Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓం పురి ! ఎల్లలు దాటిన నటన ! ఇండియన్ సినిమా శిఖరం !!

August 14, 2026 by M S R

.

Mohan Goteti … అవి దర్శకుడు రాంగోపాల్ వర్మ హిందీ సినిమాలు ముమ్మరంగా చేస్తున్న రోజులు!
మధ్యలో అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చేస్తుండేవారు.
ఒకసారి కలిసినప్పుడు “హిందీ సినిమాలు చేయడానికి కారణం ఏమిటి?” అనడిగితే కొన్ని కారణాలుచెప్పి మరో కారణం కూడా చెప్పారు.

అదేమిటంటే.. “దేశంలో ఎక్కడెక్కడో వున్న టాలెంటెడ్ ఆర్టిస్టులంతా వచ్చి ముంబైలో తేలతారు. బోలెడంత టాలెంట్ దొరుకుతుంది. మనకి మంచి ఛాయిస్ వుంటుంది. మన పాత్రకి తగ్గ ఆర్టిస్టుని రాజీ పడకుండా ఎంచుకోవచ్చు. ఇది కూడా ఒక కారణం” అన్నారు.
ఇది నిజమేననిపించింది!

Ads

ఒకళ్లా.. ఇద్దరా.. ఎంతమంది ప్రతిభావంతులైన ఆర్టిస్టులు అక్కడ! మంచి క్యారెక్టర్ ఇస్తే అద్భుతంగా చేయగలిగే నేషనల్ టాలెంట్ వుందక్కడ!
అలాంటి వారిలో ఓంపురి ఒకరు!
ఏమి ఆర్టిస్టండీ!
ఏమి నటన అండీ!
మీరు ‘ఆక్రోశ్’ సినిమా చూశారా?
ఏమి సినిమా.. ఏమి పెర్ఫార్మెన్స్!
ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అద్భుతం..

1980లో వచ్చిన ఈ సినిమాలో ఓంపురి గిరిజన కూలీ అయిన లహన్యా భీకూ పాత్రలో కనిపిస్తాడు.
భార్యను ఆ ఊళ్లో పలుకుబడిగలిగిన కొందరు అత్యాచారం చేసి చంపేసి.. ఆ హత్యానేరాన్ని లహన్యాపై మోపి జైలుకి పంపిస్తే.. వ్యవస్థ తీరుని చూసి అతను దిగ్భ్రాంతి చెంది.. ఒక విధమైన బెరుకుతనం, నిస్సహాయత ఆవహించడంతో.. నోరెత్తకుండా మౌనంగా ఉండిపోతాడు.
ఎవరేం అడిగినా మాట్లాడడు..
తన కోసం కోర్టు నియమించిన లాయర్ దగ్గర కూడా నోరు విప్పడు.. స్థాణువైపోతాడు..

అయితే, అతను మాట్లాడకపోయినా అతని హావభావాలు మనతో మాట్లాడతాయి..
అతని మనసు బాధని వ్యక్తీకరిస్తాయి!
చివర్లో తండ్రి చనిపోతే.. అంత్యక్రియలకు పోలీసులు అతనికి సంకెళ్లు వేసి.. ఓ ఉగ్రవాదిని బంధించి తెచ్చినట్టు తీసుకొస్తారు..
శ్మశానంలో చుట్టూ చూస్తే.. అక్కడే తన భార్యను పాడు చేసి చంపేసిన కామాంధులు కూడా వుంటారు..
మరోపక్క దీనంగా చూస్తున్న తన చెల్లి..
ఇప్పుడేం జరుగుతుందా? అన్నంత ఉత్కంఠ మనకు..

aakrosh

అతని వాలకంచూస్తే.. లహన్యా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడన్న విషయం మాత్రం మనకు అర్థమవుతుంది.
తండ్రికి తలకొరివి పెట్టి.. ఒక్క ఉదుటున గెంతి.. అక్కడే వున్న గొడ్డలి తీసుకుని.. చెల్లి తలపై ఒక్క వేటు వేసి చంపేస్తాడు..
ప్రేక్షకులు స్టన్ అయిపోతారు..
ఇది అస్సలు ఊహించరు..
థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్..

రేపు తన భార్యలాగే .. తన చెల్లిని కూడా ఈ కామాంధులు చెరబట్టి నాశనం చేస్తారని.. ఆ పరిస్థితి రాకూడదన్న ఆలోచన అతని చేత అంత పని చేయిస్తుంది..
పోలీసులు లహన్యాని గట్టిగా పట్టుకుంటారు..
అప్పుడు లహన్యా ఆకాశంలోకి చూస్తూ పెద్ద ఆర్తనాదం చేస్తాడు.. అతని ఆక్రోశంలోనే ఆకాశమంత అర్థం మనకు కనపడుతుంది…
ఈ కుళ్లిపోయిన సమాజంపై అతని ఏవగింపు..
దుర్యోధనులు, దుశ్శాసనుల నుంచి ఆడపిల్లను కాపాడుకోలేని దైన్యం..
బలవంతుడికి ఎదురుతిరిగి నిలబడలేని పేదవాడి నిస్సహాయత అతని ఆక్రోశంలో మనకు వినిపిస్తాయి!
అక్కడ ఓంపురిది ఏమి అభినయం.. ఏమి సహజత్వం!
ఓంపురికి.. దర్శకుడు గోవింద్ నిహలానీకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.

అర్ధ సత్య

అలాగే ఆయన నటించిన మరో ఆణిముత్యం ‘అర్థ్ సత్య’!
సమాజానికి తనవంతు సేవ చేయాలని ఎన్నో కలలు కని.. పోలీస్ ఆఫీసర్ గా చేరిన ఓంపురి.. ఆ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, అన్యాయాలు, అక్రమాలు చూడలేకపోతాడు.
నిత్యం మానసిక వేదనకు.. మానసిక సంఘర్షణకు లోనవుతాడు..
పద్మవ్యూహంలోని అభిమన్యుడిలా తాను ఈ అవినీతి కూపంలో ఎలా చిక్కుకున్నదీ స్మితా పాటిల్ కు ఓ కవిత రూపంలో చదివి వినిపించే సన్నివేశంలో ఓంపురి అభినయం అద్భుతం.
తన ఆవేదనను కళ్లతోనే పలికిస్తాడు..
సహజ నటన అంటే అదీ!

ఈ సినిమా కూడా అతనికీ, దర్శకుడు గోవింద్ నిహలానీకి ఇద్దరికీ పేరునే కాకుండా, అవార్డులనూ తెచ్చిపెట్టింది.
ఇక తెలుగులో సి.ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ‘అంకురం’ మరో గొప్ప చిత్రం!
ఇందులో సత్యం పాత్రలో ఓంపురి అభినయం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
‘ఆక్రోశ్’ సినిమాలోలానే ఇందులో కూడా ఆయన ఎక్కడా మాట్లాడడు.. ఒక్క క్లైమాక్స్ లో రెండు ముక్కలు తప్ప..

పసిబిడ్డను ఎత్తుకుని వచ్చి రైలులో కూర్చోవడం.. పిల్ల ఏడుస్తుంటే.. ఎందుకేడుస్తోందో తెలియని అమాయకత్వం.. ఎదురుగా కూర్చున్న ఓ యువతి పాపను తన చేతిలోకి తీసుకుని.. పాలు తెమ్మనిచెప్పడం.. పాల కోసం ఆదుర్దాగా కిందకు దిగడం.. పాలు తీసుకుని వస్తుంటే పోలీసులు చుట్టుముట్టి తీసుకుపోతుంటే.. పాప కోసం వెళ్లాలంటూ అతను వారి నుంచి విడిపించుకోవడానికి పెనుగులాడడం.. ఎక్కడా ఒక్క డైలాగు కూడా చెప్పకుండానే అద్భుతమైన నటనను ప్రదర్శిస్తాడు.

ankuram

నక్సల్ ముద్రవేసి.. లాకప్ లో పోలీసులు టార్చర్ పెడుతుంటే.. మారు మాట్లాడకుండా బాధను మౌనంగానే భరిస్తూ.. ముఖంలో అతను పలికించిన వేల వేల హావభావాలుఒక్కసారిగా మన కళ్లను తడిమి తడిచేస్తాయి..
ఇక క్లైమాక్స్ దృశ్యాలలో అయితే చెప్పేక్కర్లేదు..
అనారోగ్యస్థితిలో వున్న సత్యాన్ని కోర్టులో ప్రవేశపెడతారు.
“మీకు ఏదైనా రక్షణ కావాలా? అని న్యాయమూర్తి అడుగుతాడు.

అంతవరకూ సినిమాలో ఎక్కడా నోరువిప్పి మాట్లాడని సత్యం.. న్యాయమూర్తి మాటలకు బలవంతంగా నోరు విప్పుతాడు.
“వద్దు సార్.. మీ రక్షణ వద్దు.. మీ కోర్టులూ వద్దు.. మీ న్యాయమూ వద్దు . రక్షణ, రాయితీలు ఇవేమీ మాకు వద్దు.. మాకు కావలసిందల్లా ఒక్కటే..” అంటూ చెప్పి.. నేలకొరిగిపోయే సత్యం పాత్రలో ఓంపురి నటించారు అనడం కంటే ‘జీవించారు’ అనడమే సబబు. అందుకే.. థియేటర్ నిండా క్లాప్స్ వర్షం కురిసింది!

ఇందులో ఆయన చేసింది మూడు నాలుగు సీన్లే అయినా.. అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించిన ఓంపురిని.. చక్కని చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఉమామహేశ్వరరావును అభినందించకుండా ప్రేక్షకుడు ఉండలేడు!
అసలు ఒకటా.. రెండా.. ఆయన అభినయం గురించి చెప్పడానికి? ఎన్ని సినిమాలు.. ఎన్నెన్ని పాత్రలు.. అభినయంలో ఎంతటి వైవిధ్యం!
నటనకు తనదైన భాష్యం చెప్పిన నటుడు కదా?


ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) నుంచి వచ్చిన ఓం పురి.. అక్కడే తనకు మంచి స్నేహితుడుగా మారిపోయిన మరో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాతో కలిసి పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో కూడా శిక్షణ పొందాడు.
మొదట్లో పారలల్ సినిమాలలో నటించి పేరు తెచ్చుకున్నాడు..
కమర్షియల్ సినిమాలలో కూడా తనదైన ముద్ర వేశాడు.
1992లో నేను చెన్నైలో వున్నప్పుడు ‘సితార’ పత్రిక కోసం ఓంపురిని ఇంటర్వ్యూ చేసే అవకాశం కలిగింది.
అంతటి గొప్ప ఆర్టిస్టూ నన్ను ఎంతో సంస్కారవంతంగా రిసీవ్ చేసుకుని చాలాసేపు మాట్లాడారు.

తన NSD రోజుల గురించీ.. పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందిన రోజుల గురించీ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.
పారలల్ సినిమా, కమర్షియల్ సినిమా తీరుతెన్నుల గురించీ మాట్లాడారు.
తెలుగు సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ముఖం వికసించింది.
కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి గురించి చాలాసేపు మాట్లాడారు.

kamal hassan

“గొప్ప దర్శకుడండీ.. అసలు ఏం సినిమాలండీ ఆయన తీసినవి?” అంటూ ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’ సినిమాల ప్రస్తావన తెచ్చారు.
చివర్లో “విశ్వనాథ్ గారిని అడిగినట్టు చెప్పండి” అని కూడా అన్నారు (తర్వాత విశ్వనాథ్ గారికి ఈ విషయం చెబితే ‘అది ఆయన సంస్కారం’ అంటూ నమస్కారం పెట్టారు).
మన విశ్వనాథ్ గారంటే ఆ గొప్ప నటుడికి వున్న గౌరవం అది!

తన మనసుకు నచ్చిన పాత్ర ఏ భాష నుంచి వచ్చినా యాక్సప్ట్ చేసి.. దానికి న్యాయం చేశారు ఓంపురి.
అలా ఒప్పుకున్నదే ‘అంకురం’ సినిమా కూడా!
“సినిమా కథ, నా పాత్ర, దర్శకుడు కథ చెప్పిన విధానం నాకు నచ్చాయి” అన్నారాయన.
ఆయన అభినయం ఇక్కడే ఆగిపోలేదు.. ఎల్లలు సైతం దాటేసింది.

సిటీ ఆఫ్ జాయ్, వుల్ఫ్ , ద ఘోస్ట్ అండ్ ద డార్క్ నెస్.. వంటి హాలీవుడ్ సినిమాలతో పాటు ఈస్ట్ ఈజ్ ఈస్ట్, వెస్ట్ ఈజ్ వెస్ట్, మై సన్ ద ఫెనాటిక్, ద పెరోల్ ఆఫీసర్.. వంటి బ్రిటిష్ సినిమాలలో కూడా నటించి, అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు… (కమర్షియల్ సినిమాల్లో కూడా చాలా పాత్రలు వేశారు)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓం పురి ! ఎల్లలు దాటిన నటన ! ఇండియన్ సినిమా శిఖరం !!
  • కేసీయార్ వాటర్ బ్లండర్స్ ! రేవంత్ రెడ్డి రిపేర్లు !!
  • మొన్న ధర్మేంద్ర ప్రధాన్ – నిన్న నితిన్ గడ్కరీ – నేడు నిర్మలా సీతారామన్ !!
  • Viswanath & Sons – కమర్షియల్ మసాలా ట్రెండ్ల నడుమ- ఫీల్ గుడ్ మూవీ…
  • సలాం రాకీ భాయ్..! యశ్ జీవితమూ ఓ సినిమా స్పూర్తి కథే!!
  • ఒక అభిజిత్ దీప్కే – ఒక సౌరవ్ దాస్ – ఒక కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి !!
  • ఆరుగురు అత్తలు – 14 మంది కోడళ్లు … ఒకే కప్పు కింద కలిసిమెలిసి..!!
  • Trolling – సోషల్ మీడియాలో కోతి రాతలు – పావురాల రెట్టలు !!
  • తెలుగు మీడియా స్వర్ణయుగం ముగిసింది – ఇప్పుడంతా వాట్సప్ జర్నలిజం !!
  • ట్రంప్ సేఫ్ ! కానీ ఆ జర్నలిస్టులు, వైట్‌హౌజ్ స్టాఫ్ పరిస్థితి..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions