Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీచక్రం మధ్యలో సమంత..! తంత్రమా? అపచారమా? ఏది నిజం!!

September 18, 2026 by M S R

.

సమంత… వివాదాలు కొత్తేమీ కాదు ఆమెకు… తన వ్యక్తిగత వ్యవహార ధోరణి కొందరికి నచ్చొచ్చు, కొందరికి అసలు ఏమాత్రం నచ్చకపోవచ్చు… ఇప్పుడు మరో తాజా వివాదంలో ‘కూర్చుంది’… సీమంతం పేరిట ఆమె స్వయంగా షేర్ చేసుకున్న ఒక ఫోటో హిందూ సమాజంలో కలకలం రేపుతోంది… సోషల్ మీడియాలో అధిక శాతం ఖండనలు, కొద్దిగా సమర్థనలు…

శ్రీచక్రంపై ఆమె కూర్చోవడం, చుట్టూ నిమ్మకాయలు… ఎహె, ఏమిటిది, తాంత్రిక పూజ చేస్తున్నావా..? దీన్ని సీమంతం అనాలా..? రేప్పొద్దున దీన్ని చూసి ప్రతి ఒక్కరూ సీమంతం కార్యక్రమాల్లో ఇదే ‘షో’ చేస్తే, పురాతన వైదిక సంప్రదాయాలు భ్రష్టుపట్టిపోవా..? ఓ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఎందుకు ఇలాంటి ప్రచార షోలకు పూనుకోవాలి..? ఇదీ చాలా మంది అభ్యంతరం…

Ads

నిజమేనా..? ఓసారి కాస్త వివరాల్లోకి వెళ్లాలి మనం… ఆమెకు సమర్థన కాదు, ఖండన కాదు… నిజాల్లోకి… హిందూ పూజలు, సంప్రదాయాలపై నమ్మకాలు ఉన్నవారికి వివరణ కోసం…

సమంత



శ్రీచక్రంపై సమంత… అసలు ఏమిటీ ఈ పూజ? శ్రీవిద్యలో నిజంగానే ఉందా? లేక సెలబ్రిటీ సీమంతం పేరుతో కొత్త ట్రెండా?

ఇది సాధారణ సీమంతం కాదని సమంత స్వయంగా చెప్పింది… “కళా ఆవరణం” లేదా “శ్రీకల్పం” అనే శ్రీవిద్య సంప్రదాయానికి చెందిన ప్రత్యేక ఆచారాన్ని నిర్వహించినట్టు ఆమె వివరించింది… దేవి 94 కళలు, శ్రీచక్రంలోని ఆవరణలు, మంత్రాలు, శరీరంలోని చక్రాలు వంటి అంశాలతో ఈ కార్యక్రమాన్ని అనుసంధానించింది…

అంటే ఫొటోలో కనిపిస్తున్నది ఎవరో నిన్న మొన్న కనిపెట్టిన కొత్త పూజ అని చెప్పేయడం కరెక్ట్ కాదు… శ్రీవిద్యలో కలావాహన అనే ఆచారం నిజంగానే ఉంది… అంతేకాదు, దానిపై అకడమిక్ స్థాయిలో పరిశోధనలు కూడా జరిగాయి… ఒక నిర్దిష్ట శ్రీవిద్య గురుపరంపరలో కలావాహనలో మానవ శరీరాన్నే శ్రీచక్రంతో అనుసంధానించి, దానిలో దేవతా శక్తులను ఆవాహన చేసే భావన ఉందని పరిశోధన వివరిస్తోంది…

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. ఉంది కాబట్టి అందరూ చేయొచ్చా? అదే ప్రశ్న… శ్రీవిద్యకు చెందిన ప్రస్తుత బోధనా వనరుల్లోనే కలావాహనకు మంత్రదీక్ష అవసరమని, శ్రీచక్ర పూజకు కూడా నిర్దిష్ట దీక్ష అవసరమని పేర్కొంటున్నారు… అంటే ఇది “శ్రీచక్రం ఉన్న కార్పెట్ తెచ్చుకోండి… మధ్యలో కూర్చోండి… పూజ అయిపోయింది” అన్నంత సింపుల్ వ్యవహారం కాదనే విషయం స్పష్టమవుతోంది…

ఇంకా విచిత్రమేమిటంటే… శ్రీవిద్య పేరుతోనే జరుగుతున్న కమర్షియలైజేషన్‌పై ఆ రంగంలోని సంస్థలు హెచ్చరిస్తున్నాయి… తక్కువ సమయంలో దీక్షలు, భారీ ఫీజులు, పూర్తి శిక్షణ లేకుండానే ఆచారాలు నేర్పుతామని చెప్పే “money- driven ventures” గురించి హెచ్చరికలు కనిపిస్తున్నాయి… నిజంగా పద్ధతిగా దీన్ని జరిపించే ఉపాసకులు ఈరోజుల్లో ఎందరున్నారనేది ప్రశ్న…

అంటే శ్రీవిద్య పేరుతో కమర్షియల్ పూజలు అన్నీ నకిలీ అని చెప్పలేం… కానీ శ్రీవిద్య అనే పేరు పెట్టుకుని ఏం చేసినా అది శాస్త్రమే అనుకోవడం కూడా ప్రమాదమే… ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం… సమంతే…

