.
( రమణ కొంటికర్ల 99126 99960 ) … ఆ ఇద్దరినీ చూడగానే ఒక తరం కళ్ల ముందు 1987 నాటి దూరదర్శన్ లో ప్రసారమైన రామాయణ్ కదలాడుతుంది. ఒకరు రాముడు అరుణ్ గోవిల్ అయితే.. ఇంకొకరు సీత పాత్రధారి దీపికా చికిలియా. రాముడు, సీత పాత్రల్లో అంతగా ఒదిగిపోయారు. ఆకట్టుకున్నారు. అయితే, 39 ఏళ్ల తర్వాత ఈ జంట మళ్లీ కలిసి పనిచేశారు.
రామానందసాగర్ రామాయణ్ అంటే ఆదివారం వీధులన్నీ అప్రకటిత కర్ఫ్యూనే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామాయణ్ లో.. సీతారాముల పాత్రలు పోషించిన దీపికా చికిలియా, అరుణ్ గోవిల్ కు వచ్చిన పేరు… సాధారణ సినిమా హిట్స్ తో వచ్చే పేరును మించింది. సీతారాములుగా వీరిద్దరూ ఆనాడు అంత ముద్ర వేశారు. అయితే ఈ జంట ఇప్పుడు 39 ఏళ్ల తర్వాత మళ్లీ జట్టు కట్టారు.
Ads
మానవ సమాజానికి ఆదర్శంగా పురాణాల్లో చెప్పే రాముడు సీత పాత్రలు పోషించిన వీరిరువురూ ఇప్పుడు ఓ సాధారణ దంపతుల పాత్రలో మళ్లీ కనిపించబోతున్నారు.
నోటీస్ తో తెరపైకి! ఏంటి సినిమాలో సాధారణ దంపతుల క్యారెక్టర్ అంటూనే నోటీస్ అనుకుంటున్నారా..? నోటీస్ ఇదే సినిమా పేరు. ప్రదీప్ గుప్తా ఈ సినిమాకు దర్శకుడు. ఇదో సామాజిక కథ.
ఓ గ్రామంలో 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఓ దుకాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అభివృద్ధి, నిర్మాణాల పేరిట ఇళ్లు, దుకాణాలు కోల్పోయే సామాన్యుల సమస్యను అడ్రస్ చేయబోతోంది ఈ సినిమా.
అరుణ్ గోవిల్ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ఓ సామాన్యుడి పాత్ర ధరిస్తే.. అతడి భార్యగా దీపికా చికిలియా కనిపించనున్నారు. అంటే రామాయణంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టే.. ఈసారి కూడా వీరిది సామాజిక చిత్రంలో అవే పాత్రలు. కాకపోతే నాటి రాముడు సీత.. నేడు సామాన్య దంపతులుగా ఎదుర్కొనే ఓ సామాజిక సమస్యలో పాత్రలు.
రాముడు, సీతే కథ చెప్పాలని ఎందుకు యోచించారు..? ఈ నోటీస్ అనే సినిమాలో అరుణ్ గోవిల్, దీపితా చికిలియాను ప్రధాన పాత్రలుగా ఎంపిక చేసుకోవడం వెనుకా ఓ కథ ఉంది. అభివృద్ధి పేరుతో తమ ఇళ్లు, దుకాణాలు కోల్పోయేవారు ఈ కథతో అనుబంధం ఏర్పర్చుకోవాలంటే… కథ ఎవరు చెబితే బాగుంటుందన్న యోచనే అరుణ్ గోవిల్, దీపికా చికిలియాను ఈ సినిమాకు ఎంపిక చేయడానికి ప్రధాన కారణమంటున్నారు నిర్మాతలు.
అంటే నిజానికి, అబద్ధానికి మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు సీతారాముల జోడీనే సామాన్యుల పాత్రల్లో ఒదిగి చెబితే సినిమా ఆకట్టుకుంటుదన్న తపన వీరి ఎంపిక వెనుక కనిపిస్తోంది. అందుకే తమ నోటీస్ సినిమా ఓ ఆధునిక రామాయణంలా తెరకెక్కుతోందంటున్నారు నిర్మాత, దర్శకుడు.

సరిగ్గా 39 ఏళ్ల క్రితం అలరించిన రామాయణ్! అరుణ్ గోవిల్ రాముడు, దీపికా చికిలియా సీత, ధారాసింగ్ హనుమంతుడు, సునీల్ లహ్రి లక్ష్మణుడు.. ఇలా 1987లో రామానందసాగర్ రామాయణ్ ఓ చరిత్ర సృష్టించింది. వీరందరి పాత్రలు దేశవ్యాప్తంగా అపూర్వమైన ప్రజాదరణ పొందాయి.
టెలివిజనే అపురూపమైన రోజుల్లో… ఓ ఇంట్లో టీవి ఉంటే.. చుట్టుపక్కల వాళ్లంతా సినిమా టాకీస్ లో వచ్చి కూర్చున్నట్టుగా ఆదివారం ఉదయాన్నే వచ్చి కూర్చుని రామాయణ్ చూడటం నాటి ఆదివారాల్లో సర్వసాధారణ దృశ్యం. నేటి సోషల్ మీడియా రోజుల్లో ఎందరో వస్తున్నారు పోతున్నారు. కానీ, నాటి రామాయణ్ యాక్టర్స్ ఫేమ్ తో మాత్రం ఇప్పటివారిని పోల్చుకోలేకపోతున్నాం. అంటే రామాయణ్ సీరియల్.. అందులో నటీనటులు సమాజంపై చూపిన ప్రభావమది.
రామాయణ్ తర్వాత మరి ఈ జంట కనిపించలేదా..? రామాయణ్ తర్వాత కూడా ఈ ఇద్దరూ మరోసారి సీతారాముల పాత్రల్లో కనిపించారు. లవ్ కుష్ లోనూ నటించారు. కానీ, ఒక పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్ లో మాత్రం కలిసి నటించలేదు. ఇప్పుడు నోటీస్ తో ఆ గ్యాప్ ఫిల్ కాబోతోంది.
నేరుగా ఓటీటీలోనికే నోటీస్! నోటీస్ ను సినిమా థియేటర్లలో కాకుండా.. నేరుగా ఓటీటీ ఫ్లాట్ఫామ్ పైనే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. 2026, నవంబర్ 6న వచ్చే నెలలో వేవ్స్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ పై ఈ సినిమా ప్రీమియర్ కానుంది. అలాగే, 36 శాటిలైట్ ఛానల్స్ లో కూడా ఈ సినిమాను ప్రసారం చేయనున్నట్టు చిత్రబృందం చెబుతోంది.
ఎందుకంటే, సీతారాములుగా అలరించిన దీపికా చికిలియా, అరుణ్ గోవిల్ కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారని.. వారిలో టెలివిజన్ ప్రేక్షకులే ఎక్కువని.. అందుకే ఓటీటీతో పాటు, మిగిలిన శాటిలైట్ ఛానల్స్ లోనూ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు నిర్మాతలు.
అరుణ్ గోవిల్ కు తివారీ రామాయణ మరో బోనస్! నోటీస్ తో దీపికా చికిలియాతో జంట కడుతున్న అరుణ్ గోవిల్ … నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణలో కూడా దశరథుడి పాత్రతో అలరించబోతున్నాడు. నాడు రాముడిగా అలరించిన అరుణ్ గోవిల్ ఈసారి తండ్రి దశరథుడి పాత్రలో మెరువబోతుండటం మరో విశేషం…
Share this Article