.
అనుకుంటున్నదే… కేరళలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం రాగానే ఆదానీకి ఎక్కడో బ్రేకులు పడతాయని! ఆదానీ అంటే బీజేపీ పార్టీకి ఆర్థికముఖచిత్రంగా, మోడీ కంపెనీగా మాత్రమే చూస్తుంది కాంగ్రెస్ అధిష్ఠానం… ఇంతకుముందు తెలంగాణలో సంకల్పించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి 100 కోట్ల విరాళం ప్రకటించినా, కాంగ్రెస్ హైకమాండ్ దానికి బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే కదా…
ఇప్పుడు కేరళలో… విజింజం ఓడరేవు… ఇండియాకు వాణిజ్యపరంగా, భద్రతపరంగా వ్యూహాత్మక కీలక సీపోర్ట్…అరేబియా సముద్రం మీదుగా యూరప్- మధ్యప్రాచ్యం- ఆసియా దేశాలను కలిపే అత్యంత రద్దీ అంతర్జాతీయ షిప్పింగ్ మార్గానికి కేవలం కొన్ని నాటికల్ మైళ్ల దూరంలో ఈ పోర్టు ఉంది. ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన భాగం ఈ సముద్ర మార్గం మీదుగానే సాగుతుంది.
Ads
ఇంకో విశేషం ఏమిటంటే… విజింజం తీరంలో సహజంగానే 20 మీటర్లకుపైగా లోతు ఉంది. అందువల్ల భారీ డ్రెడ్జింగ్ అవసరం లేకుండానే ప్రపంచంలోనే అతి పెద్ద కంటైనర్ నౌకలు ఇక్కడకు చేరుకోగలవు. అందుకే దీనిని భారతదేశ తొలి నిజమైన అంతర్జాతీయ డీప్- వాటర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్‌గా అభివర్ణిస్తున్నారు.
ప్రస్తుతం దేశానికి వచ్చే కంటైనర్లలో గణనీయమైన భాగం ఇంకా విదేశీ ఓడరేవులైన కొలంబో, సింగపూర్ లేదా జెబెల్ అలీ ద్వారా ట్రాన్స్‌షిప్ అవుతోంది. విజింజం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే ఆ ఆధారపడటం తగ్గే అవకాశం ఉంది.
పినరై ప్రభుత్వం ఏం చేసింది? విజింజం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. స్థానిక మత్స్యకారుల నిరసనలు, భూసేకరణ సమస్యలు, నిర్మాణ జాప్యాలు, ప్రకృతి వైపరీత్యాలు… ఇలా ఎన్నో సవాళ్లు ఎదురైనా అప్పటి ముఖ్యమంత్రి పినరై విజయన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేరళ అభివృద్ధికి అత్యంత కీలకంగా భావించింది.
అదానీ గ్రూప్‌కు అవసరమైన పరిపాలనా సహకారం అందించింది. నిరసనలను చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసింది. ప్రాజెక్టు ఆలస్యం కాకుండా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. విమర్శలు వచ్చినా, “విజింజం కేరళ భవిష్యత్తును మార్చే ప్రాజెక్టు” అనే నమ్మకంతో ముందుకు వెళ్లింది.
ఇప్పుడు సతీషన్ ప్రభుత్వం ఎందుకు బ్రేక్ వేసింది? కేరళ ప్రభుత్వం ఇప్పుడు ఆదానీకి చెక్ పెడుతోంది, బ్రేకులు వేస్తోంది, ఐతే అభ్యంతరాలు చెబుతున్నది పెట్టుబడులకు కాదు. ఒప్పంద నిబంధనలకు. విజింజం ప్రాజెక్టు ఒక పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో నడుస్తోంది. ఇలాంటి ఒప్పందాల్లో యాజమాన్యంలో గణనీయమైన మార్పులు చేయాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమనే నిబంధనలు ఉన్నాయి.
అయితే ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే ఆదానీ ప్రపంచంలో ఓడరేవుల మీద దాదాపు గుత్తాధిపత్యం ఉన్న MSCకి 49 శాతం వాటా బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభించారని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది… అంతేకాదు… ఒక షిప్పింగ్ దిగ్గజం, ఒక పోర్టు ఆపరేటర్ కలిసి పనిచేస్తే భవిష్యత్తులో పోటీపై ప్రభావం పడుతుందా? ఇతర షిప్పింగ్ లైన్లకు సమాన అవకాశాలు ఉంటాయా? అనే ప్రశ్నలను కూడా ప్రభుత్వం లేవనెత్తుతోంది.
ఇక్కడ MSC గురించి తెలుసుకోవాలి. దీని పూర్తి పేరు Mediterranean Shipping Company. దీని ప్రధాన వ్యాపారం కంటైనర్ షిప్పింగ్, పోర్ట్ టెర్మినల్ నిర్వహణ, లాజిస్టిక్స్, క్రూయిజ్ సేవలు… ప్రపంచ స్థాయి కంపెనీ… ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్పింగ్ కంపెనీల్లో ఒకటి (అనేక ప్రమాణాల ప్రకారం నంబర్ 1).
ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు. ప్రపంచంలోని అనేక దేశాలు తమ పోర్టులు, టెలికాం, విద్యుత్ వంటి వ్యూహాత్మక రంగాల్లో యాజమాన్య మార్పులను జాతీయ ప్రయోజనాల కోణంలో పరిశీలిస్తుంటాయి. అందువల్ల ఈ అంశంపై చర్చ జరగడం సహజమే.
అదే సమయంలో, మరోవైపు MSC వంటి ప్రపంచ దిగ్గజం భాగస్వామ్యం వల్ల విజింజంకు భారీ కార్గో వచ్చే అవకాశం, అంతర్జాతీయ పోటీ సామర్థ్యం పెరిగే అవకాశాన్ని కూడా విస్మరించలేం. సో, ఈ వివాదాన్ని తేలికగా తీసుకోలేం… భారతదేశ వ్యూహాత్మక మౌలిక సదుపాయాల భవిష్యత్తు ఎలా ఉండాలనే పెద్ద చర్చకు ఇది ఆరంభం కావచ్చు…
Share this Article