సమంత క్రిస్టియన్ నేపథ్యం నుంచి వచ్చిందన్న విషయం కొత్తది కాదు… కానీ ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను “డీప్లీ రిలిజియస్ కాదు… కానీ నాస్తికురాలిని కూడా కాదు; దేవుడిని నమ్ముతాను, అప్పుడప్పుడు ప్రార్థిస్తాను” అని చెప్పింది…

  • నాగచైతన్యతో ఆమె మొదటి వివాహం కూడా రెండు సంప్రదాయాల మేళవింపే… 2017లో ముందు హిందూ పద్ధతిలో పెళ్లి… ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో మరో వివాహం జరిగింది… ఇక రాజ్ నిడిమోరుతో 2025లో జరిగిన రెండో వివాహం లింగ భైరవి సన్నిధిలో భూతశుద్ధి పద్ధతిలో జరిగింది… ఇప్పుడు గర్భసీమంతంలో శ్రీవిద్య ఆచారం…  అయితే సమంత పూర్తిగా హిందువుగా మారిపోయిందా?

దానికి మాత్రం సమంతే సమాధానం చెప్పాలి… మనం చెప్పలేం… కానీ ఆమె తాజాగా మాత్రం “మన సంప్రదాయాల పట్ల నాకు ఎప్పటినుంచో గాఢమైన గౌరవం ఉంది” అనే అర్థం వచ్చేలా మాట్లాడింది… అందుకే ఆమెను “ఏమీ తెలియని సెలబ్రిటీ… ఎవరో పూజారి చెప్పినట్టు చేసుకుంది” అని తేల్చేయడం కూడా సరికాదు…

  • అదే సమయంలో… ఒక సెలబ్రిటీ ఇంట్లో జరిగిన ప్రత్యేక శ్రీవిద్య ఆచారం రేపటి నుంచి ప్రతి సీమంతానికి తప్పనిసరి ఫ్యాషన్‌గా మారకూడదు… ఇదే అసలు భయం ఇప్పుడు… ఇలా చేయించేవాళ్లు హఠాత్తుగా పుట్టుకొస్తే అసలే ప్రమాదం…

ఒకప్పుడు సీమంతం అంటే పెద్దలు, పండితులు, కుటుంబ సంప్రదాయం. ఇప్పుడు సెలబ్రిటీ ఫొటో చూసి కొత్త కొత్త పూజలు ట్రెండ్ అవుతున్నాయి… దానికి శాస్త్రం ఉందా? ఎవరి గురుపరంపర? ఏ అర్హతతో చేస్తున్నారు? ఆచారం ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలు అడగకుండా కేవలం ఫొటో చూసి కాపీ కొడితే మాత్రం అది భక్తి కాదు… ట్రెండ్… అవాంఛనీయం!!

  • శ్రీచక్రాన్ని గౌరవించాలంటే ముందుగా దాని అర్థాన్ని గౌరవించాలి…
    శ్రీవిద్యను ఆచరించాలంటే ముందుగా దాని నియమాలను తెలుసుకోవాలి…
    తెలియకపోతే ప్రశ్నించడం తప్పు కాదు… తెలిసినట్టు నటించడమే అసలు ప్రమాదం…

కానీ ఈ ఒక్క ఫొటోను చూసి రేపు “శ్రీచక్ర సీమంతం” పేరుతో కొత్త కమర్షియల్ మార్కెట్ పుట్టుకొస్తే మాత్రం… అసలు ప్రశ్న అక్కడ మొదలవుతుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శ్రీచక్రం మధ్యలో సమంత..! తంత్రమా? అపచారమా? ఏది నిజం!!
  • అంతటి గండరగండడు కూడా ఆ డైలాగ్ దగ్గర ఇరుక్కుపోయాడు!
  • రిపోర్టర్ చాకచక్యం! నిజాం నవాబు మరణవార్త అలా బయటికొచ్చింది!
  • ఇరాన్ వార్ సైడ్ ఎఫెక్ట్స్ – సౌదీకి చుక్కలు చూపిస్తున్న హుతీలు !
  • తెలంగాణ విముక్తిలో జోధ్‌పూర్? ‘షెకావత్’ మాటలకు అర్థమేంటంటే..!
  • రక్తికట్టని చరణ్ రీఎంట్రీ సీన్! బిగ్‌బాస్ టీమ్ పూర్ స్క్రిప్ట్ రైటింగ్!!
  • సొంతిల్లు లేని కేటీయార్ అవస్థ ఈ తెలంగాణ సమాజానికి పట్టదా!?
  • రేవంత్ బుల్‌డోజర్ దాడి! పెద్ద దొర గడీ ప్రహారీ గోడలకు బీటలు!!
  • ఇదెక్కడి చోద్యం రాజమౌళీ? డబ్బు కావాలి గానీ థాంక్స్ చెప్పవా..?!
  • 100 శాతం టారిఫ్ పిడుగు! ఇండియా- అమెరికా బంధాలకు విషమ పరీక్ష !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions