ఒక వార్త అనుకోకుండా చదవబడ్డాను… అదేమిటంటే…? తంగలాన్ అని ఓ సినిమా వస్తోంది కదా… విక్రమ్ హీరోగా చేసిన సినిమా… ఇప్పుడన్నీ పాన్ ఇండియా అనబడు బహుళ డబ్బింగ్ సినిమాల రిలీజులే కదా… ఇది కూడా అదే పాన్ ఇండియా ముద్ర వేసుకుని, అధిక మార్కెట్ కలిగిన తెలుగులోకి కూడా వచ్చుచుండెను…
కొందరు నిర్మాతలు స్ట్రెయిట్ సినిమాలవలె తెలుగులోనూ ప్రమోషన్లు నిర్వహిస్తూ ఉంటారు… అందులో భాగముగానే ప్రిరిలీజ్ ఫంక్షన్ ఒకటి హైదరాబాదు నగరంలోనూ నిర్వహించిరి… మన మిస్టర్ బచ్చన్, మన డబుల్ ఇస్మార్ట్‌లకు పోటీగా అదే ఆగస్టు 15న రానుండెను… చాలా ఎక్కువ మిక్కిలి అధిక సినిమాలకు వలెనే దీనికి సైతము యాంకరిణి సుమ హోస్టుగా వ్యవహరించెను…
ఎప్పటిలాగే ఏమాత్రం తగ్గని స్పాంటేనిటీ, ఎనర్జీ లెవల్స్, గడగడా వాగ్దాటి, హోస్ట్ పాత్రకు తగినంత లొడలొడా… అంతా బాగానే జరిగింది… సినిమాలో నటించిన పలువురు నటీనటులు కూడా సినిమా గురించి నాలుగు ముచ్చట్లు చెప్పిరి, కానీ డేనియల్ అనబడు నటుడు హఠాత్తుగా సుమను కిస్ ఇచ్చెను, ఆమె ఒక్కసారిగా షాక్ తినెను… వెంటనే తేరుకుని ఎక్కడి నుంచో ఈ ప్రోగ్రామ్ టీవీలో చూస్తున్న భర్త గారు రాజీవ్ కనకాల చూసి ఏమనుకుంటాడో ఏమో అని కలవరపడినదై…
Ads
‘‘రాజా, అబ్బే, ఏమీ లేదు… జస్ట్, ఆయన నా బ్రదర్… రాఖీ కూడా వస్తుంది’’ అంటూ అన్నయ్య సన్నిధి అనే పాట ఎత్తుకుంది… సదరు యాక్టరుడు లైటు తీసుకునెను గానీ నెటిజనం తిట్టిపోయుచుండిరి… ఏమమ్మా, చిన్మయీ ఏమీ మాట్లాడవేమి అని ఆమెను ట్యాగ్ చేయసాగిరి… ఆమెను అలా బహిరంగంగా కిస్సుట తప్పు కాదా అని ఆక్షేపించసాగిరి……. ఇదీ వార్త సారాంశం…
నిజం… ఆ నటుడు అలా చేయడం ఒకింత తప్పే కానీ అందులో దురుద్దేశం ఏమీ లేదు… ఏదో సరదాతనమే కనిపించింది… పైగా చేతి మీద ముద్దు పెట్టడం అంటే అందులో పేద్దగా ఇతరత్రా వాంఛల వ్యక్తీకరణ ఏమీ లేదు… ఆమె మరీ అంతగా హెవీ హార్టుతో తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు… (చివరలో మళ్లీ ఆమే షేక్ హ్యాండ్ ఇచ్చింది నవ్వుతూ…)
వెంటనే కనకాల రాజీవుడు ఏమనుకుంటాడోనని అంతగా ఫీలైపోయి, అబ్బే, ఇక్కడేమీ లేదు, నా బ్రదర్‌లాంటోడు అంటూ ఏదో బిల్డప్ ఇచ్చే ప్రయత్నం అతిగా ఉంది… నిజం చెప్పాలంటే ఎవరూ సుమ పట్ల ఆమాత్రం చనువును కూడా తీసుకోరు, తీసుకునే చాన్స్ కూడా ఇవ్వదు ఆమె… తన చుట్టూ ఎవరూ టచ్ చేయలేని కొన్ని లక్ష్మణరేఖల్ని గీసుకునే వ్యవహరిస్తుంది ఆమె…
సదరు డేనియల్ అతి చొరవ కనబరిచాడు, అది తప్పే… కానీ నడుమ చిన్మయిని నెటిజనం లాగడం దేనికి..? ప్రతి విషయాన్నీ కాస్త వక్రమార్గంలో చూస్తుంది కదా, దీని మీద కూడా ఆమె స్పందించాల్సిందే అని నెటిజనం ఫిక్సయిపోయినట్టున్నారు..!!
Share this Article