.
అవును, అధర్మారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి కాలంలో తిరుమల ప్రతిష్ట దారుణంగా మసకబారింది, కాదు, చేశారు… సందేహం లేదు… అన్యమత ఉద్యోగుల నుంచి అనేకానెక అపచారాలు, అక్రమాల దాకా… కానీ, ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్లడం లేదు…
ది గ్రేట్ సనాతన ధర్మ వీర పరిరక్షకుడు పవన్ కల్యాణ్, అంతకుమించిన సనాతని చంద్రబాబు పాలిస్తున్న కాలం ఇది… లడ్డూ నెయ్యి దగ్గర నుంచి నకిలీ పట్టు శాలువాల అనేకానేక దుర్మార్గాలపై శోకాలు పెట్టి, మెట్లు కడిగి, ప్రాయశ్చితం చేసుకున్న నాయకులు స్వయంగా పర్యవేక్షిస్తున్న రోజులివి… అరచేతుల్లో వెంట్రుకలు మొలిపించిన టీవీ5 నాయుడు చైర్మన్‌గా ఉన్న అత్యంత పవిత్ర పుణ్యకాలం ఇది…
Ads
అన్యమతస్తులను తరిమేస్తాం, ఎఐ వాడి దర్శనాల సమయం తగ్గిస్తాం వంటి బోలెడు ప్రగల్భాలు… అచ్చం ఆ టీవీ వార్తలు, డిబేట్లలాగే! ఏం జరిగింది..? ఓసారి గుర్తుచేసుకొండి, ఎస్వీ సుబ్బారెడ్డి ఆ రేటు పెంచు, ఈ రేటు పెంచు అని ఆర్జితసేవల రేట్లను ఎడాపెడా పెంచేసిన తీరు గుర్తుంది కదా…
ఛ, వీళ్లు మారరు, రేట్లను బట్టి సేవలు, ఇదొక కార్పొరేట్ దేవస్థానంగా చేశారు, పవిత్రత- ఆధ్యాత్మికతన్నా వ్యాపారం ముఖ్యం వీళ్లకు అనుకున్నాం కదా… అచ్చం, కాదు, ఎస్వీ సుబ్బారెడ్డిని మించి… నాయుడు తక్కువేమీ కాదు… జగన్‌కన్నా చంద్రబాబు మినహాయింపూ కాదు… మరీ ఘోరంగా రేట్ల పెంపు ఇలా…

– ఎస్వీ మ్యూజియం సందర్శకుల్లో 12 ఏళ్లు పైబడిన వారికి రూ.50 ప్రవేశ రుసుం విధించడంతో పాటు మ్యూజియం నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని టాటా సంస్థను కోరాలని నిర్ణయం… ఇది కూడా చేతకాదా..? పైగా ఎంట్రీ ఫీజు…
– రూ.లక్ష విరాళం ఇచ్చేవారికి గతంలో సుపథం దర్శనం ఉండేది, ఇప్పుడు తీసిపారేశారు… ఏడాదికి ఒకసారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (300 టికెట్), రూ.2 లక్షలు ఇచ్చేవారికి ఒకసారి సుపథం… రూ. 3. లక్షలు ఇస్తే ఒకసారి ఎస్ఈడీ.., ఒకసారి సుపథం…, రూ.4 లక్షలు ఇచ్చేవారికి రెండుసార్లు సుపథం… రూ.5 లక్షలు ఇచ్చేవారికి 3 సార్లు సుపథం దర్శనం కల్పిస్తారు… సో, డబ్బును బట్టి సర్వీస్… వావ్, నాయుడూ నీ జన్మ ధన్యం… నీకూ సుబ్బారెడ్డికీ ఏమాత్రం తేడా లేదు… స్వామి నిన్ను ఆశీర్వదించుగాక…
