Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పొలిటికల్ రిపోర్టింగ్ ఎన్నో జీవితసత్యాల్ని ‘అక్షరాలా’ కళ్లకుగట్టింది !!

October 14, 2026 by M S R

.

Murali Buddha …. జీవిత సత్యాలు చూపించిన పొలిటికల్ రిపోర్టింగ్ … కనిపించగానే కాళ్ళ పై పడిపోయిన వాడు జీవితాంతం నీకు భక్తుడిగా ఉంటాడు అనుకుంటే అది నీ భ్రమ. యూ టూ బ్రూటస్… ప్రపంచ చరిత్రలో, సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ వాక్యం ఇది. బ్రూటస్ కూడా తనను పోటు పొడిచినప్పుడు సీజర్ అన్న మాటలు ఇవి. ఈ డైలాగ్ ఉన్న షేక్స్ పియర్ నాటకం చూడలేదు. కానీ పొలిటికల్ రిపోర్టింగ్ లో ఈ డైలాగ్ వర్తించే నాయకుడి ఆవేదనను చూశాను.

వైస్రాయ్ హోటల్ లో బాబు శాసనసభ్యుల క్యాంపు పెట్టినప్పుడు చైతన్యరథం మీద ఎన్టీఆర్ లక్ష్మి పార్వతితో వైస్రాయ్ హోటల్ కు వచ్చారు. వీరితోపాటు అప్పటి మంత్రి కరణం రామచంద్రరావు కూడా రథంపై ఉన్నారు. ముందుగా ఎన్టీఆర్ నివాసంలో వీరంతా భోజనం చేసి రథంపై వచ్చారు. అచ్చం పౌరాణిక సినిమాల్లో చూపించినట్లు రెండు పక్షాలు రెండు వైపులా నిలిచారు.

Ads

అన్నగారు పిలుస్తున్నారు. రండి తమ్ముళ్లూ రండి అని కరణం రామచంద్రరావు చాలాసేపు గొంతు చించుకొని గట్టిగా పిలిచారు. అలా పిలిచి పిలిచి అలసిపోయి రథం దిగి రామచంద్రరావు కూడా బాబు శిబిరంలో చేరిపోయారు. ఎన్టీఆర్ నివాసంలో చేసిన భోజనం అరగక ముందే ఆయన ప్లేట్ ఫిరాయించారు.

చైతన్యరథం మీద ఎన్టీఆర్ దంపతులు ఉన్నప్పుడు బాబు శిబిరం నుంచి చైతన్య రథంపైకి చెప్పులు విసిరారు. కాళ్లకున్న చెప్పులు విడిచి, అన్న కాళ్ళ మీద పడి తమ్ముళ్లు జీవితం ధన్యం అయింది అనుకున్నవాళ్లు కూడా అన్న మీదకు చెప్పులు విసరడం చూశాక, కాల మహిమ, దీనికన్నా గొప్ప జీవిత పాఠం ఏముంటుంది? అనిపించింది.

ఎన్టీఆర్ ను దించాక బాబు నిజాం కాలేజీలో బహిరంగ సభ… ఈ ర్యాలీకి ముందు నడిచింది శ్రీపతి రాజేశ్వరరావు, రమేష్ రెడ్డి… శ్రీపతి రాజేశ్వరరావు శరీరం నిండా ఎన్టీఆర్ బొమ్మ లు, పేరు పచ్చబొట్లు ఉంటాయి. ఎన్టీఆర్ వచ్చేంతవరకు మంగళ సూత్రం కట్టను అని భీష్మించుకుని, ఎన్టీఆర్ వచ్చాక మంగళసూత్రం కట్టిన వీరాభిమాని రమేష్ రెడ్డి.

శ్రీపతి అఖిల భారత ఎన్టీఆర్ సంఘాల అధ్యక్షుడు. ఇద్దరూ ఎన్టీఆర్ వీరాభిమానులు . ఎన్టీఆర్ ను దించేసి పెట్టిన బహిరంగ సభ ర్యాలీకి ముందున్నది ఈ ఇద్దరే. ఎవరికి ఎవరూ అభిమానులు కారు . ఎవరి లెక్కలు వారికి ఉంటాయి అని ఇక్కడే నేర్చుకున్నాను.

