…
నిన్నటి నుంచే సర్క్యులేట్ అవుతోంది ఓ వార్త… ఏమిటంటే..? ఓ తెలంగాణ మంత్రి నివసించే అధికారిక నివాసంలోని బాత్రూంల రిపేర్లకు కోటి రూపాయల ఖర్చు పెడుతున్నారనేది వార్త సారాంశం… అబద్ధమని చెప్పలేం కదా… మన వ్యవస్థలో మంత్రులు, బ్యూరోక్రాట్లు వాళ్లుండే నివాసాలను వాళ్లకు అనుగుణంగా విలాసవంతంగా చేసుకోవడానికి ఖజానా నుంచి కోట్లకుకోట్లు ఖర్చు చేస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం కదా…
అంతెందుకు, వైఎస్ కట్టిన సీఎం రెసిడెన్స్ను ప్రగతిభవన్ పేరిట కేసీయార్ వందల కోట్ల ప్రజాధనాన్ని తన సొంత ఇంటికి ఖర్చుపెట్టుకున్నట్టుగా వెచ్చించి… ఓ నయా గడీగా మార్చేసుకున్న తీరు చూశాం కదా… అందులోని ఇంటీరియర్, చివరకు బాత్రూంల విలాసం, ఖర్చుపైనా బోలెడు వార్తలు వచ్చాయి… సో, జూపల్లి అనబడే తెలంగాణ మంత్రి తన క్వార్టర్లో బాత్రూంలకు కోటి రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టిస్తున్నాడు అనేసరికి కాస్త ఫ్యాక్ట్ చెక్ చేయాలనిపించింది…
Ads
తీరా చూస్తే… మినిస్టర్ క్వార్టర్స్ అనేది నిజమే… కోటి రూపాయల ఖర్చు అనేదీ నిజమే… బాత్రూంల రిపేర్లు అనేదీ నిజమే… అది జూపల్లి నివసించే క్వార్టర్ అనేది కూడా నిజమే… కానీ నిన్న ప్రచారంలోకి వచ్చిన వార్తలన్నీ కాస్త ట్విస్టింగ్ బాపతు… ఇదీ అసలు దాని వాస్తవం…

బాత్రూంలే కాదు, పైకప్పు రిపేర్లు, చెద నివారణ, మరికొన్ని సివిల్ వర్క్స్ కోసం ఉద్దేశించిన టెండర్ ఇది… దాదాపు కోటి రూపాయల ఖర్చుకు టెండర్లు పిలిచారు… సో, కేవలం బాత్రూంలకు కోటి ఖర్చు అనేది నిజం కాదు… ఆ పనుల్లో బాత్రూంలు కూడా ఉన్నాయనేది నిజం… ఐతే ఏమాటకామాట… ఇక్కడ ప్రభుత్వపరంగా కొన్ని తప్పులున్నాయి…
1. అవి మినిస్టర్ క్వార్టర్స్, దాని నంబర్ రాసి టెండర్లు పిలిస్తే సరిపోతుంది… ఫలానా జూపల్లి కృష్ణారావు అనబడే మంత్రి నివాసం అని రాయాల్సిన పనిలేదు… పైగా మంత్రి చూసే శాఖల పేర్లతో సహా… వచ్చే మంత్రివర్గ విస్తరణలో తనను తొలగిస్తే మాజీ… ఇంకెవరో వస్తారు అందులోకి…
అది జూపల్లి సొంతిల్లు కాదు… సో, మంత్రుల క్వార్టర్స్లోని ఫలానా నంబర్ ఇంటికి రిపేర్లు అని టెండర్లలో రాస్తే సరిపోతుంది… పైగా సివిల్ వర్క్స్ అని రాస్తే చాలు, ఏయే పనులు అనేది టెండర్ డాక్యుమెంట్లో ఎలాగూ వివరంగా ఉంటుంది… ఫస్టే బాత్రూం రిపేర్లు అనేసరికి, అది కాస్తా నెగెటివ్గా వెళ్లిపోయింది…
2. టెండర్ డాక్యుమెంట్లో పేర్కొన్న పనులకు కోటి రూపాయలు అనేదీ అసాధారణంగానే కనిపిస్తోంది… ఆర్అండ్బీ పనుల్లో అంచనాలు ఎలా ఉంటాయో తెలుసు కదా… అనేకరెట్ల అధిక అంచనాలు, దందాలు… నిజానికి కోటి రూపాయలు పెడితే కొత్తదే కట్టొచ్చునేమో…
3. నిజానికి మంత్రులైనా సరే, సీనియర్ బ్యూరోక్రాట్లయినా సరే, వాళ్ల నివాసాలకు కోట్ల ప్రజాధనం ఖర్చుతో రిపేర్లు, మోడిఫికేషన్లు గట్రా అడిగితే ప్రభుత్వం అంగీకరించాల్సిన పనిలేదు… అదీ ‘దుర్వినియోగమే’… అబ్బే, పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకా అడ్డగోలుగా చేశారు కదానేది సమర్థన కాదు… వాళ్లు చేశారని వీళ్లు చేయకుండా… కాస్త ఆదర్శాన్ని చేతల్లో చూపించొచ్చు కదా..!!
Share this Article