శోభన్ బాబుకు పేరు తెచ్చిన మరో సినిమా 1974 లో వచ్చిన ఈ కోడెనాగు సినిమా . ఒక బ్రాహ్మణ యువకుడు ఒక క్రైస్తవ యువతిని వివాహం చేసుకోవటానికి సంఘం అంగీకరించకపోతే , ఆత్మహత్య చేసుకుని సమాజం మీద పవిత్ర ప్రేమ యుధ్ధాన్ని ప్రకటిస్తారు . ఈ సినిమాలో ఒక విశేషం మనసు కవి ఆత్రేయ మాస్టారి పాత్రలో నటించటం . సినిమాకు హీరోహీరోయిన్లు తర్వాత ప్రధాన పాత్ర ఆయనదే . ఆయన నటించిన కేవలం రెండు సినిమాలలో ఇది ఒకటి . వాస్తవానికి ఈ సినిమా ప్రేమ సినిమా అనేదాని కన్నా , గురుశిష్యుల అనుబంధం సినిమా అనే అనాలి .
యం యస్ రెడ్డి నిర్మాతగా ప్రముఖ దర్శకుడు కె యస్ ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ కూడా . పెండ్యాల వారి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . సంగమం సంగమం అనురాగ సంగమం , కధ విందువా నా కధ విందువా , నాలో కలిసిపో నా యెదలో నిలిచిపో , అందాల గడసరివాడు అడగకుండా మనసిచ్చాడు పాటలు శ్రావ్యంగా ఉంటాయి .
మరీ ముఖ్యంగా చెప్పుకోవలసింది ఇదే చంద్రగిరి శౌర్యానికి గీచిన గిరి పాట . జగ్గయ్య , స్కూల్ పిల్లల మీద పాట . ఈ పాటతోనే సినిమా ప్రారంభమయ్యేది . ఆ పాటలో చంద్రగిరి చరిత్ర , ఔన్నత్యం గురించి యం యస్ రెడ్డి చాలా బాగా వ్రాసారు . నాగుపాము పగ పన్నెండేళ్ళు నాగరాజు పగ నూరేళ్లు పాటలో శోభన్ బాబు దారితప్పిన కుర్రాడిగా బాగా నటించాడు .
Ads
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతయైన కన్నడ రచయిత త.రా.సు (టి.ఆర్.సుబ్బారావు) వ్రాసిన నాగరహావు, ఎరడు హెణ్ణు ఒందు గండు, సర్పమత్సర అనే మూడు నవలల ఆధారంగా పుట్టణ్ణ కణగాల్ దర్శకత్వంలో విష్ణువర్ధన్, ఆరతి, శుభ నటించిన నాగరహావు అనే కన్నడ చలనచిత్రాన్ని ఈ సినిమాగా పునర్మించారు.
ఆ సినిమాలోనే మొదటిసారిగా అంబరీష్ , విష్ణువర్ధన్ నటించారు . ఆ తర్వాత హిందీలో జహ్రీలా ఇన్సాన్ గా , తమిళంలో రాజ నాగం గా రీమేక్ అయింది . అయితే కన్నడం సినిమా అంతగా రీమేక్ చేయబడిన మూడు భాషల్లోనూ ఆడలేదు . మన తెలుగు సినిమాలో శోభన్ బాబు , చంద్రకళ , లక్ష్మి చాలా బాగా నటించారు . మిగిలిన నటీనటులు కూడా బాగా నటించారు .
శోభన్ , లక్ష్మి , చంద్రకళ , ఆత్రేయ , ధూళిపాళ , ముక్కామల , రాజబాబు , రామన్న పంతులు , ఝాన్సీ , నిర్మలమ్మ , పుష్పకుమారి , చంద్రమోహన్ , సూరేకాంతం , రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు .
ఔట్ డోర్ షూటింగ్ అంతా తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ , చంద్రగిరి ప్రాంతాలలోనే తీసారు . తిరుపతి ప్రాంతంలో ఎక్కువ భాగం షూట్ చేయబడిన సినిమాలలో ఒకటి ఇది .
ఆ రోజుల్లో మా కాలేజీ కుర్రాళ్ళకు , ముఖ్యంగా మాలాంటి ఆవేశపరులకు బాగా నచ్చింది . కులాంతర , మతాంతర ప్రేమ సినిమాలు అప్పుడు తీసినంత ధైర్యంగా సినిమా వాళ్ళు ఇప్పుడు తీయలేరేమో ! ఊరి మొత్తం మీద లక్షకో , పది లక్షలకో జరిగే ఒక్క మతాంతర ప్రేమ వివాహాలను అన్నింటినీ లవ్ జిహాదుల్లాగా నానా యాగీ చేస్తున్న రోజులు కదా ఇవి ! సరే ! ఆ గోలకు అంతం లేదు .
సినిమా అంతా స్కూల్ పిల్లలకు కోడెనాగు మాస్టారు నాగరాజు – జూలీల ప్రేమకధ ఫ్లాష్ బేక్ లో నడిసి , రఘుపతి రాఘవ రాజారాం పాటతో ముగుస్తుంది .
మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసినట్లు గుర్తు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . చూడనివారు తప్పక చూడండి . లక్ష్మి , చంద్రకళ ఇద్దరూ చాలా gracious గా ఉంటారు . ముఖ్యంగా పాటలు . సంగీత ప్రియులకు మంచి విందే . టివిలో వస్తే మిస్ కాకండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …… ( By డోగిపర్తి సుబ్రహ్మణ్యం )
Share this Article