.
నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎడిటోరియల్ వ్యాసాల్ని దేశంలోని అన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించాయి… మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు, ప్రధాని అందరూ ఈమధ్య ఎడిట్ పేజీలను ఆక్రమించుకుని వ్యాసాలు రాసేస్తున్నారు కదా… అందుకే చూడగానే ఆమె వ్యాసంపైకి కూడా పెద్దగా దృష్టి పోలేదు…
కానీ లేటుగా, కాస్త తాపీగా చదువుతుంటే… ఆసక్తికరం అనిపించింది… పూరీ జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా రాయబడిన వ్యాసం అది… ఒక్కటంటే ఒక్క పదం కూడా ఆ జగన్నాథుడి నుంచి పక్కకు వెళ్లలేదు… పూర్తిగా ఆ గుడితో, ఆ దేవుడితో ముడిపడిన తన నమ్మకాలనే చెప్పుకుంది… ఒక రాష్ట్రపతిలాగా కాదు, ఓ భక్తురాలిగా!!
Ads
రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికయ్యాయని తెలిసిన వెంటనే ఆమె సింపుల్‌గా తన నివాసానికి దగ్గరలోని ఓ గుడికి వెళ్లింది, చీపురు పట్టుకుని గుడిని శుభ్రం చేసింది… అట్టహాసాలు, ఆనందోత్సవాలు ఏమీ లేవు… సంతాలీ ఆదివాసీ తెగకు చెందిన ఓ మహిళ చదువుకోవడం, ఉద్యోగం చేయడం, రాజకీయాల్లోకి రావడం, ఏకంగా ఈ దేశ అత్యున్నత పదవి అధిరోహించడం, నిజంగా ఓ చరిత్ర…

ఆమె జగన్నాథుడి గుడితో తన అనుబంధం- నమ్మకం గురించి చెప్పుకుంటూ… ‘‘రాష్ట్రపతి పదవికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు… నేను భక్తిపూర్వకంగా ఆ బమహాప్రభుని వేడుకున్నాను… ఆ పోటీ సమయంలోనే పూరీలో రథయాత్ర జరిగింది… నేను అప్పుడు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది… పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు…
రథయాత్ర రోజు ఉదయమే నేను ఢిల్లీలోని హాజ్‌ఖాస్‌లో ఉన్న జగన్నాథుని ఆలయానికి వెళ్లాను… తరువాతే పూర్తి విశ్వాసంతో నామినేషన్ దాఖలు చేశాను… 2022 జులై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కి మహాప్రభు జగన్నాథుని స్మరిస్తూనే వెళ్లాను…
జగన్నాథుడి ప్రార్థనలు, కీర్తనలు చిన్ననాటి నుంచి నా జ్ఞాపకాల్లో పదిలమై ఉన్నాయి… పాఠశాలలో, కళాశాలలో చదువుకొనేటప్పుడు మహాప్రభు జగన్నాథుని భజనలు పాడటం నాకు చాలా ఆనందాన్నిచ్చేది… మహాప్రభుకి చాలా సన్నిహితంగా ఉన్న అనుభూతి కలిగేది…
రోజూ ఆ మహాప్రభుని స్మరిస్తాను… నిజానికి మహాప్రభు నాకు దగ్గరగా ఉన్నట్టు భావిస్తుంటాను… కష్ట సమయాల్లో నాకు అండగా ఉన్నాడు… లౌకిక విషయాలు అర్థం చేసుకొనే వయసు వచ్చేనాటికి మహాప్రభు జగన్నాథుని గొప్పదనాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాను. మా ఇంట్లో… గ్రామంలోనూ ఆయన గురించిన చర్చలే ఎక్కువగా జరుగుతుండేవి…

జగన్నాథుని ఆలయమే ‘బడ దేవుళ’ అంటే పెద్ద ఆలయం… ఆయన మార్గమే బడ దాండ… అంటే ఉత్కృష్ట మార్గం… ఆయన సముద్రమే మహోదధి… మయూర్భంజ్ జిల్లాలోని మా ఊరు ఉపర్ బేడా నుంచి పూరీ చాలా దూరంలో ఉంటుంది… మరి ఆ క్షేత్రాన్ని సందర్శించే అవకాశం నాకెలా వస్తుంది..? అందుకే నేను పెద్దయ్యాకే, భువనేశ్వర్‌కి వెళ్లాను…
అక్కడ బాలికల ఉన్నత పాఠశాలలో చేరాను… ఆ వసతిగృహంలో ఉన్నప్పుడే పూరీ, భువనేశ్వర్, కోణార్క్ సందర్శించే అవకాశం నాకు లభించింది… మొదటిసారి మహాప్రభును దర్శించుకున్న జ్ఞాపకం ఇప్పటికీ నా మదిలో స్పష్టంగా ఉంది… ఎంత అద్భుతమైన ఆలయం..! ఎంత తేజోవంతమైన దేవతా మూర్తులు..! వాటిని మరచిపోగలమా..?
ప్రభు పిలిస్తేనే వెళ్లగలం… రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టాక చాలా రోజుల పాటు పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు… ఆయన అనుమతిస్తేనే తప్ప ఎవరికైనా ఆయన దర్శనం ఎలా లభిస్తుందని నాకు అనిపించింది… ‘మహా ప్రభూ! నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు… నన్ను పూరీకి పిలిచి… దర్శన భాగ్యం ఇవ్వు’ అని మౌనంగా ప్రార్థించాను…

అనతి కాలంలోనే పూరీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది… ఆ రోజు 2022 నవంబర్ 10… పూరీకి చేరుకున్న తర్వాత వాహన శ్రేణి శ్రీ మందిర్ దిశగా ముందుకు వెళుతోంది… పూరీలోని బడ దాండ వద్దకు చేరుకోగానే అనిర్వచనీయమైన అనుభూతి నన్ను ముంచెత్తింది… ఇక్కడ ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందా..? ఎలాంటి ఆలోచనలు లేకుండా నా కారుని ఆపించాను… ఏం జరుగుతుందో మిగిలిన వారికి అర్థమయ్యేలోపే… చెప్పులు లేకుండా బడ దాండపై నడవడం మొదలుపెట్టాను…
అక్కడికి శ్రీ మందిర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది… ఆలయ శిఖరం మీద ఉన్న నీల చక్రం, పతిత పావన ధ్వజం మీదే నా దృష్టిని సారించి ముందుకు సాగాను… రోడ్డుకిరువైపులా ఉన్న బాలలు, మహిళలు, యువత, పెద్దలకు నమస్కరిస్తూనే ఉన్నాను… ఆలయ సింహద్వారానికి చేరుకొనే సరికి… నేను స్థిమితంగా ఉండలేకపోయాను… అప్పటికే నన్ను నేను మరచిపోయాను… బడ దాండ మీద దుమ్ములోనే సాష్టాంగ నమస్కారం చేసి… ఆ మహాప్రభుకి నా ప్రణామాలు అర్పించాను…
ఆ తర్వాత నేను గుడిలోకి వెళ్లాను… ఆయన విశాలమైన గుండ్రటి నేత్రాలు ఎప్పుడూ రెప్ప వాల్చవు… తదేకంగా చూస్తూ ‘ఓ మహాబాహూ! ఓ కృపానిధీ! నా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని రక్షించు..’ అని చేతులు జోడించి ప్రార్థించాను… ఇలా చెబుతూ భక్తిభావంలో లీనమైపోయాను…. —– ద్రౌపదీ ముర్ము, భారత రాష్ట్రపతి
Share this Article