*కోవిడ్ ముగిసింది – స్వేచ్ఛగా జీవించండి :: 24 నుండి బ్రిటన్ లో ఆంక్షలు ఉండవు*…….. రెండు సంవత్సరాలకు పైగా ప్రపంచ ప్రజల స్వాతంత్ర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్షును ఓ అత్యంత సూక్ష్మ క్రిమి కొరోనా వైరస్ లాగేసుకుంది. ఆర్ఎన్ఏ వైరస్లలో ఉండే తీవ్రమైన వారస కణ (జీన్) మార్పిడిశక్తి మూలంగా గడచిన రెండేళ్లలో రకరకాల రూపాలతో మానవాళి మున్నెన్నడూ ఎరుగని తీవ్రమైన విషాదానికి, విధ్వంసానికి గురి చేసింది. వైద్య ప్రపంచం వేగంగా కదిలి, గొప్ప మేధస్సుతో ఉపశమన వైద్యాన్ని, జబ్బు నుండి రక్షణ కలిగించే టీకాలను త్వరలోనే తీసుకురాగలిగింది. దీంతో ఊహించలేని ఇంతటి విలయాన్ని నివారించగలిగాము.
2021 సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో డెల్టా రూపంలో విరుచుకుపడ్డ కొరోనా వైరస్ లక్షలాది ప్రాణాలను తీసి, వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కోలుకున్న కోట్లాది మందికి బ్రతుకుని ఇబ్బందికరం చేసింది. రెండు వేల 21, నవంబరు 24న దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ రూపంలో… ప్రకృతి అత్యంత శక్తిమంతమైన, దుష్ప్రభావాలు లేని సహజమైన వాక్సిన్ ని మానవాళికి అందించింది. తీవ్రమైన వేగంతో వ్యాపించి, ముందు ఉన్న రకరకాలైన తీవ్రమైన జబ్బును కలుగచేసే రూపాలను తొలగించి… ఒమిక్రాన్ ప్రపంచాన్ని ఆక్రమించింది. ఒమిక్రాన్ సోకిన వారిలో సహజంగా చేకూరిన వ్యాధినిరోధకశక్తి… వివిధానేక టీకాల మూలంగా సంక్రమించే రోగ నిరోధక శక్తి కంటే చాలా చాలా శక్తిమంతమైనది.
తాజా అధ్యయనాలలో దేశవ్యాప్తంగా, అన్ని వయసుల వారిలో దాదాపు 98 శాతం మందిలో… ఒమిక్రాన్ మూలంగా అయితేనేమీ, టీకాల వల్ల అయితేనేమీ వ్యాధి నిరోధక ఏంటీ బాడీస్ ఉన్నట్లు తేలింది… దీంతో 2022 ఫిబ్రవరి 24 గురువారం నుండి కోవిడ్ కి సంబంధించిన అన్ని ఆంక్షలను ఎత్తి వేస్తున్నట్లుగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ బారిన పడ్డ వారు ఐదు రోజులు విడిగా ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం కూడా లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి ఉచిత కోవిడ్ పరీక్షలను కూడా నిలుపుదల చేయనున్నట్లు ప్రకటించింది.
Ads
డెల్టా వేరియంట్ కాలంలో హాస్పిటల్ కి వచ్చిన ప్రతి వెయ్యి మంది కోవిడ్ వ్యాధిగ్రస్తులలో 13 మంది మృత్యువాత పడగా, ఇప్పుడు మరణాలు దాదాపుగా లేవని తెలుస్తోంది. దీంతో ప్రపంచానికి, మీదుమిక్కిలి బ్రిటన్ ప్రజలకు కోవిడ్ నుండి ప్రమాదం లేదని ఆ దేశ ప్రధానమంత్రి, ఆరోగ్యశాఖ ప్రకటించాయి. ఇక మీదట కోవిడ్ పీడ ముందు వున్నట్లే స్వేచ్చగా జీవితాన్ని గడపవచ్చునని చెప్పారు. ప్రపంచంలోని మిగతా దేశాలకు కూడా కోవిడ్ పీడ నుండి త్వరలోనే విముక్తి రావాలని కోరుకొందాం…….
—- డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, సాంక్రమిక వ్యాధుల నిపుణులు
Share this Article