.
కేటీయార్‌లో ఇక మార్పు రాదు… అచ్చం కేసీయార్‌లాగే ప్రజాతీర్పును గౌరవించాలని, శిరసావహించాలని ఏమాత్రం అనుకోడు… పంచాయతీ సర్పంచుల తొలి విడత ఎన్నికల ఫలితాలకు కూడా వక్రబాష్యాలు, తప్పుడు లెక్కలు, అబద్దాలతో స్పందించాడు నిన్న…
తన స్పందనలోని ముఖ్యాంశాలు ఓసారి చూద్దాం… ‘‘అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నో దౌర్జన్యాలు చేసింది… హత్యారాజకీయాలకు పాల్పడింది… సాక్షాత్తూ ముఖ్యమంత్రే పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా, పోటీచేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్ దాటకపోవడం ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనం…
Ads
రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఎన్నికల ఫలితాలతో రుజువైపోయింది… తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని కూడా ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయి….
వచ్చే మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పల్లెల్లో పైసా అభివృద్ధి పని జరగదని, గ్రామస్థులు నిర్ధారణకు రావడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఇంతటి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి… సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవకపోవడం, అనేక చోట్ల 10, 20 ఓట్ల తేడాతోనే బయటపడటం చూస్తే కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైనట్టు స్పష్టంగా అర్థమైపోతోంది…’’
తన సొంత పత్రికలో ఇలా రాయించుకున్నాడు…

దుమ్ము రేపిందట గులాబీ… ఈ క్యాంపు చెప్పుకున్న అబద్ధపు లెక్కల్లోనే బీఆర్ఎస్ సర్పంచుల సంఖ్య 1345… అంటే కాంగ్రెస్‌కన్నా తక్కువే కదా… మరి ఏదో విజయం సాధించినట్టుగా… దుమ్మురేపడం, దమ్ముతీయడం ఏమిటి..? అన్నింటికీ మించి ఇది ప్రభుత్వ వ్యతిరేకత అట, రేవంత్ రెడ్డి వైఫల్యం అట, జనం తిరగబడ్డారట…
- ఇక మూడేళ్లు కాంగ్రెస్ పాలనలో పైసా పని జరగదని అర్థమై, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వోటేశారట… అంటే, బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే పనులు అవుతాయని అనుకున్నారా జనం..? బీఆర్ఎస్ ఏమైనా ప్రభుత్వంలో ఉందా..? పనులు చేయడానికి..?! హేమిటో, ఏదేదో అనేయడమే… ఇక్కడే కనిపిస్తోంది జనం తీర్పు పట్ల, జనం ఆలోచనలకు ఇష్టారాజ్యం బాష్యం చెప్పడం పట్ల లెక్కలేనితనం..!
(అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత జనం తీర్పును గౌరవిస్తున్నానని ఎప్పుడైనా, ఒక్కసారైనా కేసీయార్ అన్నాడా..? మీ ఖర్మ అనుకుని ప్రజాజీవితం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు… జుబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా గానీ, ఈ సర్పంచి ఎన్నికల సందర్భంగా గానీ కనీసం ఓటు అప్పీల్ చేశాడా..? లేదు..!)
సరే, రియాలిటీ ఏమిటో చూద్దాం… ఎస్, ఖచ్చితంగా ఇవి పార్టీరహిత ఎన్నికలు… అధికారికంగా ఎవరూ ఫలానా పార్టీ ఫలానా సంఖ్యలో సీట్లు గెలిచిందీ అని చెప్పలేరు… నమస్తే తెలంగాణ అనబడేది తప్ప వేరే ఏ మెయిన్ స్ట్రీమ్ పత్రిక గానీ, టీవీ గానీ పైన పింక్ క్యాంపు చెప్పుకున్న ఫిగర్స్ ఇచ్చిందా..? లేదు… మరి ఏది నిజం..?
- జర్నలిస్టుల నెట్‌వర్క్ ద్వారా నిన్న రాత్రికి వచ్చిన విశ్వసనీయ సమాచారాన్ని క్రోడీకరిస్తే వచ్చిన ఫలితాలు తెలుసా..? 4235 స్థానాలకు గాను కాంగ్రెస్ గెలిచింది 2864… అంటే 67.63 శాతం… బీఆర్ఎస్ గెలుపు 1143… అంటే 26.99 శాతం… అంటే బీఆర్ఎస్‌కన్నా రెండున్నర రెట్లు ఎక్కువ…
(ఇది ఫలితాల రాత్రి అందిన సమాచారం మేరకు ఈనాడు ప్రకటించిన రిజల్ట్… ఇందులోనూ బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్‌కన్నా వంద ఆమడల దూరంలో ఉండిపోయినట్టు తెలుస్తూనే ఉంది కదా…)
నిజానికి సర్పంచి ఎన్నికల్లో పార్టీని చూసో, సీఎంను చూసో, ప్రతిపక్ష నేతలను చూసో వోట్లు వేయరు… వాస్తవం ఏమిటంటే..? గ్రామ రాజకీయాలు వేరు… వ్యక్తులు, కులాలు, గ్రూపులు, స్థానిక సమీకరణాలే ప్రధానం… మరి రేవంత్ రెడ్డి పాలన పట్ల ఇది రెఫరెండమ్, వ్యతిరేక తీర్పు ఎలా అయినట్టో కేటీయార్ చెప్పాలి… జుబ్లీహిల్స్ ఎన్నిక రెఫరెండమ్ అని తనే అన్నాడు, తీరా ఓడిపోయాక మళ్లీ కిక్కుమనలేదు…!
- నిజానికి ఈ ఎన్నికల్లో గెలిచింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం… డీజీపీ శివధర్‌రెడ్డి… ఎందుకంటే, గ్రామ రాజకీయాలు ఉద్రిక్తంగా ఉంటాయి… ఐనా సరే, ఒక్క చిన్న ఇష్యూ రాకుండా సాఫీగా ఎన్నికలు జరిగిపోయాయి… అందుకు ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు..!!
Share this Article