.
( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) …… 40- 50- 60 సంవత్సరాల వయసుడిగిన హీరోల ప్రేమల్ని , పిర్రల్ని పగలకొట్టడాన్ని , నడుముల్ని విరగకొట్టడాన్ని చూసీ చూసీ అలసిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఒయాసిస్ లాగా అలరించిన అసలుసిసలైన లేత లేత వయసులో ఉన్న హీరోహీరోయిన్ల ప్రేమ కధ 1981 సెప్టెంబర్ 11న వచ్చిన ఈ ముద్ద మందారం సినిమా .
అప్పటివరకు రచయితగా ఎన్నో హిట్ సినిమాలకు పనిచేసిన జంధ్యాల దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా . ఆరోజుల్లో కుర్రాళ్ళకు తెగ నచ్చేసేలాగా కొన్ని పడక సీన్లను ధైర్యంగానే తీసారు జంధ్యాల . బహుశా రాజకపూర్ బాబీ ప్రభావితం చేసి ఉండవచ్చు ఆ సీన్ల విషయంలో .
Ads
అంతే కాదు ; స్టోరీ లైన్ , చివర ముగింపు సీన్ లోకేషన్ వగైరాలు కూడా బాబీని గుర్తుకు తెస్తాయి . క్లైమాక్సులో తేడా ఏమిటంటే బాబీలో నీళ్ళల్లోకి కొండ మీద నుండి ప్రేమికులు దూకేస్తారు . ముద్ద మందారంలో కొండ మీద నుండి దూకేయక ముందే ఆపేస్తారు . ఇలా కొన్ని తేడాలు ఉన్నా మొత్తం మీద బాబీ సినిమా మనసులో పెట్టుకునే ఈ కధను జంధ్యాల నేసి ఉండాలి .
హీరో ప్రదీప్ . ప్రముఖ రంగస్థల , సినిమా నటుడు విన్నకోట రామన్న పంతులు కూతురి కొడుకు . వారి ఫేమిలీ ఫ్రెండ్ అయిన జంధ్యాల అతనికి హీరో చాన్స్ ఇచ్చి కావలసిన శిక్షణను కూడా ఇచ్చారు , ఇప్పించారు . హీరోయిన్ పూర్ణిమ . యు విశ్వేశ్వరరావు దర్శకత్వం వహించిన సామాజిక చిత్రం హరిశ్చంద్రుడులో మహానటి సావిత్రి కూతురిగా కనిపిస్తుంది . ఈ సినిమా 1981 జూలైలో వచ్చింది . ఆమే ఈ పూర్ణిమ . రెండో సినిమా .
బాబీ సినిమాలో ప్రేమనాధ్ పాత్ర వంటి పాత్రను ఈ సినిమాలో అన్నపూర్ణ పోషిస్తుంది . అదే ఆత్మాభిమానం , అదే పొగరు ఉన్న పాత్ర . సుత్తివేలుకు కూడా మొదటి సినిమా ఇది . హోటల్ మేనేజరుగా నటించారు .
అప్పుడే పెళ్ళి చేసుకున్న ప్రేమికులు హోటల్ రూం లోనుండి మూడు రోజుల దాకా బయటికి కూడా రారు . ఏమీ తినకుండా కూడా పెళ్ళాన్ని చూస్తూ మొగుడు , మొగుడ్ని చూస్తూ పెళ్ళాం మూడు రోజులు గడిపేసేస్తారు . L&T చైర్మన్ సుబ్రమణియనుకు ఈ సీన్ చూపాలి . ఆకలుండదు దాహముండదు డబ్బులు అక్కరలేదు అని అర్థం అవుతుంది . వీళ్ళు కాకుండా చాలామంది ఔత్సాహికులు , జూనియర్ ఆర్టిస్టులు నటించారు .
షూటింగ్ అంతా విశాఖపట్నం , అరకు , భీమిలి ప్రాంతాలలో ప్రకృతి ఒడిలో చేసారు . చాలా చోట్ల విశ్వనాథ్ , బాలచందర్ , బాపు , రాఘవేంద్రరావు మార్కులు కనిపిస్తాయి . తర్వాత తర్వాత జంధ్యాల తన స్వంత బాణీని డెవలప్ చేసుకున్నారనుకోండి . నాకూ ఆయనకూ ఓ బంధం ఉంది . ఆయన వ్రాసిన గుండెలు మార్చబడును నాటికలో డాక్టర్ పాత్రను నేను వేసాను .
ఈ సినిమా విజయానికి మరో ప్రధాన కారకుడు రమేష్ నాయుడు . చాలా అందమైన , శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . సూపర్ హిట్ సాంగ్స్ . మందారం ముద్ద మందారం ఐకానిక్ సాంగ్ , నీలాలు కారేనా కాలాలు మారేనా , జొన్న చేలో జున్ను అన్నుల మిన్న పాటలు చాలా బాగుంటాయి . మరో గొప్ప పాట జోలాలీ ఓలాలీ ఎంత బాగుంటుందో !
వేటూరి సాహిత్య విజృంభణ శ్రీరస్తు శుభమస్తు అనే పాటలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది . ఏడు రంగుల ఇంద్రధనస్సుతో పోలుస్తూ సాగే పాట . పూర్ణిమ చేత చక్కటి నృత్యాన్ని అభినయింపచేసారు . జంధ్యాల గొప్పగా చిత్రీకరించారు . విశ్వనాథ్ మార్క్ కనిపిస్తుంది . రాఘవేంద్రరావు బిందెలు కూడా కనిపిస్తాయి . An unmissaable song .
మెహమూద్ పాట హం కాలే హైతో క్యా హువా దిల్ వాలే హై ట్యూనులో నా షోలాపూర్ చెప్పులు పోయాయి అంటూ ఓ పాట సరదాగా ఉంటుంది . జిత్ మోహన్ మిత్రా పాడారు . పాటలనన్నీ వేటూరే వ్రాసారు . బాలసుబ్రమణ్యం , యస్ జానకిలు శ్రావ్యంగా పాడారు .
ఈ సినిమాలో ద్రాక్ష పండ్ల ఆట ఒకటి ఉంటుంది . కుర్ర ప్రేమికులు ట్రై చేయొచ్చు . ఈతరం కుర్ర ప్రేమికులకు అంత సరసం ఎక్కడుంది ! అంతా రాక్షసత్వం , కర్కశత్వం !!!
ఈ ముద్ద మందారం సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . రస హృదయులు , ప్రేమపిపాసులు చూడవచ్చు . Love is beautiful , loving is a sweet and unforgettable experience . A watchable , musical , teen age love , feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు
Share this Article