సాక్షిలో కేసీయార్ ఇంటర్వ్యూ పూర్తిగా చదవలేదు… రోజూ చెప్పే అబద్ధాలు, ఆత్మస్తుతి, పరనింద మాత్రమే కదా అనుకుని… పైగా చాన్నాళ్ల తరువాత టీవీ9 లో డిబేట్ పెట్టించుకుని, పక్కా స్క్రిప్టు ప్రకారం తను చెప్పదలుచుకున్నది అడిగించుకుని మరీ నాలుగు గంటలపాటు చెప్పాడు కదా, ఇంకా కొత్త విషయాలు ఏముంటాయిలే, చెప్పేవాడికి అడిగేవాడు లోకువ అనుకుని..!
కానీ ఓ చిన్న వీడియో బిట్ వాట్సప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతోంది… చూస్తే కేసీయార్ ఆంధ్రజ్యోతి మీద నిప్పులు కక్కాడు అంటూ..! అందులో ఏమంటాడంటే..?
‘ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజానికే మచ్చ… కేసీయార్ ప్రజాస్వామికంగా ఉండరనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి కొందరు విషం చిమ్మేవాళ్ల తప్పుడు ప్రచారం… రాధాకృష్ణ జర్నలిస్టేనా..? ఆయన కక్కేది విషం, దానికి వలువలు లేవు, విలువలు లేవు, కొత్త పలుకు అంటూ చెత్త రాస్తారు… ఆయన సొంత అభిప్రాయాలు, కోరికలు చెప్తూ ఎదుటివాళ్ల విషం కక్కుతుంటారు… ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వంటివి జర్నలిజం పరువు తీసి బజారులో నిలబెట్టాయి… కాకా, బాకా ఊది గెలిపిస్తామని అనుకుంటున్నవాళ్లు గతంలో చంద్రబాబును ఏపీలో గెలిపించగలిగారా..? రాధాకృష్ణ లాంటి వాళ్లు జర్నలిజానికే మచ్చ..’’
Ads
అవునులే సారూ… జర్నలిజం అంటే నమస్తే తెలంగాణ… ప్యూర్ జర్నలిజం… కొంతలోకొంత ఈనాడు… భయంతో అడుగులకు మడుగులొత్తుతుంది కాబట్టి… సాక్షి, అది మన జగన్ పత్రిక కాబట్టి… టీవీ9, ఎన్టీవీ, టెన్టీవీ ఎట్సెట్రా… అవి ఇప్పుడు మనకు అస్మదీయం కాబట్టి… మనకు నచ్చినవాళ్లకు బాకాలూదితే జర్నలిజానికే మచ్చలు…
సేమ్, మన జగన్ భాషే… కాకపోతే ఒక్క ఈనాడుకే మినహాయింపు… అవునూ, ఒక్క చిన్న ఉదాహరణ చెప్పుకుందాం… కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదంలో 50-60 మంది మరణిస్తే మొహమైనా చూపలేదు, పరామర్శ లేదు, పట్టించుకున్న పాపాన పోలేదు… ఆంధ్రజ్యోతిలో చిన్న అగ్నిప్రమాదం జరిగితే ఆగమేఘాల మీద నువ్వు, మీ నాయకులు వెళ్లి పరామర్శించి, ఓదార్చి, సానుభూతి పలికి, సాయం ఉంటానని భరోసాలు ఇచ్చిన తీరును ఏమందాం..?
ఆ దోస్తీ ఏమైంది ఇప్పుడు..? అప్పుడు జర్నలిజం వెలుగు కాస్తా ఇప్పుడు మచ్చగా కనిపిస్తోందా..? ఎందుకు..? ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డి లైన్ తీసుకుంది కాబట్టి… రేవంత్ రెడ్డికి చంద్రబాబుతో సత్సంబంధాలున్నాయి కాబట్టి… చంద్రబాబు, మన జగన్ ప్రత్యర్థులు కాబట్టి… అలా ఆంధ్రజ్యోతి బాగుండటం లేదు కాబట్టి… గతంలో రారాపోరా అనుకున్న జాన్ జిగ్రీల నడుమ ఎక్కడ తేడా కొట్టింది సార్..?
అవునూ, వోటుకునోటు కేసు, చంద్రబాబు మెడపై కత్తి, అన్నీ వదిలేసి అమరావతికి పారిపోవడం వంటి సంఘటనలు, పరిణామాల్లో ఇదే మచ్చ రాధాకృష్ణ మచ్చా (దోస్త్) రాధాకృష్ణగానే వ్యవహరించాడంటారు, మరి ఇప్పుడు ఈ నిందలేమిటి..? పనిలోపనిగా… వర్తమాన పాత్రికేయంలో దేశం మొత్తమ్మీద మచ్చలుగా లేని వెలుతురు పూలు ఎవరు సార్..? ఎనీ ఐడియా..?! ఎనీ ప్యూర్ మీడియా..!?
Share this Article