.
మూడేళ్లు… రూమ్ నంబర్ 39… ఆ రాత్రి జరిగేది ఏమిటి? చివరికి తెలిసిన రహస్యం మాత్రం…! కొన్ని కథలు మొదలైన ఐదు నిమిషాల్లోనే ముగిసిపోతాయి. మరికొన్ని… చివరి లైన్ వరకు మనల్ని లాగేస్తాయి. ఇది అలాంటి కథే.
ఒకరోజు ఓ వ్యక్తి ఓ హోటల్‌లోకి వచ్చాడు. నేరుగా రిసెప్షన్‌కి వెళ్లి… “మేనేజర్‌ని కలవాలి” అన్నాడు. మేనేజర్ రాగానే ఒక్క ప్రశ్న అడిగాడు. “రూమ్ నంబర్ 39 ఖాళీగా ఉందా?” “ఉంది సర్.”
Ads
“అయితే అదే బుక్ చేయండి.” అంతవరకు అంతా మామూలుగానే ఉంది. కానీ రూమ్‌లోకి వెళ్లే ముందు అతను అడిగిన మూడు వస్తువులే మేనేజర్‌కు షాక్ ఇచ్చాయి. ఒక నల్ల కత్తి… 30 సెంటీమీటర్ల పొడవున్న తాడు… ఒక ఆరెంజ్.
“వీటితో ఏం చేస్తాడు?” అనుకున్నాడు. కానీ కస్టమర్‌ను ప్రశ్నించే హక్కు తనకు లేదని ఊరుకున్నాడు. యాదృచ్ఛికంగా… రూమ్ 39 పక్కనే మేనేజర్ గది. ఆ రాత్రి… అర్థరాత్రి దాటిన తర్వాత…
పక్క గది నుంచి విచిత్రమైన శబ్దాలు మొదలయ్యాయి. ఏవో జంతువులు కేకలు వేస్తున్నట్టుగా… ఏదో బరువైన వస్తువులు నేలపై పడుతున్నట్టుగా… గిన్నెలు దొర్లుతున్నట్టుగా… మధ్య మధ్యలో భయంకరమైన నిశ్శబ్దం. మేనేజర్ గుండె గుబేల్‌మంది.
తలుపు తట్టాలా? పోలీసులకు ఫోన్ చేయాలా? అని ఆలోచించాడు. కానీ చివరికి ధైర్యం చేయలేకపోయాడు.
ఉదయం… ఆ వ్యక్తి ఏమీ జరగనట్టుగా బయటకు వచ్చాడు. బిల్ చెల్లించాడు. హోటల్ బాయ్స్‌కు టిప్ ఇచ్చాడు. నవ్వుతూ వెళ్లిపోయాడు. మేనేజర్ వెంటనే రూమ్‌లోకి పరుగెత్తాడు.
కానీ… అక్కడ ఒక్క వస్తువు కూడా కదల్లేదు. రక్తపు మరక లేదు. పోరాటం జరిగిన ఆనవాలు లేదు. తాను ఇచ్చిన నల్ల కత్తి… 30 సెం.మీ. తాడు… ఆరెంజ్… అన్నీ అలాగే ఉన్నాయి. “అయితే రాత్రి నేను విన్నది ఏమిటి?” అని అతనికి అర్థం కాలేదు.
ఒక సంవత్సరం గడిచింది.
మేనేజర్ ఆ సంఘటనను దాదాపు మర్చిపోయే సమయానికి… అదే వ్యక్తి మళ్లీ వచ్చాడు. మళ్లీ అదే ప్రశ్న. “రూమ్ నంబర్ 39 ఖాళీగా ఉందా?” అదే రూమ్. అదే మూడు వస్తువులు.
ఆ రాత్రి… మళ్లీ అదే భయంకరమైన శబ్దాలు. ఉదయం…
మళ్లీ అదే ప్రశాంతమైన చిరునవ్వు. ఏమీ జరగనట్టే చెక్‌అవుట్. ఇక మేనేజర్‌కు ఇది మిస్టరీ కాదు… పిచ్చెక్కించే ప్రశ్న. మరో ఏడాది ఆ వ్యక్తి కోసం ఎదురు చూశాడు.
మూడో సంవత్సరం.
అతను మళ్లీ వచ్చాడు. రూమ్ 39. నల్ల కత్తి. 30 సెం.మీ. తాడు. ఒక ఆరెంజ్. ఆ రాత్రి వినిపించిన శబ్దాలు ఈసారి మరింత భయంకరంగా ఉన్నాయి. ఉదయం…
ఆ వ్యక్తి వెళ్లబోతుండగా మేనేజర్ అడ్డుకున్నాడు. “సార్… మూడు సంవత్సరాలుగా ఇదే చూస్తున్నాను. ఈరోజైనా నిజం చెప్పండి. లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది.”
ఆ వ్యక్తి కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత మెల్లగా అడిగాడు. “నేను చెప్పేది… నువ్వు జీవితంలో ఎవరికీ చెప్పవు కదా? చెబితే చచ్చిపోతావ్…”
“ప్రామిస్ సర్.” “ఒట్టు.” “నా మీద ఒట్టు.” ఆ వ్యక్తి కాసేపు నవ్వాడు. మేనేజర్ చెవికి దగ్గరగా వచ్చి… ఆ రహస్యాన్ని చెప్పేశాడు. ఆ మాట విన్న వెంటనే… మేనేజర్ ముఖం రంగు మారిపోయింది. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు.
.
.
.
ఆ రోజు నుంచి… తన జీవితాంతం… ఆ రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. ప్రాణభయం… అందుకే… నేను కూడా మీకు చెప్పలేకపోతున్నాను! (వాట్సప్ సేకరణ)
Share this Article