.
స్వాతిరెడ్డి సాంగ్ సోషల్ మీడియాలో ఊపేస్తోందని ఓ వార్త కనిపించి ఆశ్చర్యపరిచింది… ఎవరబ్బా ఈ స్వాతిరెడ్డి అని వెతికితే తాజా లిరికల్ వీడియో ఒకటి కనిపించింది…
జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్, మరో ఇద్దరు లీడ్ రోల్స్ చేస్తున్న మ్యాడ్ స్క్వేర్ సినిమా కోసం రూపొందిన పాట అది… 10 గంటల్లో 8 లక్షల వ్యూస్ ఈరోజుల్లో పెద్ద విషయమేమీ కాదు నిజానికి… ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం…
Ads
ట్యూన్ హుషారుగా ఓ ఐటమ్ సాంగు తరహాలోనే బాగుంది… కానీ ఎటొచ్చీ సాహిత్యం..? ఎహె, భలేవారే నాగవంశీ చెప్పలేదా…? సినిమాలకు కథలు అక్కర్లేదు అని… అవును, ఈ సినిమా కూడా తను ప్రజెంట్ చేస్తున్నదే… సినిమాకే కథ అక్కర్లేదు అన్నవాడు పాటల్లో సాహిత్యం ఉండాలీ అంటాడా..?
ఒకసారి ఆ పాట కంటెంటు వింటే మీకే అర్థమవుతుంది, అది ఏ రేంజ్ సాహిత్యమో… మచ్చుకు నాలుగైదు వాక్యాలు కావాలా..?
జామచెట్టుకు కాస్తాయి జామకాయలు, మామిడిచెట్టుకు కాస్తాయి మామిడికాయలు, మల్లెచెట్టుకు పూస్తాయి మల్లెపువ్వులు, బంతిచెట్టుకు పూస్తాయి బంతిపువ్వులు, జడలోన పెడతారు మల్లెచెండులు, మెడలోన వేస్తారు పూలదండలు
ముదిరిపోతూ ఉంటాయి బెండకాయలు, మోజు పెంచుకుంటాయి ములక్కాయలు, ఏదేమైనా గానీ, ఎవరేమన్నా గానీ నా ముద్దుపేరు పెట్టుకున్నా డీడీడీ స్వాతిరెడ్డీ… నేను ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి…
నీకు నేమ్ ఉంటాది, నాకు ఫేమ్ ఉంటాది, నీకు ఫిగర్ ఉంటాది, మాకు పొగరు ఉంటాది…
చాలు కదా… ఇలాగే ఉంటుంది పాట… అసలు పచ్చ ఎండు గడ్డి భగ్గుమనడం ఏమిటో… ఐనా ఏముందిలే, నాటునాటు అనే ఓ పిచ్చి పాటకు ఆస్కార్ వచ్చింది, ఇప్పుడు దెబ్బలు పడతయ్‌రో అని రాయలేదా చంద్రబోస్,.. ఎప్పుడెప్పుడు పీలింగ్స్ వస్తాయో కూడా రాశాడు కదా…
మరి ఈ జామచెట్టు పాటలో ఎన్నో నిజాలు చెప్పాడు రచయిత, జామకాయలు జామ చెట్లకే కాస్తాయిట, మామిడికాయలు మామిడి చెట్లకే కాస్తాయట… బంతి, మల్లె పువ్వులు కూడా ఆయా చెట్లకే పూస్తాయట… ఆహా, ఎంతటి జ్ఞానబోధ..?
పోనీ, ములక్కాయలు, ముదురు బెండకాయలు అని ఏదో అంటున్నాడు, ఏదైనా ఐటమ్ సాంగ్ బాపతు మార్మిక, శృంగార వాసనలు కొడుతున్నాయా అంటే… బూతు ఉందా… అదీ లేదు… ఈ పాట పాడింది భీమ్స్ ప్లస్ స్వాతిరెడ్డి…
ఎవరూ ఈ స్వాతిరెడ్డి అంటారా..? యూట్యూబ్ సింగర్… ఏడాది క్రితమే తనే డాన్స్ చేస్తూ పాడింది… 10 మిలియన్ వ్యూస్ అంటే మంచి ఆదరణ వచ్చినట్టే… ఆ పాట కంపోజ్ చేసింది కూడా భీమ్స్… ట్యూన్ సూపర్… ఇప్పుడు నటి రెబ్బా జాన్ డాన్స్ చేస్తున్న లిరికల్ వీడియో రిలీజ్ చేశారు… అదీ సంగతి…
కంటెంటులో కొన్ని మార్పులు చేసినట్టున్నారు… నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండు గడ్డి అని పాత వీడియోలో ఉంటే, ఈ కొత్త లిరికల్ వీడియోలో మాత్రం నేను ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి అని ఉంటుంది… అవునూ, పచ్చ ఎండు గడ్డి అనగానేమి..? చెబుతాడు, ఏదో ప్రెస్‌మీట్‌లో నాగవంశీయే చెబుతాడు..!!
Share this Article