటన నచ్చితే అభినందించండి, కానీ రాజకీయాలతో ముడిపెట్టి చూడకండి..
👉 అలా కాకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి.
– మెగాస్టార్ చిరంజీవి
—————————————-
ఇది చిరంజీవి గారు మాట్లాడిన మాటలు వాటిని నిన్నటి నుంచి కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి..
– వై.జె.రాంబాబు
ప్రధాన కార్యదర్శి
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్
ఒక హీరోకు ఒక ఫిలిమ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఇలా ప్రత్యక్షంగా వత్తాసు పలకడం ఏమిటి..? చిరంజీవి స్వయంగా ఏర్పాటు చేసుకున్న సంఘమా ఇది..? ఇక ప్రతి హీరో తనకు అనుబంధంగా ఓ జర్నలిస్ట్ అసోసియేషన్ పెట్టుకోవచ్చా..? దీన్ని పాత్రికేయం అంటారా..? సినీ పీఆర్వోల సంఘం అని పెట్టుకుంటే దానికి ఓ అర్థముంది… కానీ జర్నలిస్ట్ అనే పేరుతో ఈ అనుబంధ, వత్తాసు సంఘాలు ఏమిటి..? అసలే ఫిలిమ్ జర్నలిస్టు అంటేనే జర్నలిస్టు సర్కిళ్లలో అదోరకమైన అభిప్రాయం ఉంది… ఇంకా ఇదొక్కటి తక్కువైందా..?
ఎస్, రాజకీయాల్లో ఒకరికొకరు తిట్టుకుంటారు… నిందలు వేసుకుంటారు… చిరంజీవి ఏమీ అతీతుడు కాదు… వైసీపీ వాళ్లు గనుక నిరాధారంగా, అన్యాయంగా చిరంజీవి మీద నోరు పారేసుకుంటే ఖండించడం చిరంజీవి వంతు… లేదా చిరంజీవికి పీఆర్వోలున్నారు… ఆయన ఫ్యామిలీలో బోలెడు మంది హీరోలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎట్సెట్రా ఉన్నారు… వాళ్లు కౌంటర్లు ఇచ్చుకుంటారు కదా… మధ్యలో జర్నలిస్టు సంఘానికి ఏమొచ్చింది..?
ఫాఫం, ఏదో ఫాఫం, సినిమా కార్మికులు బతుకుతారు కాబట్టి, వాళ్లు బతకాలి కాబట్టి మేం ఇలా సినిమాలు చేస్తున్నాం అనే చిరంజీవి మాటల విశ్లేషణలోకి పోవడం లేదు ఇక్కడ… చిరంజీవి బతికేదో ఇండస్ట్రీ కోసం, సినిమా కార్మికుల బతుకుల కోసం, వాళ్ల కడుపులు నిండటం కోసం కాబట్టి చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడు… కొన్నిసార్లు ఉచితంగానే నటిస్తాడు… కళామతల్లి మీద, సమాజం మీద బాగా బాధ్యత కలిగిన ఉత్తమ కథల్నే ఎంచుకుంటాడు ఫాఫం…
సరే, ఈ కథల్ని కాసేపు అలా వదిలేస్తే… హఠాత్తుగా రజినీకాంత్‌లోని అపరిచితుడు కూడా బయటికొచ్చాడు… ఆమధ్య ఆయన ఇటువైపు వచ్చినప్పుడు చంద్రబాబును మెచ్చుకున్నాడు కదా… దాంతో వైసీపీ వాళ్లకు మండింది… ఆ బ్యాచ్ కూడా నొటోరియస్ కదా… రజినీ మీద సోషల్ మీడియాలో లెఫ్ట్ రైట్ ఆడుకున్నారు… దాంతో రజినీకాంత్‌కు కోపమొచ్చింది… తను కూడా చిరంజీవిలాగే ఫాఫం ఈ వయస్సులో కూడా సినిమా కార్మికుల కడుపుల నిండటం కోసమే సినిమాల్లో కష్టపడి నటిస్తున్నాడు…
మరి వైసీపీకి కౌంటర్ ఇవ్వకపోతే ఎలా అనుకున్నట్టున్నాడు… జైలర్ సినిమాది ఏదో ఫంక్షన్ జరిగితే… అందులో రజనీకాంత్ సినిమా స్టైల్ లో చెప్పిన డైలాగుల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ‘కుక్క మొరగకుండా ఉండదు. నోరు విమర్శించకుండా ఉండదు. ఇవి రెండూ ఉండని ఊరే ఉండదు. మనం మాత్రం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి ’ అంటూ కామెంట్ చేసిండు… ఈ డైలాగులు తమిళంలో చెప్పిండు… తర్వాత వెంటనే అర్థమైందా రాజా అంటూ రజనీకాంత్ తెలుగులో డైలాగు చెప్పటంతో ఇది వైసీపీ ని టార్గెట్ చేసుకుని చెప్పినట్లు సోషల్ మీడియా అంతా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు… తెలుగులో అర్థమైందా రాజా అనడమే వైసీపీ వాళ్లను ఉద్దేశించి అట…
వాస్తవానికి తమిళనాడులో జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్ తెలుగులో డైలాగు చెప్పాల్సిన అవసరం లేదు… గతంలో ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ నేతలు తనపై చేసిన విమర్శల దాడిని దృష్టిలో పెట్టుకునే రజనీకాంత్ ఈ మాటలు అన్నట్లు కనిపిస్తోంది… ఈ సమావేశంలో పాల్గొన్న రమ్యకృష్ణ కూడా అర్థమైందా రాజా అంటూ తెలుగు డైలాగు చెప్పినప్పుడు నోటికి చేయి అడ్డుపెట్టుకుని మరి నవ్వింది… ఇప్పుడిక వైసీపీ బ్యాచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి…
Share this Article