.
రేవంత్ రెడ్డి బాంబింగుతో బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుటుంబం అక్రమ సంపాదన స్థాయి మీద తెలంగాణవ్యాప్తంగా చర్చ మొదలైంది… తన పాలనలో పాల్పడిన అక్రమాలతో జనానికి మొహం చూపించలేక తను దాక్కున్న కేసీయార్ ఫామ్‌హౌజులో ప్రభుత్వ భూములున్నాయనీ, వాటిని దళితులకు పంచుతాననీ విసిరిన బాంబు బాగా పేలింది…
పాపం, కేసీయార్… తనకు అనుకూలంగా మెదిలిన పీసీసీ పెద్దలను చూశాడు గానీ, ఈ బుల్‌డోజర్‌ను చూడలేదు, తట్టుకోలేకపోతున్నాడు… కేటీయార్, హరీష్ కూడా అడ్డంగా ఇరుక్కుపోయి కొన్ని హాస్యాస్పద వ్యాఖ్యలకు దిగారు… ఎలా సమర్థించుకోవాలో తెలియని అయోమయం… అదెంతవరకూ పోయిందంటే..?
Ads
కేటీయార్ ఎక్కడో మాట్లాడుతూ… మాది రెండెకరాల ఇల్లు, వందల ఎకరాల జాయదాద్… (జమీ)… అప్పట్లోనే లక్షల రూపాయలు (అప్పర్ మానేరు నిర్మాణసమయంలో వచ్చిన పరిహారం అట) వచ్చాయి… ఆఫ్టరాల్ ఎర్రవల్లిలో 67 ఎకరాలు మాకో లెక్కా అన్నట్టు మాట్లాడుతున్నాడు… అవి ప్రభుత్వ భూములు అని రేవంత్ చేసిన ఆరోపణను దాటేశాడు పాపం… (1930 కాలంలో ఎకరానికి వంద, రెండొందల ధర కూడా ఉండదు, లక్షల రూపాయల పరిహారం ఎలా ఇచ్చిండు నిజాం?)
నవ్వొచ్చింది ఏమిటంటే..? మాకు ఇప్పటికీ ఓ సరైన ఇల్లు లేదు, మేమందరమూ కలిసి ఉండే వసతి లేక కేసీయార్ ఫామ్ హౌజులో ఉంటున్నాడు, మేమేమో నార్సింగిలో ఉంటున్నాం అంటున్నాడు… ప్చ్, రేవంత్ రెడ్డికి కాసింతైనా దయలేదు, నాలుగు ఇందిరమ్మ ఇళ్లు కట్టించొచ్చు కదా… వాళ్లు ఎలాగూ తమ కోసం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించుకోలేకపోయారు..!!
దీనికి పొంగులేటి టీమ్ నుంచి వెంటనే కౌంటర్… 2004లో కరీంనగర్ లోకసభ సీటు నుంచి పోటీచేసినప్పుడు ఎకరం భూమి కూడా లేదని కేసీయార్ సమర్పించిన అఫిడవిట్ బయటపెట్టారు… మరి రెండెకరాల ఇల్లు, వందల ఎకరాల ఆస్తి ఉన్న కేసీయార్ గుంట కూడా భూమి లేదని ఎందుకు చెప్పాడట అఫిడవిట్‌లో..?

హరీష్ రావూ అంతే, అడ్డంగా పడిపోయాడు… మరి నీకు 300 ఎకరాల భూమి ఉంది కదా అని ఏవో వివరాలు చెప్పాడు… అంటే, పరోక్షంగా రేవంత్ రెడ్డి చెప్పిన కేసీయార్ ఆస్తులు నిజమే కానీ నీకూ ఉందికదా అంటూ నిజాన్ని అంగీకరించినట్టు..!!
ఇవన్నీ తెలంగాణ సమాజంలోకి విస్తృతంగా వెళ్లిపోతున్నాయి… చర్చ జరుగుతోంది… చావు డప్పులు కాదు, దళిత సమాజం తిరగబడే డప్పు చప్పుళ్లతో ఫామ్ హౌజు అనే గడీ మీద దండయాత్ర చేసి, అదే కేసీయార్ చెప్పినట్టు తలా మూడెకరాలు పంచుకోవాలనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…
అవునూ, నిజంగానే ఆ ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుని, రేవంత్ రెడ్డి దళితులకు పంచుతాడా..? సాహసిస్తాడా..? అలా చేయాలంటే రేవంత్ రెడ్డి మాత్రమే చేయాలి, కానీ చేయడు…
అంతటి కాళేశ్వరం అక్రమాల నుంచి బోలోడు స్కాంల నుంచి కేటీయార్, కేసీయార్, హరీష్ రావులను క్షమించేస్తున్నాడు కదా… అచ్చంగా రామోజీ ఫిలిమ్ సిటీని లక్ష నాగళ్లతో కేసీయార్ ఎందుకు దున్నలేదో… రేవంత్ రెడ్డి బుల్‌డోజర్ కూడా కేసీయార్ ఫామ్ హౌజ్ కోటగోడలను బద్దలు కొట్టదు… రేవంత్ రెడ్డి దయార్ద్ర హృదయుడు… ప్రత్యర్థులను కూడా క్షమించేంత పెద్ద ఔదార్య గుణం పాపం..!!
ఒక్క కేసీయార్ భూములే కాదు, హరీష్ రావు, కేటీయార్ సహా బోలెడు మంది బీఆర్ఎస్ నేతలు దొరికింది కదా చాన్స్ అని ఎలా ఆబగా తెలంగాణ ఆస్తుల్ని దోచుకున్నారో వరుసగా బయటపడుతున్నాయి… తెలంగాణను అగడు పడ్డట్టు దోచుకున్న ‘దొరల’ బాగోతాలు సంపూర్ణంగా ఎలా తెలంగాణ సమాజానికి తెలియాలి పాలకా..?!
Share this Article