.
మొదటి నుంచీ అంతే… సినిమాల్లో ఫైట్ సీన్లు, అనగా యాక్షన్ సీన్స్… నిజానికి పెద్ద జోకు… హీరో తంతుంటే రౌడీలు గాలిలో తేలుతూ పోయి ఎక్కడో పెడతారు… షూట్ చేస్తుంటే పిట్టల్లా రాలిపోతుంటారు… గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా వందల మంది అలా ఖగోళంలోకి కూడా వెళ్లిపోతుంటారు…
ఇంతా చేస్తే హీరో క్రాఫ్, కాలర్ కూడా చెదరదు… మడతనలగని హీరోలు… అది కాస్తా ఈమధ్య మరీ టూమచ్ డోస్… నరకుడు… బాలయ్య భాషలో చెప్పాలంటే తరుముడు, తురుముడు… హీరో గుట్టల్లా శవాల్ని పడేసి పైన ఎక్కి కూర్చుని ఫోజు పెడతాడు,.. మిషన్ గన్స్, గ్రెనేడ్ లాంచర్స్… తెర నిండా నెత్తురు, థియేటర్‌లో అదే కమురు కంపు…
Ads
పుష్పలో చూశారుగా… గాలిలో నుంచి అలా వచ్చేసి ఓడలోకి దిగి దడదడలాడిస్తాడు… ఎంతటి ప్రొఫెషనల్ రౌడీలు, విలన్లు అయినా సరే హీరో ఒక్కడు చాలు, వందల మందిని చావబాదడానికి..! హింస… నిజానికి పిల్లలు, పెద్దలు, మహిళలు, సున్నితమనస్కులు కూడా చూసే దృశ్యమాధ్యమంలో విపరీతమైన హింస మంచిది కాదు… కానీ వినేవాడెవ్వడు..?
కేజీఎఫ్, పుష్ప2 మాత్రమే కాదు… ఏ సినిమా చూసినా అదే తీరు… మొన్నామధ్య వచ్చిన కిల్ సినిమాలో మరీ అరాచకంగా హింస… ఇప్పుడు సీన్ కట్ చేస్తే… జనం వాటినే ఎగబడి చూస్తున్నారు… వసూళ్లే వసూళ్లు… వాటికే ఆదరణ… ఎందుకు..? అది ఎంతలా పెరిగిపోయిందంటే..?
నిజానికి మలయాళం సినిమాలకు కాస్త సెన్సిబుల్ అనుకుంటాం కదా… రీసెంటుగా మలయాళంలో మార్కో అనే సినిమా రిలీజైంది… ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్… దంచుడు, కాల్చుడు, పేల్చుడు, తెర మోగిపోయింది… జస్ట్, ఆ మాలీవుడ్ రేంజుకు 5 రోజుల్లో 50 కోట్లు దంచిందంటే అర్థం చేసుకొండిక…
ఎవరితను అనకండి… మనకు తెలిసినవాడే… భాగమతి, జనతా గ్యారేజ్, యశోద, ఖిలాడీ సినిమాల్లో కనిపించినవాడే… ఇద్దరు మాఫియా అన్నదమ్ముల్లో ఒకడిని ప్రత్యర్థులు చంపేస్తే, ఇక మిగిలినవాడు ప్రతీకారం తీర్చుకునే కథ… ఇంకేముంది..? బీభత్సమైన హింసను జొప్పించాడు దర్శకుడు…
గర్భిణి మీద క్రూరమైన దాడి, చిన్న పిల్లాడి భీకర హత్య సహా తరుముడు, తురుముడు ధోరణే మొత్తం… వచ్చే నెలలో తెలుగులో రిలీజ్ చేస్తారట… కానీ జనం ఎందుకలా పిచ్చిగా చూస్తున్నారు..?
సొసైటీలో నెగెటివిటీ బాగా పెరిగింది… చుట్టూ మోసాలు, కుట్రలు, హింస, అక్రమాలు, అవినీతి, లైంగిక దాడులు… పాజిటివ్ వైబ్స్ ఘోరంగా పడిపోయాయి… మీడియా సహా ఏ మాస్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ పాజిటివ్ యాంగిల్‌ను ఇప్పుడు పట్టించుకోవడం లేదు… హీరోలతో ఐడెంటిఫై చేసుకుని, తెర మీద వాడు అందరినీ నరుకుతుంటే మనిషిలోని ఓరకమైన కసి, ఇగో, కాంక్ష ఇలా బయటపడుతున్నాయా..? సోషల్ మీడియాలో ట్రోలింగ్ దాడులు, బూతులకూ ఇదే కారణమా..? చర్చనీయాంశమే..!!
Share this Article