టీడీపీ ఆఫీస్ తొలుత హిమాయత్ నగర్ లో ఉండేది. ఓ రోజు అప్పటి రాజ్యసభ సభ్యులు అల్లాడి రాజ్ కుమార్ అంబాసిడర్ కారు డోర్ తీసి ఎక్కుతుంటే, డోర్ పట్టుకొని “ఏంటి, మీరు కూడా బాబు వైపు వెళుతున్నారట! అని అడిగితే , అయన కోపంగా డోర్ మూసేసి “నేను ఆ …. గాడి వద్దకు వెళ్లడమా ? ఏమనుకుంటున్నారు ? అని సీరియస్ అయ్యారు.

ఈయన డాక్టర్ కూడా… లక్ష్మీపార్వతి చెప్పడం వల్ల ఎన్టీఆర్ కు శృంగార సామర్థ్యం కోసం ఆయన మందులు ఇస్తున్నారు అని బాబు వర్గం నాయకుల ప్రచారం. అంత ఆవేశంగా మాట్లాడిన రాజ్ కుమార్ కొద్ది రోజులకే బాబు వర్గంలో చేరారు. ఎన్టీఆర్ కు ఏదో చేస్తున్నారు అని ఆరోపణలు చేసిన బాబు బృందం స్వాగతం పలికింది. ఇది చూసినప్పుడు అందరూ మనుషులే అని తెలుసుకున్నాను.

అన్ని రాజకీయ పార్టీల్లో రాజకీయ కార్యకలాపాలు ఉంటాయి. కానీ టీడీపీలో మొదటి నుంచి సినిమాలో ఉన్నన్ని నవరసాలు ఉండేవి. సినిమా నటుడు స్థాపించిన పార్టీ కాబట్టి రాజకీయ డ్రామాలు, సస్పెన్స్, బోలెడు వినోదం, నాటకీయత ఉండేది. దీని నుంచి రిపోర్టర్లకు బోలెడు వార్తలు లభించేవి. ఎన్టీఆర్ ఉదంతం తర్వాత ఎవరు ఎటు పోయినా, ఎవరిని ఎవరు మెచ్చుకున్నా, ఆగ్రహం వ్యక్తం చేసినా పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. రాజకీయాల్లో ఇవి కామన్ అనిపించింది.

చాలా కాలం తర్వాత ఒకసారి ఆశ్చర్యం వేసింది. తర్వాత రాజకీయాల్లో ఆశ్చర్యం అంటూ ఉండదు అని తెలిసొచ్చింది.
2004 ఎన్నికల ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక రోజు సచివాలయంలో సీఎం ఛాంబర్ కు ఇద్దరం రిపోర్టర్లం వెళితే, రాయలసీమకు చెందిన నాయకులు కలిశారు. మైసూరారెడ్డి టీడీపీలో చేరుతున్నారు అని చెప్పారు. ఆశ్చర్య పోయాను. దానికి కారణం ఉంది.

ఒక ప్రాజెక్ట్ లో బిగ్ బాస్ కు ( బాబు) ముడుపులు ముట్టాయి అని టీడీపీ కేంద్ర మంత్రిగా ఉన్న సముద్రాల వేణుగోపాలాచారి రాసిన లెటర్ మైసూరారెడ్డికి చిక్కింది. అసెంబ్లీలో ఆ లేఖ బయటపెట్టి సంచలనం సృష్టించారు. బిగ్ బాస్ ఎవరో తేల్చాలి అని విపక్షం సభను స్తంభింపజేసింది. అలాంటి మైసూరారెడ్డి టీడీపీలో చేరడమంటే ముందుగా నమ్మకం కలగలేదు.

మైసూరారెడ్డికి డక్కన్ క్రానికల్ యజమాని వెంకట్రాంరెడ్డి తో , బ్యూరో చీఫ్ కృష్ణారావుతో మంచి స్నేహం ఉంది. ఇలాంటి వార్త రాస్తే ఒక తప్పు, రాయక పోతే ఒక తప్పు. గొడవ నాకెందుకు అని కృష్ణారావుకు చెప్పి మీరు రాయమంటే రాస్తాను అని చెప్పాను. ఆయన నవ్వి “తెలివైన నిర్ణయం” అని బదులిచ్చాడు.

కొద్ది రోజులకు మైసూరారెడ్డి టీడీపీలో చేరారు. ఒకరోజు మైసూరారెడ్డి కలిసినప్పుడు 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుంది అని రాజకీయాల గురించి ఆలోచించే ఎవరికైనా తెలుస్తుంది. మీరు ఎలా దెబ్బతిన్నారు? అని అడిగాను. ఆ విషయం నాకూ తెలుసు. అంతే కాదు, వైఎస్సార్ మెంటాలిటీ కూడా బాగా తెలుసు. కాంగ్రెస్ గెలిచి తాను సీఎం అయ్యాక నన్ను పక్కన పెడతాడు, అది తెలుసు, అందుకే టీడీపీలో చేరాను అని చెప్పారు.

