.
ఇకపై మండల స్థాయిలో ప్రజావాణి! జీవో జారీ చేసిన ప్రభుత్వం! మండల స్థాయికి ప్రజావాణి సేవలు విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అభినందనీయం… ఒకరకంగా ప్రభుత్వాన్ని ప్రజల ఎదుట ఉంచడం! ప్రజాపాలనలో ఇది మంచి కోణం!
ఈ మేరకు మంగళవారం జీవో ఎంఎస్ నంబర్ 4 (తేదీ: 04.08.2026) విడుదల చేసింది. గతంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలకు మాత్రమే పరిమితమైన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇప్పుడు నేరుగా ప్రజల ముంగిటకే తెస్తూ మండల స్థాయికి విస్తరించారు. క్షేత్రస్థాయిలో పాలనను మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Ads
జీవోలోని ముఖ్యాంశాలివే!
ప్రతి వారం సోమవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తారు. ఎంపీడీఓ మండల స్థాయి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. అన్ని శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి, తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.
దరఖాస్తులు తీసుకోవడమే కాదు… ‘యూనిఫైడ్ ప్రజావాణి పోర్టల్’లో నమోదు చేసి, ఐడీతో కూడిన రశీదును అర్జీదారులకు అందిస్తారు. ప్రత్యేకంగా కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ సదుపాయాలతో కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలతో వచ్చేవారికి ప్రజావాణిలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
వేదిక వద్ద తాగునీరు, సీటింగ్, హెల్త్ డెస్క్, వీల్‌చైర్లు వంటి కనీస సదుపాయాలు కల్పిస్తారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయడమే కాకుండా, గ్రామ, మండల స్థాయి అధికారులు, ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంపొందించడమే ఈ ఉత్తర్వుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా స్పష్టమవుతోంది.
ఇకపై ప్రతి సోమవారం అన్ని శాఖల అధికారులు ప్రజావాణి వేదిక వద్దనే ఉండాల్సి రావడంతో, మండల స్థాయిలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేలా ఈ విధానం ఒత్తిడి పెంచుతుంది. కలెక్టర్లు, శాఖాధిపతులు తక్షణమే ఈ ఆదేశాలను అమల్లోకి తెచ్చి, మండల స్థాయి ప్రజావాణి త్వరితగతిన ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
-మానేటి ప్రతాపరెడ్డి…
దీన్ని తమ పొలిటికల్ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసే పార్టీలు, నాయకుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది..
గతంలో గాడితప్పిన పాలనను చక్కదిద్దే ప్రయత్నం, ప్రజలు తమ సమస్యలకు పరిష్కారాన్ని మండల స్థాయిలోనే కనుక్కోగల అవకాశం ఇది… దీనివల్ల ప్రభుత్వం తమ కోసం పనిచేస్తోందనే ఓ పాజిటివ్ భావనను జనంలో కలిగించడానికి స్కోప్ ఉంటుంది…
గతంలో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లకు విస్తృతాధికారాలున్నట్టుగానే, ఎంపీడీవోలకు కూడా అలాంటి అధికారాలిచ్చి, మండల స్థాయిలో ప్రతి అంశానికీ తననే నోడల్ అధికారిగా పరిగణించే ఆలోచన కూడా ఉంది ప్రభుత్వానికి!!
Share this Article