Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో జోసెఫ్ విజయ్ మహా సిగ్గరి… చిన్న కళ్లు, బక్కగా, నల్లగా… కానీ..?

June 2, 2026 by M S R

.

Director Devi Prasad.C… 1990 లో ఒకరోజు మద్రాస్‌లో ఓ పెద్ద తమిళ దర్శకుడి ఇంట్లో “శత్రువు”(వెంకటేష్ గారు హీరో) సినిమా షూటింగ్ జరుగుతోంది.
మా గురువు దర్శకులు “కోడిరామకృష్ణ” గారు అప్పటికే ఆ ఇంట్లో కొన్ని సినిమాల షూటింగ్స్ చేశారు.
ఆ తమిళ దర్శకుని భార్య గారు గాయని. మాకు షూటింగ్ సజావుగా సాగటానికి ఆమె చాలా సహకరించేవారు.

మా గురువు గారు ఆమెతో “ఎక్కడండీ మన హీరో” అని అడుగుతుండగానే ఓ 16 ఏళ్ళ అబ్బాయి సైకిల్‌పైన వచ్చాడు గేట్ తీసుకుని.
చిన్న కళ్ళతో నల్లగా బక్క పలుచగా వున్నాడు.
తలవంచుకుని ఎవ్వరినీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న ఆ అబ్బాయిని ఆమె పిలిస్తే సిగ్గు పడుతూ తల్లి దగ్గరకొచ్చాడు.

Ads

డైరెక్టర్‌ గారికి విష్ చెయ్యమంటే నమస్కారం పెట్టి తల పక్కకి తిప్పి ఎటో చూస్తున్నాడు.
డైరెక్టర్‌ గారు “ఏం హీరో… ఎప్పుడు హీరో అవుతున్నావ్”అని అడిగితే సిగ్గు పడుతూనే ఒక్క మాటన్నా మాట్లాడకుండా తన బెడ్‌రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు.
“చూడండి సార్ వాడికెంత సిగ్గో… ఒకరిద్దరితో తప్ప ఎవ్వరితో మాట్లాడడు. ఎవ్వరితోనూ కలవడు” అని వాళ్ళమ్మ గారు ఫీలవుతుంటే ” ఏం పర్వాలేదండి. కొంచెం వయసొస్తే తనే మారతాడు. హీరోని చేసేయండి. మంచి హీరో అయిపోతాడు” అన్నారు డైరెక్టర్ గారు.

ఎంత పెద్ద దర్శకుడి కొడుకైతే మాత్రం ఏ మాత్రం ఆకర్షణ లేని ఆ అబ్బాయిని గురువు గారు పదే పదే “హీరో” అని సంబోధించటం మాకస్సలు మింగుడు పడలేదు.
కానీ……….
తరువాత రెండు సంవత్సరాలకే ఆ అబ్బాయి తన శరీరాకృతిని మార్చుకుని తమిళ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వటమే కాక పెద్ద స్టార్‌గా ఎదిగి, 2026 కి ఏకంగా తమిళనాడు కి ముఖ్యమంత్రి అయిపోయాడు.
ఆ అబ్బాయి పేరు “జోసెఫ్ విజయ్”.
అతని తండ్రి గారు “ఎస్.ఏ.చంద్రశేఖర్, తల్లిగారు”శోభ”.

మద్రాస్ లో ఏవో వ్యాపారాలు చేస్తూ అప్పుడప్పుడూ సినిమాలకు ఫైనాన్స్ చేసే “జి.కె. రెడ్డి” గారి కుటుంబం మా గురువు గారి కుటుంబంతో ఫ్రెండ్లీగా వుండేవారు.
ఆయన బాడీబిల్డర్‌లా దిట్టంగా వుండేవారు. ఆయనతో ఒకట్రెండు సినిమాలలో గురువు గారు నటింపచేశారు కూడా.
శివాజీ గార్డెన్స్ లాంటి అవుట్‌డోర్స్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ రెడ్డి గారు భార్య ఇద్దరబ్బాయిలతో సరదాగా వచ్చేవారు.

