రెండేళ్ల కిందట మా పిల్లల స్కూల్ ప్రాంగణంలో మరో కొత్త బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేసారు.
పునాదుల కోసం తవ్వుతుంటే బాంబ్ దొరికిందని, త్వరగా వచ్చి పిల్లలని తీసుకుపొమ్మని ఫోన్ వచ్చింది స్కూల్ నుండి.
కాస్త కంగారు పడుతూ స్కూల్ కి పరుగెత్తడమే తప్ప విపరీతంగా భయపడలేదు.
ఎందుకంటే అలాంటి వార్తలు ఇక్కడ (Hungary) సాధారణం.
విషయం వాళ్ళు పూర్తిగా చెప్పకపోయినా మాకు అర్థమవుతుంది.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో పేలకుండా మట్టిలో మిగిలిన బాంబులు..
అయిదారు వందల కేజీల బరువుంటాయవి. ఇలా తవ్వకాలు జరిగేప్పుడు బయటపడుతుంటాయి.
అదృష్టం ఏమంటే ఎక్కువశాతం అవి పేలవు.
Bomb squd వాటిని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేస్తారు.
అప్పట్లో రోజులపాటు టన్నుల కొద్దీ బాంబుల వర్షం కురిసింది ఈ దేశంపై.
శిథిలాల్లో నగరపు ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి.
యుద్దాలు అగ్రదేశాలకు ఏమిస్తాయో తెలియదుకానీ, వాటి ఆధిపత్య పోరులో యుద్దరంగాలుగా మారే చిన్న దేశాలు మాత్రం ప్రతిసారీ రెక్కలు తెగి నేల కూలుతుంటాయి,
ఎగరలేక, ఎదగలేక నిస్సహాయంగా.
***
కాసేపటి క్రితం పోలాండ్ దేశస్తుడైన నా కొలీగ్ తో మాట్లాడాను.
“రష్యా ఏవో రెండు ప్రాంతాల కోసం ఈ యుద్దం చేస్తుందట కదా, అవి ఆధీనంలో రాగానే ఈ యుద్దం ముగుస్తుందా” అని అడిగా.
అతను ముందు నవ్వి, ఇలా చెప్పుకొచ్చాడు.
“ఎవరికి తెలుసు?
నా చిన్నతనంలో పోలాండ్ రష్యా ప్రభావంలో ఉండేది.
తిండి కూడా సరిగా దొరికేది కాదు. అరటిపండు సంవత్సరానికి ఒక్కసారి కనపడితే గొప్ప.
పండగలకి మాత్రమే ఆరెంజెస్ కొద్ది మొత్తంలో కొనేవాళ్ళం.
నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఓసారి విపరీతమైన జ్వరం, చాలా నీరసించిపోయా.
చేతిలో డబ్బులు ఉన్నాయి, కానీ కొనడానికి ఏమీ దొరకని పరిస్థితి.
నాకు ఒక పండో, బ్రెడ్డు ముక్కో తెచ్చి పెట్టాలని మా అమ్మ తిరగని ఇల్లు లేదు ఆరోజు.
ఆ రోజులు నేనెప్పటికీ మర్చిపోలేను. అవి నా మనసులో అలా చేదుగా మిగిలిపోయాయి.
ఇలానే ఉక్రెయిన్‌ని ఎలాగయినా తనలో కలుపుకోవాలని ఉక్రెయిన్లో కృత్రిమ కరువు సృష్టించి 1932 లో ముప్పై లక్షల మంది మరణానికి కారణమైంది రష్యా, కావాలంటే ఈ ‘Hoodomar‘ అనే ఆర్టికల్ చదువు.
నేను కాస్త కఠినంగా మాట్లాడుతున్నట్లనిపిస్తుందేమో నీకు.
కానీ చరిత్ర రాసిన వాడిని కాదు
అనుభవించిన వాడిని అడిగి తెలుసుకోవాలి.
నువ్వుంటున్న hungary ప్రజలు కూడా ఇంతకంటే ఎక్కువే అనుభవించారు.
ఇలాంటి పరిస్థితులు చూసాక ఉక్రెయిన్ ఎందుకు రష్యాలో కలవాలనుకుంటుంది?!”