టీడీపీలో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కల్పించారు.. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. బయటకు వచ్చారు. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. ఎవరూ లెక్కలకు అతీతులు కారు అని తెలుసుకున్నాను.

ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో తమ్మినేని సీతారాం ప్రెస్ కాన్ఫరెన్స్ అని వెళ్ళాను. నాటకాల్లో గంభీరంగా మాట్లాడినట్టు సీతారాం ఆవేశం తెచ్చి పెట్టుకొని మాట్లాడతారు. చిరంజీవి కొత్తగా ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ మీద విరుచుకు పడ్డారు. ప్రజారాజ్యంను ఇంత ఆవేశంగా తిడుతున్నారు అంటే మీరు ప్రజారాజ్యంలో చేరబోతున్నట్టు ఉంది అన్నాను.

( ఓషో ఉపన్యాసం విన్నాను. నువ్వు ఏదైతే కాదో అది అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు అంటారు ఓషో) ఆ మాట వినగానే తమ్మినేని మరింత ఆవేశంగా నేను చేరడమా? నేను మరణించిన తర్వాత నా శవం మీద టీడీపీ జెండా కప్పాలి అన్నారు. అంటే ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటాను అని అర్థం. అలా చెప్పిన కొద్ది రోజులకే తమ్మినేని ప్రజారాజ్యంలో చేరారు. ఆశ్చర్యం కలగలేదు, వింతగా అనిపించలేదు. ప్రజారాజ్యం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లారు.

రాజకీయం ఒక వ్యాపారం. వ్యాపారంలో లాభాలు నష్టాలు ముఖ్యం కానీ సిద్ధాంతాలు, విలువలు అంటూ ఏమీ ఉండవు అని అర్థం అయింది. మా కంపెనీ లోదుస్తులు వేసుకుంటే అమ్మాయిలు వచ్చి ఒళ్ళో పడి పోతారు అని ఓ కంపెనీ ప్రచారం. కోన్ కిస్కా కంపెనీ టూత్ పేస్ట్ వాడితే అమ్మాయిలు క్యూ కడతారు అని ఒకడు కోట్ల రూపాయలు ప్రచారానికి ఖర్చు చేస్తారు.

ఇది బోగస్ ప్రచారం, వాళ్ళు చూపించినట్టు జరగదు అని టూత్ పేస్ట్ కొనేవాడికి తెలుసు, అమ్మేవాడికి తెలుసు, తయారు చేసేవాడికి, ప్రకటన తయారు చేసేవాడికి, టివిలో చూపేవాడికి అందరికీ తెలుసు. అయినా టూత్ పేస్ట్ కొంటాం. ఇలాంటి ప్రకటనల ప్రభావం నా మీద పని చేయదు అని ఎవరికి వారు అనుకుంటారు. టూత్ పేస్ట్ అవసరం అయినప్పుడు అదే కొంటారు. ప్రచార శక్తి అది. రాజకీయాలూ అంతే ప్రచార శక్తితోనే రాజకీయ వ్యాపారం నడుస్తుంది.

ఎన్టీఆర్ ను దించి బాబు సీఎం అయ్యాక బయట జరిగిన తొలి కార్యక్రమం ఎంఎల్ఏ క్వార్టర్  లో అయ్యదేవర కాళేశ్వరరావు విగ్రహావిష్కరణ. అక్కడ బాబు మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉపన్యాసం విన్న రోజు నవ్వు వచ్చింది కానీ అది ఎంత గొప్ప స్ట్రాటజీయో తర్వాత అర్థం అయింది.

విలువల గురించి పదే పదే మాట్లాడుతుండడంతో రాజకీయాల్లో విలువలకు నిలువెత్తు రూపం బాబు అని గట్టిగా నమ్మే పెద్ద సెక్షన్ ఉంది. ప్రచారంతో సాధించిన విజయం ఇది. ఎవరికి వారు ప్రచారం చేసుకుంటే సాధ్యం అయ్యేది కాదు. ప్రచారం చేసే మీడియా కూడా ఉండాలి. పొలిటికల్ రిపోర్టింగ్ లో ప్రచార బలాన్ని దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది.