– రూ.10 లక్షలు విరాళంగా ఇస్తే ఒకసారి సుపథం, ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం…, రూ.15 లక్షలు ఇచ్చేవారికి రెండుసార్లు సుపథం, ఒకసారి వీఐపీ బ్రేక్…, 20 లక్షలు ఇచ్చేవారికి 3 సార్లు సుపథం, రెండుసార్లు వీఐపీ బ్రేక్…, రూ.25 లక్షలు విరాళానికి మూడుసార్లు చొప్పున సుపథం, వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు…. ఇక రూ.50 లక్షలు విరాళంగా ఇస్తే ఏటా నాలుగుసార్లు సుపథం, మూడుసార్లు వీఐపీ బ్రేక్ తో పాటు రెండు కల్యాణోత్సవాలు, ఒకసారి సుప్రభాతంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు… హైపెయిడ్, హైప్రయారిటీ అన్నమాట…

. ఇక రూ.75 లక్షలు ఇచ్చేవారికి ఏటా నాలుగుసార్లు సుపథం, మూడుసార్లు వీఐపీ బ్రేక్ తో పాటు ఒక కల్యాణోత్సవం, ఒకసారి సుప్రభాతంలో పాల్గొనవచ్చు…. అలాగే రూ.కోటి విరాళం ఇస్తే నాలుగుసార్లు సుపథం, మూడుసార్లు వీఐపీ బ్రేక్ తో పాటు ఒకసారి సుప్రభాత సేవకు, మూడుసార్లు కల్యాణోత్సవాలకు అనుమతిస్తారు…. ఇక రూ.1.50 కోట్లు అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే ఏటా నాలుగుసార్లు చొప్పున సుపథం, వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ఒకసారి సుప్రభాత సేవకు, ఐదుసార్లు కల్యాణోత్సవాలకు హాజరుకావచ్చు…
సేమ్ కంపెనీ, ట్రస్టు, ఫర్మ్ దాతలకు కూడా దాదాపు ఇలాంటివే… పోనీ, ఈ నాయుడు తను తిరుమలను ఉద్దరిస్తాను అని ప్రమాణం చేసినప్పుడు చెప్పిన అంశాల్లో ఒక్కటైనా నెరవేర్చాడా..? అట్టర్ ఫ్లాప్… అన్యమత ఉద్యోగులపై ఏం జరిగింది..? దర్శన సమయాల కుదింపు ఏం జరిగింది..? ఏమీ లేదు, ఏమీ ఉండదు… తిరుమలను పక్కా కార్పొరేట్ ఆధ్మాత్మిక వ్యాపారంగా మార్చడంలో ఓ భూమనకూ, ఓ నాయుడికీ ఏమాత్రం తేడా లేదు..!!
ఆ దేవదేవుడి మీద భక్తితో వచ్చే వారికి సౌకర్యాలే టీటీడీ లక్ష్యం... అది తప్ప అన్నీ చేస్తుంది టీటీడీ... చంద్రబాబూ, మీ పవన్ కల్యాణ్‌ను దేవాదాయ మంత్రిని చేసి, టీటీడీకి ఎక్స్‌అఫిషియో చైర్మన్‌ను చేయి... అదీ చూద్దాం, మీ లోకేష్‌కు ఇష్టమైతేనే సుమా!!
అయ్యో, చెప్పనే లేదు కదూ… ఇంకా ఉన్నయ్ ఆఫర్లు…
₹1L to ₹5L … 5 నుంచి 10 చిన్న లడ్డూలు, పట్టు దుపట్టా, బ్లౌజ్ పీస్
₹10L to ₹25L… 15 చిన్న లడ్డూలు, పట్టు దుపట్టా, బ్లౌజ్ పీస్
₹50L to ₹75L …. 15 నుంచి 20 చిన్న లడ్డూలు, 5 నుంచి 7 పెద్ద లడ్డూలు, పట్టు వస్త్రాలు, 2 గ్రాముల బంగారు డాలర్, 10 గ్రాముల వెండి నాణెం
₹1 Crore & Above … 20 నుంచి 30 చిన్న లడ్డూలు, 10 నుంచి 20 పెద్ద లడ్డూలు, పట్టు వస్త్రాలు, 2 గ్రాముల బంగారు డాలర్, 10 గ్రాముల వెండి నాణెం
Note: Laddu and వస్త్రాలు are annual gifts.
2g gold dollar and 10g silver coin are one time gifts….
అయ్యో, వెంకన్న స్వామీ... మరీ తిరుమలను చందన బ్రదర్స్ దుకాణం చేసేశారు కదా స్వామీ వీళ్లు!!
Share this Article