.
జార్ఖండ్‌లో ఎవరు గెలిచినా పెద్ద ఫరక్ పడదేమో గానీ… మహారాష్ట్రను వివిధ ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్ట్ చేస్తున్నట్టు బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీసీ పార్టీల మహాయుతి కూటమి గనుక గెలుచుకుంటే అది రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది…
యాక్సిస్ మై ఇండియా లేటుగా తన ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసింది… 288 స్థానాలకు గాను ఈ కూటమి 178 నుంచి 200 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది… వోటు షేర్ కూడా ఏకంగా 48 శాతం అట…
Ads
కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ మహా వికాస్ అఘడి కూటమి 82 నుంచి 102 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది… మిగతావి ఇతరులు, స్వతంత్రులు… కాంగ్రెస్ కూటమి 37 శాతం వోట్లను సంపాదించవచ్చునట…
చాలా ఎగ్జిట్ పోల్స్ చాలా సందర్భాల్లో ఫెయిలయ్యాయి… వాటికి పెద్ద క్రెడిబులిటీ లేదు… కానీ శాస్త్రీయంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలు వెల్లడించే రిజల్ట్స్ కూడా నిజమవుతుంటాయి… కాకపోతే ఆ పోల్ ఎంత పద్ధతిగా, ఎంత శాంపిల్‌తో, ఏయే మిక్స్‌తో చేశారనేది ముఖ్యం… ఐనా యాక్సురసీ అటూఇటూ కావచ్చు కూడా…
సరే, యాక్సిస్ మై ఇండియా పోల్ నిజం అవుతుందనే అనుకుందాం కాసేపు… అదే జరిగితే ప్రజలు అవకాశవాద రాజకీయాలకు సరే అని ఆమోదముద్ర వేసినట్టే అనుకోవాలా..? లేక కుటుంబ, వారసత్వ రాజకీయాలను ఇకపై సహించబోమని చెప్పినట్టా..? అదీ గాక పార్టీ మౌలిక సిద్ధాంతాల్ని వదిలి, అధికారం కోసం పాకులాడితే వ్యతిరేకించినట్టా..?
ఎలాగంటే..? మౌలికంగా శివసేన కాంగ్రెస్ వ్యతిరేకి… అది ప్రధానంగా హిందూ ఆధారిత సిద్ధాంతంతో నడిచేది… బీజేపీ- శివసేన కలయిక వెనుక ఆ సమశృతి కారణం… కానీ ఉద్దవ్ ఠాక్రే తన సీఎం పదవి కోసం, బీజేపీ దోస్తీకి గండికొట్టి… కేవలం అధికారం కోసం శరద్ పవార్‌తో, కాంగ్రెస్‌తో జతకట్టాడు… ఈ స్వార్థ రాజకీయాల్ని ప్రజలు వ్యతిరేకించినట్టు అనుకోవాలేమో.,.
శివసేన, ఎన్సీపీ కూడా ప్రధానంగా కుటుంబ పార్టీలు, వారసత్వ రాజకీయాలు… వాటి పోకడలకు విసిగి, వాటి నుంచి ముఖ్యనాయకులు బయటపడితే… (అధికారం కోసమే అవకాశవాదం)… తమను ఇన్నాళ్లూ భరించిన పార్టీలను వదిలేసి విడిగా బయటికి వస్తే… గతంలో తెలుగుదేశంలాగే అసలు పార్టీల గుర్తులను, పేర్లను ఈ చీలిక వర్గాలే కైవసం చేసుకుంటే… జనం వోకే, మంచి పనిచేశారు అని ఆమోదించినట్టు అనుకోవాలేమో…
ఈ మాట ఎందుకనాల్సి వస్తుందంటే…? ఈ చార్ట్ చూడండి…
తదుపరి చీఫ్ మినిస్టర్ ఎవరు కావాలని కోరుకుంటున్నారు అనడిగితే 31 శాతం మంది షిండేకు ఎస్ టిక్ కొట్టారుట… తన సమీపంలో ఎవరూ లేరు… బీజేపీ బలంగా ఫోకస్ చేస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ కూడా 12 శాతం దగ్గరే ఆగిపోయాడు… కాంగ్రెస్ కూటమిలో ఉద్దవ్ ఠాక్రేను 18 శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు…
మిగతా పేర్లు, వాటికి మద్దతు సంఖ్యల్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన పనేమీ లేదు… సీఎంగా షిండే గొప్ప పనితీరు ప్రదర్శించిన దాఖలాలు ఏమీ లేవు… పైగా అవకాశవాద రాజకీయాలకు ఐకన్ అనిపించుకున్నాడు… ఐనాసరే జనం తననే కోరుకుంటున్నారు, అదీ బీజేపీ కేండిడేట్‌ను మించి… ఇదీ ఆశ్చర్యం…
లోకసభ ఎన్నికల్లో కుదేలై… చివరకు అవకాశవాద నేతలుగా పేరొందిన నితిశ్, చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన బీజేపీకి మహారాష్ట్ర గెలిస్తే… అది పెద్ద బూస్టప్… బహుశా జమిలి ఎన్నికల వైపు అడుగులు వేయవచ్చు కూడా… అంతేకాదు, తాము ఎవరితో కలిసినా జనం ఆమోదిస్తారనే భరోసాను కూడా పొందినట్టే…
ఇదే సర్వే మరో విషయాన్ని చెబుతోంది… కాంగ్రెస్ కూటమికి మైనారిటీలు, ఎస్సీ వర్గాల మద్దతు ఉండగా… బీసీ, ఓసీల్లో బీజేపీ కూటమి బలంగా వేళ్లూనుకుపోయింది… అది బీజేపీకి బలాన్నిచ్చే అంశం…
కాంగ్రెస్ కూటమి ఎన్ని హామీలు ఇచ్చినా జనం నమ్మడం లేదు… రాహుల్ నాయకత్వం మరింత సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది… అది జమిలి వైపు వేగంగా అడుగులు వేయడానికి మరో కారణం అవుతుంది… బీజేపీ మహారాష్ట్ర గెలుపు నితిశ్, చంద్రబాబులనూ అదుపులో ఉంచగలదు… అఫ్‌కోర్స్, ఏపీలో పవన్ కల్యాణ్ ఎలాగూ బీజేపీకి స్ట్రాంగ్ సపోర్టర్…
తుమ్మితే ఊడిపోయే కూటమి ప్రభుత్వాలు, ఇబ్బందుల నేపథ్యంలో… సుస్థిర ప్రభుత్వం దిశలో జమిలి వైపు గనుక బీజేపీ అడుగులు వేస్తే జాతీయ రాజకీయాల్లో మార్పులు తథ్యం… జార్ఖండ్ కూడా ఒకవేళ బీజేపీ కైవసం చేసుకుంటే అది మరింత బూస్టప్ దానికి… అందుకే జనం ఆసక్తి చూపిస్తున్నది ఈ రిజల్ట్‌పై..!!
Share this Article