.
. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. .. అత్తలు, కోడళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, సర్వం మెచ్చిన చాలా చక్కని కుటుంబ కధా చిత్రం . 1980 సెప్టెంబర్లో వచ్చిన ఈ కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త సినిమా వంద రోజులు ఆడింది . ఇప్పటికీ అప్పుడప్పుడు టివిల్లో వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంటుంది .
సంసారాల్లో దారి తప్పిన సభ్యులకు బుధ్ధి చెప్పి దారిలోకి తెచ్చే ఇలాంటి కుటుంబ కధా చిత్రాలు అప్పుడూ ఇప్పుడూ సక్సెస్ అవుతూనే ఉన్నాయి . స్క్రీన్ ప్లేని బిర్రుగా వ్రాసుకుని సంసారపక్షంగా తీస్తే ఎప్పుడూ సక్సెస్ అవుతాయి .
Ads
జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి నిర్మాత . ఫేమిలీ పిక్చర్సుకు చిరునామా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తారు . తండ్రీకొడుకులుగా చాలా చక్కగా , అందంగా నటించారు .
మిస్సమ్మ సినిమాలోలాగా ఇద్దరు నిరుద్యోగ యువతీయువకులు ఓ పబ్లిక్ పార్కులో అనుకోకుండా కలిసి , ఒకరిని ఒకరు ఇష్టపడి , ప్రేమించుకుని ఇంటివాళ్ళు అవుతారు .ఇద్దరు కొడుకులతో చక్కని సంసారాన్ని నిర్మించుకుంటారు .
ఇద్దరు పుత్రరత్నాలు ప్రేమించి తమ తాహతుకు మించిన కోడళ్ళను తెస్తారు . కోడళ్ల ఆరళ్ళతో అత్తామామలు క్షోభిస్తుంటారు . అప్పుడు కొడుకు హీరో తప్పిపోయిన మూడో కొడుకుని అంటూ రంగప్రవేశం చేస్తాడు . కొడుకు హీరో , అతని ప్రేయసి కలిసి కోడళ్ళకు , కొడుకులకు బుధ్ధి వచ్చేలా నాటకమాడి దారిలోకి తెస్తారు . సినిమా ఆఖర్లో అతను నిజంగానే తప్పిపోయిన మూడో కొడుకు అవుతాడు . కధ సుఖాంతం .
శోభన్ బాబు తండ్రీకొడుకులుగా చాలా బాగా నటించారు . పాటల్లో హుషారుగా , తండ్రి పాత్రలో సంయమనం పాటిస్తూ సర్దుకుపోయే పాత్రలో చక్కగా నటించారు . శారద నటన గురించి చెప్పేదేముంది . పైగా శోభన్ బాబు , శారదల జంట సక్సెస్ జంట . ఆమెకూ ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే .
ఇతర ప్రధాన పాత్రల్లో శ్రీధర్ , ఈశ్వరరావు , సంగీత , మంజుభార్గవి , గీత , గిరిజ , రమణమూర్తి , నాగరాజు , హరిబాబు , మాడా ప్రభృతులు నటించారు . దర్శకుడు మంజుభార్గవికి శాస్త్రీయ నృత్య ప్రదర్శనను పెట్టి బాగా ఉపయోగించుకున్నారు . బహుశా అందుకే పెట్టుకున్నారేమో కూడా !
సినిమా విజయానికి మరొక ముఖ్య కారణం సత్యం సంగీత దర్శకత్వంలో చాలా శ్రావ్యమైన పాటలు . ఏడు పాటల్లో ఆరు పాటల్ని వేటూరే వ్రాసారు . ఒక పాటను మాత్రం గోపి వ్రాసారు . తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు తొమ్మిది నెలలు ఆగాలి రెండు సార్లు వచ్చే పాట . బాగుంటుంది .
ఆకలైనా ఆశలైనా కౌగిలైనా జాబిలైనా సగమేలే , ఉన్నాను నేనున్నాను వద్దన్నా తోడుంటాను డ్యూయెట్లు బాగుంటాయి . ఒక పాటలో శారద , మరో పాటలో గీత నటించారు . నడుమెక్కడే నవలామణి అంటూ మంజుభార్గవి మీద సాగే శాస్త్రీయ నృత్య గీతం వేటూరి మార్క్ . నవలామణి పద ప్రయోగం అద్భుతం .
రావమ్మా మహాలక్ష్మి రావమ్మా రంగారు బంగారు సింగారములలరంగ పాటను బాగా చిత్రీకరించారు . కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త అత్తల్లారా మామల్లారా పాటలో కొడుకు శోభన్ బాబు ప్రియురాలు గీతతో హుషారు హుషారుగా నటిస్తాడు .
వెరశి చాలా చక్కటి కుటుంబ కధా చిత్రం . ఎలాంటి అశ్లీల , అసభ్యకర సన్నివేశాలు , సంభాషణలు లేని సంసారపక్ష సినిమా . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . శోభన్ బాబు అభిమానులు , మంజుభార్గవి నృత్యాభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడండి .
చూసినోళ్ళు వాచ్ లిస్టులో పెట్టుకుని మరోసారి కూడా చూడతగ్గ సినిమాయే . An excellent , neatly made , emotional , feel good family movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article