సాహసమే ఊపిరి …… సయామీ ఖేర్! ….. తాలీ మార్!
తెరపై విన్యాసాలు చేసే హీరోయిన్స్ చాలామంది ఉంటారు. నిజజీవితంలో చాలావరకు సుకుమారంగా ఉంటారు. ఇన్నాళ్ళకి రీల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో కూడా హీరోయిన్ అని సయామీ ఖేర్ గురించి చెప్పచ్చు. సాధారణంగా ఎవరూ ముందుకురాని ఐరన్ మాన్ 70.3 ట్రయా త్లన్ విజయవంతంగా పూర్తిచేసింది మరి. ఇంతకీ ఏమిటీ పోటీ?
ఐరన్ మాన్ 70.3 లేదా హాఫ్ ఐరన్ మాన్ గా పిలిచే పోటీని వరల్డ్ ట్రయా త్లన్ కార్పొరేషన్ ఏటా నిర్వహిస్తుంది. మొత్తం దూరం 70.3 మైళ్ళు. అంటే రేసులో పూర్తిచేయాల్సిన 113 కిలోమీటర్లు. అందులో1.9 కి. మీ ఈత, 90 కిమీ బైక్ నడపడం, 21.1 కిమీ పరుగు ఉంటాయి. ఏడాది ముందుగానే అభ్యర్థులు ఎంపికవుతారు. ఆపై శిక్షణ తీసుకోవాలి. వాతావరణం, కొండలు, గుట్టలు … ఇలా అనేక ప్రతికూలతల మధ్య పోటీపడాలి. పూర్తి చేయడానికి సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పడుతుంది. ఇంత కష్టం కాబట్టే ఎంతో అనుభవం ఉన్నవాళ్లే పోటీపడతారు.
Ads
సయామీ ఖేర్ వైవిధ్య భరితమైన పాత్రలకు పెట్టింది పేరు. దాదాపు ఆమె వ్యక్తిత్వం ఆ పాత్రల్లో కనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో అందరూ కళాకారులే. సాహసాల సావాసం కూడా ఎక్కువే కాబోలు. మొదటినుంచీ నటనతో పాటు ఫిట్నెస్ కీ సయామీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది. యాక్షన్ చిత్రాల్లో చాలా కష్టపడేది. క్రికెటర్ గా ఘుమర్ సినిమాలో మెప్పించింది. ఎటువంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంది.
అలా రోజుకు 14 గంటలు షూటింగ్ లో గడిపి మళ్ళా కఠినమైన శిక్షణ తీసుకోవడం అంత సులభం కాదు. అదీ ఏడాది పాటు. క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేసింది కాబట్టే ఈ ఏడాది జర్మనీ లో జరిగిన పోటీ పూర్తిచేసిన తొలి భారతీయ మహిళగా, నటిగా అభినందనలు అందుకుంటోంది. అటు నటన, ఇటు ఫిట్ నెస్ రెండిటినీ బాలన్స్ చేస్తూ సయామీ సాధించిన విజయం ఎందరో మహిళలకు స్ఫూర్తి. బ్రేవో సయామీ! నీ విజయం అద్భుతం!అందుకో మా సలాం! -కె.శోభ
Share this Article