***
ఇది నిజమే. నేను కూడా విన్నాను.
రెండవ ప్రపంచయుద్ధం తర్వాత 1944 నుండి హంగరీతో సహా చాలా యూరోపియన్ దేశాల్లో రష్యా పాలన సాగింది.
ఆ కాలాన్ని తలచుకోవడానికి కూడా వీళ్ళు ఇష్టపడరు.
పూర్తిగా స్వేచ్ఛని కోల్పోయారు.
తినే తిండి నుండి స్కూల్ వరకూ ప్రతి విషయంలోనూ ఆంక్షలు.
ఎక్కువ శాతం ప్రజలను కూలీలుగా వాడుకునేవారు.
విసిగిపోయిన ప్రజలు 1956 లో తిరుగుబాటు చేశారు.
ఆ తిరుగుబాటును అరాచకంగా ఉక్కుపాదంతో అణచివేసింది రష్యా.
రోడ్ల మీద కనిపించిన వారినల్లా కాల్చి చంపారు.
బాంబులతో నగరం మొత్తం ధ్వంసం చేశారు.
ఎంతో మంది ఆడపిల్లలు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలకు గురయ్యారు, రెండు లక్షల మంది అని అంచనా.
దారుణం ఏంటంటే ఎనిమిదెళ్ళ వయసు పిల్లల్ని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ క్యాంప్స్ కి తరలించి సామూహిక అత్యాచారాలకు ఒడిగట్టారు.
దానితో వేల మంది దేశాన్ని వదిలి పారిపోయారు.
ఆ పరిణామాల వలన కలిగిన భయంతో తమ బిడ్డలు అలాంటి పరిస్థితుల్లో పెరగడం ఇష్టం లేక అప్పట్లో చాలా మంది పిల్లల్ని కనడం మానేశారు.
అందుకే ఇప్పటికీ కొందరు ముసలివాళ్ళు చిన్న పిల్లలు కనిపిస్తే చాలు ప్రేమగా తడిమి దగ్గరికి తీసుకుంటారు..
కేవలం ముద్దు చేయడం కాదది. అంతకు మించిన ఆపేక్ష ఏదో.
అర్దం చేసుకోవాలీ, అడగాలే గానీ కొన్ని సార్లు ఆ తడిబారిన కళ్ళు ఏవో కథలు కూడా చెప్తాయి!
***
కారణాలేవైనా సరే,
అది అమెరికా రాజకీయమైనా, NATO సభ్యత్వమైనా రష్యా చేస్తుంది సరైన పని కాదనిపిస్తుంది.
తనకి కావలసింది రెండు ప్రాంతాలేనని చెప్తూ దేశాన్ని అన్ని వైపులా చుట్టుముట్టి అన్ని cities లో bombing చేయడం దారుణం.
అందుకే రష్యా ప్రజలు కూడా ఈ యుద్దాన్ని నిరసిస్తున్నారు.
ఈరోజు ఉదయం నుండి భారతీయ విద్యార్థుల నుండి వందల మెసేజులు.
బాంబుల శబ్దాలకు భయంగా ఉందంటూ ఏడుస్తున్నారు.
తమని అక్కడి నుండి తప్పించమని,
రాత్రి నుండి నీరు, ఆహారం లేదని, సహాయం చెయ్యమంటూ అర్దిస్తున్నారు.
సాయంత్రానికి కనీసం వెయ్యి నుండి అయిదు వేల మంది విద్యార్థులు ఇక్కడికి చేరుకుంటారు.
వారికి ఇక్కడ ఉన్న భారతీయులమంతా కలిసి ఇళ్లలో వండి పంపిస్తున్నాం.
అవసరమైతే వసతి, కాస్త ధన సహాయం.
***
ఈ సందర్భంలో ఉదయం నుండి ఒకటే గుర్తొస్తుంది.
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్!!
అమెరికా అయినా, రష్యా అయినా, మరొకరైనా
మట్టిని ఆక్రమిస్తారు సరే,
మరి మనుషులు, వారి బతుకుల సంగతేంటి?
Share this Article