పదిహేను పదహారేళ్ళలోపు వుండే ఇద్దరబ్బాయిల్లో పెద్దబ్బాయి తెల్లగా చిన్నబ్బాయి బాగా నల్లగావుండేవాళ్ళు.
గురువు గారు అందంగావున్న ఆ పెద్దబ్బాయిని కాకుండా నల్లగా వుండే చిన్నబ్బాయిని “ఏయ్ హీరో” అని పిలిచేవారు.
మాకెందుకో అది ఎబ్బెట్టుగా అనిపించేది.
కానీ…….

ఆ నల్లటి అబ్బాయి తరువాతి కాలంలో తమిళంలో పెద్ద హీరో కావటమేకాక తమిళ నడిగర్‌ సంఘంకీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కీ నాయకుడిగా కూడా వ్యవహరించాడు కొంతకాలం.
ఆ నల్లటబ్బాయి పేరు “విశాల్”.
అతను నటించిన “పందెంకోడి”లాంటి సినిమాలు తెలుగులోనూ హిట్టే.

“గూఢచారి 117” సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు గురువు గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న “మహేష్‌ బాబు”ని ఉత్సాహపరుస్తూ “మహేష్ బాగా చెయ్. నాన్న గారి తర్వాత తెలుగు సినిమాల్లో సూపర్‌స్టార్ టైటిల్ నీదే” అంటుండేవారు.
అతను మాత్రం ఖచ్చితంగా అవుతాడని అందరూ అనుకొనేవారు.
సామాన్యులు ప్రస్తుతం ఎదుటి మనిషి రంగు రూపం ఆహార్యం చూసి వారి భవిష్యత్ ని అంచనావేస్తే, మా గురువు గారిలాంటి దీర్ఘదర్శులు వారిలో అంతర్లీనంగా వున్న వెలుగునో తేజస్సునో పసిగట్టి వారి భవిష్యత్ ని ఆశాజనకంగా ఊహించి వారిని ఉత్సాహపరుస్తారు.
అసలామాటకొస్తే ఏ ఒక్క మనిషినీ తక్కువ అంచనా వెయ్యరు.

విజయ్, మహేష్‌బాబు, విశాల్ వంటివారు గోల్డెన్ స్పూన్‌తో గొప్పవారి బిడ్డలుగా పుట్టారు కనుకే గొప్పవాళ్ళయ్యారని శుష్క వాదనలు చేసేవారుంటారు.
ఎంత గొప్పవారి వారసులైనా సరే సినీరంగంలో ప్రవేశం వరకే సులభమవుతుంది తప్ప, కళపైన వారికున్న ఇష్టం, వారు పడే కష్టం, వారికి లభించే ప్రేక్షక ఆమోదం మాత్రమే వాళ్ళకా గొప్ప స్థాయిని కట్టబెడుతుందనేది నిజం.
ప్రజామోదం పొందలేక విజయానికి ఆమడ దూరంలోనే ఆగిపోయిన ఎందరో గొప్పవాళ్ళ వారసుల కధలే అందుకు నిదర్శనం. ____ దేవీప్రసాద్.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అప్పట్లో జోసెఫ్ విజయ్ మహా సిగ్గరి… చిన్న కళ్లు, బక్కగా, నల్లగా… కానీ..?
  • బాల్క సుమన్‌పై తెలంగాణ సర్కారు సీరియస్… దేశద్రోహం కేసు..!!
  • తుమ్మిడిహెట్టి… రేవంత్ సీరియస్ టోన్… ఫడ్నవీస్ వింటున్నావా..?
  • తెలంగాణపైకి వలసవాదం ముంచుకొస్తోంది అనడమే పెద్ద వంచకభాష..!
  • The Scape Goat… అదే ఆ పాత కథే… అనేక భాషలు… వందల సినిమాలు…
  • షర్మిలకు రాజ్యసభ సీటు..! ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఫాయిదా ఏమిటట..!?
  • blood money … క్లౌడ్ ఫండింగ్‌తో ఒక ప్రాణం నిలబడింది …
  • నో మ్యాచ్ పాయింట్..! ఈ పెళ్ళి సంబంధం మాకొద్దు..!
  • కోమల’మైన గళం… శాస్త్రీయ స్వరజ్ఞానం… ఇండస్ట్రీ గుర్తించలేదు…
  • రేవంత్ సవాల్‌కు ఒక్కసారిగా కేటీయార్, హరీష్ సైలెంట్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions