.
ఈ అవార్డు భలే తెలివైనది, ఏరికోరి ప్రకాష్ ను వరించింది
——————————
తలదన్నేవాడుంటే తాడిని తన్నేవాడొకడుంటాడు
ఆ తాడిని తన్నేవాడినికూడా తన్నేవాడింకొకడు.
వాడే ప్రకాష్.
ఇపుడా విషయం ఎందుకు? అంటే.. తెలుగు సాహిత్యంలోనూ జర్నలిజంలోనూ కాలర్ ఎగరేసుకునేందుకు పాస్ పోర్ట్ గా చెప్పుకునే కె.ఎన్.వై. పతంజలి అవార్డును ప్రకాష్ సొంతం చేసుకున్నాడు. ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే న్యూస్. ఇంతకీ ఈ అవార్డును ఎలా సాధించాడు?
Ads
పతంజలి అవార్డు నిర్వాహకులను కిడ్నాప్ చేయించి.. బెదిరించి.. మర్యాదగా అవార్డు ఇవ్వకపోతే ఆ తర్వాత మీ ఇష్టం అని భయపెట్టి అవార్డు లాక్కోలేదు.
పోనీ ఓ మిలియన్ డాలర్ల నోటును గిఫ్ట్ గా కొట్టేస్తా అవార్డు ఇలా ఇచ్చేయండని ఆఫర్ పెట్టలేదు.
అసలు ఈ ఏడాది పతంజలి అవార్డు తనకే వస్తుందని నిర్వాహకులు ప్రకటించేదాక ప్రకాష్ కే తెలీదీవిషయం.
ఇక నిర్వాహకులు ఏ ప్రాతిపదికన ప్రకాష్ ని ఈ అవార్డుకు ఎంపిక చేసి ఉంటారు?
పతంజలి అవార్డంటే మామూలు అవార్డు కాదు కదా. లక్షల రూపాయల నగదు అవార్డు కాకపోవచ్చు కానీ అంతకన్నా విలువైన అవార్డని దాని గురించి తెలిసిన వారనుకుంటారు. పతంజలిని ఇష్టపడేవారూ అనుకుంటారు.
ఈ అవార్డుకు ఎంపిక కావాలంటే పతంజలి తరహాలో జర్నలిజంలోనూ సాహిత్యంలోనూ తనకి నచ్చింది తాను రాస్తూ పేదల పక్షాన నిలబడే ప్రతీ ఒక్కరూ అర్హులే.
అటువంటిది ఆ పతంజలే తెగ మెచ్చిన రాతలు రాసిన ప్రకాష్ గురించి ఇక చెప్పేదేముంది.
ఆ మాటకొస్తే పతంజలి అవార్డు ప్రకాష్ కు ఎప్పుడో రావాలి. ఇప్పటికే కాస్త ఆలస్యం అయ్యింది. అయినా ఫర్వాలేదు. వచ్చింది.
జర్నలిజంలో పతంజలితో కలిసి పనిచేసిన చాలా మందిలో ప్రకాష్ ఒకరు కావచ్చు.
కానీ జర్నలిస్టుల్లో పతంజలికి నచ్చిన చాలా కొద్ది మందిలో అగ్రగణ్యుడు ప్రకాషే.
ప్రకాషంటే పతంజలికి ఎందుకంత ఇష్టం?
ఎందుకంటే రాస్తాడు కాబట్టి. ఆ రాతల్లో జీవం ఉంటుంది కాబట్టి. అతని అక్షరాల్లో చీమూ నెత్తురూ ఉంటాయి కాబట్టి.
కారంచేడు ప్రస్తావనకు వస్తే ప్రకాష్ అక్షరాలు నెత్తుటి కన్నీటిని స్రవిస్తాయి. చుండూరు గుర్తుకు వస్తే పులిచంపిన లేడి నెత్తుటిని చూసి అతని అక్షరాలు కుమిలి కుమిలి ఏడుస్తాయి. జర్నలిజాన్నీ సాహిత్యాన్నీ సమానంగా ప్రేమించి అంతే సమానంగా లాలించిన కొద్దిమందిలో ప్రకాష్ ఒకరు.
పతంజలికి చాలా ఇష్టమైన రాచకొండ విశ్వనాథశాస్త్రి చనిపోతే ఛాత్రి బాబుపై ప్రకాష్ రాసిన బ్యానర్ స్టోరీ చాలు అతని అక్షరాలు ఎంత ఎత్తుకు ఎదిగాయో తెలుసుకోడానికి.
ప్రకాష్.. అతని అన్న మోహన్… పతంజలి కలిసి గాజు సీసాల్లో వెన్నెలను ఒడిసి పట్టిన వెన్నెల రాత్రులు ఎన్నో.
పతంజలి అంటే మోహన్ కు చచ్చేంత ప్రేమ. ఆ పతంజలి అంటే ప్రకాష్ కు అంతే ప్రేమ. ఈ ముగ్గురికీ గద్దర్ పాట అంటే అంతే ప్రేమ. ఈ కోతి కొమ్మచ్చి ఎందుకంటే ఈ ముగ్గురూ కలిస్తే ఇలాగే విశృంఖలంగా ఉంటుంది. విస్కీలో దోస్తోవిస్కీని కలిపి తాగేశేవారు.
టాల్ స్టాయ్ అద్భుత రాతలు తలచుకుని అదిరి పడేవారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి.. చలాలను తలచుకుని మురిసిపోయేవారు. విశ్వకవి వేమననంటే ముగ్గురూ పడి ఛచ్చేవారు. ఎందుకంటే మొదటి విప్లవకవి వేమనే కదా.
ఇవన్నీ కావు కానీ..
ప్రకాష్ అక్షరాలకు పొగరెక్కువ. పదునెక్కువ. తల బిరుసూ ఎక్కువే. పెంకితనం గురించి వెటకారం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఫేస్ బుక్ ను మెయిన్ స్ట్రీమ్ వేదికగా మార్చేసి ప్రకాష్ దూస్తోన్న అక్షరాలు తెలుగునాట సంచలనాలు సృష్టిస్తున్నాయి.
ఇటువంటి అక్షరాల కోసమే పతంజలి ప్రకాష్ ను ఇష్టపడేవారు. ఈ అక్షరాలే పతంజలి అవార్డును ప్రకాష్ మోహంలో పడిపోయి ఉంటాయి. అవార్డు నిర్వాహకులకూ మరో గత్యంతరం లేకపోయి కూడా ఉండచ్చు. ఇప్పటికే ఆలస్యం చేశామని వాళ్లు నాలిక్కర్చుకునే ఉండచ్చు.
మార్చి 29న పతంజలికి అత్యంత ఇష్టమైన మహాకవి గురజాడ వారి జ్ఞాపకాల చూరు కింద రావిశాస్త్రి రాసిచ్చిన వెన్నెల రాత్రి వేళ పతంజలి అవార్డును ప్రకాష్ అందుకోనున్నారు. అక్షరం సాక్షిగా ప్రకాష్ కు అభినందనలు
————————–
సి.ఎన్.ఎస్.యాజులు
—————————
Share this Article