.
మామునూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు పేరు సూచించండి అని రేవంత్ రెడ్డి అడిగిన తరువాత దాని మీద చాలామంది స్పందిస్తున్నారు, తెలంగాణలో చర్చ జరుగుతోంది, రకరకాల పేర్లు సజెస్ట్ చేస్తున్నారు… పార్టీలు కాదు, ప్రజలు ప్రతిస్పందిస్తున్నారు… దీనిపై ఒవైసీ స్పందించాడు అనూహ్యంగా… తను సజెస్ట్ చేసిన పేరు మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్… Moulvi Syed Allauddin…
ఒవైసీ ప్రతిపాదిత పేరు అనగానే పాత నిజాం రాజుల బాపతు ఏదో పేరు, ఎవరో వ్యక్తి అయి ఉంటాడని అనుకున్నారు చాలామంది… ఎందుకంటే..? చాలామందికి తను ప్రపోజ్ చేస్తున్న వ్యక్తి గురించి తెలియదు కాబట్టి…
Ads
పేరు చెప్పింది అసదుద్దీన్ ఒవైసీ కాబట్టి… సహజంగానే దానిపై రాజకీయ చర్చ మొదలవుతుంది. ఎవరి పేరు పెట్టాలి..? ఎవరి పేరు వద్దు..? ఏ వర్గానికి చెందిన వ్యక్తి పేరు పెట్టాలి..? ఇలాంటి ప్రశ్నలు రావడం సహజమే. కానీ ఈ చర్చ మధ్యలో ఒక అసలు ప్రశ్న మాత్రం మిస్సవుతోంది. మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్ అసలు ఎవరు..?
ఆయన కేవలం ఒక మతపరమైన వ్యక్తా..? ఒవైసీకి నచ్చినందుకు ఇప్పుడు చరిత్రలోకి తీసుకొస్తున్న పేరా..?
లేక హైదరాబాద్ నేలపై బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిజంగానే తుపాకీ ఎత్తిన చారిత్రక వ్యక్తా..? చరిత్ర ఆధారాలను చూస్తే… మూడో ప్రశ్నకే సమాధానం దొరుకుతుంది.
ఉత్తర భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉవ్వెత్తున ఎగిసిన కాలం. ఆ తిరుగుబాటు ప్రభావం హైదరాబాద్ వరకూ వచ్చింది. 1857 జూలై 17న హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెన్సీపై సాయుధ దాడి జరిగింది. ఆ పోరాటంలో ముందుండిన ఇద్దరు పేర్లు తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్.
అల్లావుద్దీన్ అప్పట్లో నైజాం సైన్యంలో Standard- bearerగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వ Dictionary of Martyrs నమోదు చేసింది. తిరుగుబాటుదారులతో కలిసి ఆయన బ్రిటిష్ రెసిడెన్సీ వైపు కదిలాడు. సుమారు 500 మంది రోహిల్లా యోధులతో పాటు వేలాది మంది ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొన్నట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

అది మామూలు నిరసన కాదు. బ్రిటిష్ రెసిడెన్సీని లక్ష్యంగా చేసుకుని జరిగిన సాయుధ తిరుగుబాటు. బ్రిటిష్ దళాలు కాల్పులు జరిపాయి. తిరుగుబాటుదారులు ప్రతిఘటించారు. రాత్రంతా ఘర్షణ జరిగింది. చివరకు బ్రిటిష్ బలగాలు ఆ తిరుగుబాటును అణచివేశాయి. అక్కడితో అల్లావుద్దీన్ కథ ముగియలేదు.
ఆయన పట్టుబడ్డాడు. విచారణ జరిగింది. శిక్ష విధించారు. 1859లో అండమాన్‌కు తరలించారు. అంటే… బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఆయుధం పట్టిన వ్యక్తి చివరకు బ్రిటిష్ సామ్రాజ్యం ఏర్పాటు చేసిన దూరపు శిక్షా స్థావరంలో ఖైదీగా మారాడు. అదే కాళాపానీ.
స్వదేశానికి దూరంగా… కుటుంబానికి దూరంగా… సాధారణ జైలు శిక్షకంటే పూర్తిగా భిన్నమైన శిక్షా వ్యవస్థలో జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి. అల్లావుద్దీన్ అక్కడే దీర్ఘకాలం ఖైదీగా ఉన్నాడు. అక్కడే మరణించాడు…
ఒవైసీ ఈ పేరును సూచించాడని మౌల్వీ అల్లావుద్దీన్ చరిత్ర మారిపోతుందా..? మారదు. అదే సమయంలో ఒవైసీ సూచించిన పేరు కాబట్టి అందరూ అంగీకరించాల్సిందే అనే అర్థం కూడా కాదు. ఒక విమానాశ్రయానికి, రహదారికి, భవనానికి లేదా మరే ప్రభుత్వ ప్రాజెక్టుకైనా ఎవరి పేరు పెట్టాలన్నది ప్రజాస్వామ్య చర్చే. ఎవరికైనా ఆ పేరు నచ్చకపోవచ్చు. మరో చారిత్రక వ్యక్తి పేరు సూచించవచ్చు. ఆ నిర్ణయాన్ని రాజకీయంగా వ్యతిరేకించవచ్చు.
కానీ ఆ పేరుకు సంబంధించిన చరిత్రను మాత్రం రాజకీయ అభిప్రాయంతో చెరిపేయలేం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ కథలో ఆయన ఒక్కడే లేడు. ఆయనతో పాటు తుర్రేబాజ్ ఖాన్ పేరు కూడా ఉంది. అంటే ఇది ఒక్క వ్యక్తి వీరగాథగా మాత్రమే చూడాల్సిన సంఘటన కాదు. 1857 తిరుగుబాటు హైదరాబాద్‌లో ఎలా ప్రతిధ్వనించిందన్న చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన అధ్యాయం…
Share this Article