Subramanyam Dogiparthi… జమున నట విశ్వరూపం 1971 లో వచ్చిన ఈ బంగారు తల్లి సినిమా . గ్లామర్ పాత్రల్లో రాణించిన ఈ సత్యభామ పూర్తి డీగ్లామర్ పాత్రలో జీవించింది . చాలామంది ఈ పాత్రను చేయవద్దని చెప్పినా , ధైర్యంగా ఈ పాత్రను చేయటానికి ముందుకొచ్చింది . జమున తర్వాత ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది కృష్ణంరాజునే . విలన్ పాత్రలకు , దారి తప్పిన కొడుకు పాత్రలకు పరిమితమయిన కృష్ణంరాజు అసలు సిసలయిన రెబల్ పాత్రను వేసి రెబల్ స్టార్ అయ్యాడు .
వారిద్దరి తర్వాత నిర్మలమ్మ . మనుషులు మారాలి సినిమాలో పాత్రలాగే ఉంటుంది ఈ సినిమాలో పాత్ర కూడా . చాలా బాగా నటించింది . ఈ ముగ్గురి తర్వాత నాగభూషణం పాత్ర , అతని నటన . అరవై డెబ్బై సంవత్సరాల కింద గ్రామాల్లో ఉండే టిపికల్ వడ్డీ వ్యాపారం చేసే షైలాక్ పాత్ర . బాగా నటించారు . శోభన్ బాబు , జగ్గయ్య , సురభి బాలసరస్వతి , అల్లు రామలింగయ్య , రమాప్రభ , వెన్నిరాడై నిర్మల ప్రభృతులు నటించారు . పూర్తి గ్రామీణ వాతావరణంలో వందలాది మంది గ్రామస్తులు కూడా నటించారు .
యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగున్నా బయట హిట్ కాలేదు . ఇన్నాళ్ళు లేని సిగ్గు , ఝణక్ ఝణక్ ఝణ చెల్ చెల్ బండి , పల్లె సీమ మన పంట సీమ , బంగరు తల్లి పండిందోయ్ పంటల పండగ , శ్రమించే రైతుల జీవాలే పాటలు ఉన్నాయి .
Ads
చాణక్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకున్నా , ఈ సినిమాకు మాతృక అయిన 1957 లో వచ్చిన మదర్ ఇండియా అంత పేరు , డబ్బు తెచ్చుకోలేదని నాకు గుర్తు . హిందీలో నర్గీస్ , రాజ్ కుమార్ , సునీల్ దత్ , రాజేంద్రకుమార్ ప్రధాన పాత్రలలో నటించారు . ఆ రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు రికార్డు సృష్టించాయి .
ఈ సినిమా ఎంత పేరు తెచ్చుకుందంటే ఆనాటి ప్రధాని నెహ్రూ , రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా ఈ సినిమాను వేయించుకుని చూసారు . జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా , ఫిలిం ఫేర్ అవార్డులను పొందింది . నర్గీస్ , దర్శకుడు ఖాన్ లకు ఉత్తమ నటి , ఉత్తమ దర్శకుడు అవార్డులు కూడా వచ్చాయి . అయితే , ఈ మదర్ ఇండియా సినిమా కూడా 1940 లో వచ్చిన ఔరత్ అనే హిందీ సినిమా ఆధారంగానే తీయబడింది .
నేటి తరం యువతీయువకులు ఈ రెండు సినిమాలు కషాయంలాగా ఉన్నా చూడమని నా మనవి . యువతీయువకులే కాదు ; వీటిని చూడని వారు ఎవరయినా ఉంటే ముసలాళ్ళయినా వాచ్ లిస్టులో పెట్టేసేయండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article