మోత్కుపల్లి నర్సింహులు 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనుకోని కాంగ్రెస్ లో చేరి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తీరా టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ టీడీపీలో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఓ రోజు అసెంబ్లీ లాబీలో రాజశేఖర్ రెడ్డి ఇలాంటి వాడు అనుకోలేదు అంటూ మొదలు పెట్టారు. పార్టీ మారాలి అనుకుంటే మారాలి, ఎవరూ ఏమీ అనరు. రాజశేఖర్ రెడ్డి మహాత్మగాంధీ మనవడు అనుకున్నావా ? కాదు, రాజారెడ్డి కుమారుడు అని చెప్పాను. అంతకు ముందు బోలెడు తిట్టిన టీడీపీలోకి జంప్ అయ్యారు.

తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కేసీఆర్ ఒక్కరే తెరాస శాసన సభ్యులు. ఓరోజు సభలో మోత్కుపల్లి కేసీఆర్ ను తిడుతూ స్పీకర్ పోడియంకు తలబాదుకున్నాడు. ఎన్ని తిట్టినా కేసీఆర్ కింద పునాదులు కదులుతుంటే ఇలానే ఉంటుంది అని కూర్చున్నారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా దినసరి పాదయాత్ర చేశారు. ( మార్నింగ్ వాకింగ్ తరహాలో)

తాను గతంలో గెలిచిన ఆలేరు జనరల్ కావడం, తెలంగాణ ఏర్పాటుతో మోత్కుపల్లి రాజకీయం దెబ్బతిన్నది. తెరాస అధికారంలోకి వచ్చాక తెరాసలో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ లో చేరారు. సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తిట్టి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లారు.

ఇంటికి ఒక పత్రిక వేసుకునే రీడర్ అంత ఈజీగా పత్రికను మార్చడు. ఒక బ్రాండ్ పాల ప్యాకెట్ అలవాటు పడ్డాక ఇంకో ప్యాకెట్ వేసుకోరు. బట్టల సబ్బు కూడా మార్చరు కానీ రాజకీయ నాయకులు చాలా ఈజీగా పార్టీల గోడలు దూకేస్తారు. ఎక్కడైనా పుట్టిల్లులా సర్దుకుపోగలరు. లెఫ్టిస్ట్ ఈటల రాజేందర్ హిందుత్వ బీజేపీలో పాలలో నీళ్లలా కలిసిపోతే, తెలంగాణ ఉద్యమకారులపై లాఠీతో దాడి చేసి తెరాసలో చేరి సర్దుకుపోయిన దానం నాగేందర్ ల రాజకీయం నడుస్తున్న కాలం ఇది .

దానం కాంగ్రెస్, టీడీపీ, మళ్ళీ కాంగ్రెస్ , తెరాస, తిరిగి కాంగ్రెస్ లో చెంగుచెంగున గెంతుతుంటే చూసి తరించే అదృష్టం కలిగింది. దానం 2004 లో టీడీపీ శాసన సభాపక్షం కోశాధికారి. ఇలాంటి ఎన్నో వింతలు విడ్డురాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉండే అవకాశం జర్నలిజం ద్వారా లభించింది …. బుద్దా మురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పొలిటికల్ రిపోర్టింగ్ ఎన్నో జీవితసత్యాల్ని ‘అక్షరాలా’ కళ్లకుగట్టింది !!
  • 40 ఏళ్ల కిందటే ఉమ్మడి పౌరస్మృతి, విదేశీ నిధులు, మతమార్పిడిపై చర్చ!
  • ఇది సొంత గడీ కాదు సార్… బాత్రూం రిపేర్లకు కోటి రూపాయలా..?!
  • అర్ధరాత్రి- అందరూ నిశ్శబ్దం- గుప్త తాంత్రిక పూజ- ఎక్కడంటే?
  • మహిళలకు ప్రత్యేకంగా వేరే శబరిమల..? నిజమేంటో చెప్పుకుందాం..!!
  • ఓ వెధవ ట్రోలర్‌కు వేణుస్వామి భార్య వీణశ్రీవాణి పర్‌ఫెక్ట్ కౌంటర్ !!
  • CJP – కూలీ ఇచ్చి మరీ తన్నించుకున్నట్టు అయిపోయింది !!
  • రైతు డిస్కమ్‌పై బీఆర్ఎస్ వక్రబాష్యాలు – పసలేని విమర్శలు
  • అసలే గతితప్పిన సంసారి… పైగా సమాజానికి బోడి ఉచిత సలహాలు…
  • పిచ్చి స్క్రిప్టుతో అభాసుపాలు – ఇప్పుడు దిద్దుబాటుకు మరో ప్రయాస

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions