.
మనం ఎన్ని ప్లాన్లు వేసినా… ఏ గుడి దేవుడైనా సరే… తను పిలవాల్సిందే, పిలిస్తే తప్ప వెళ్లలేం, ఏవో అవాంతరాలు కదలనివ్వవు… ఏళ్లుగా వెళ్దామని అనుకుంటూనే వెళ్లలేకపోయిన కొన్ని తీర్థాలకు హఠాత్తుగా పయనం అవుతాం… అలాగే దేవుడి దర్శనం కూడా అంతే… కొన్నిసార్లు ముందస్తు ఏర్పాట్లున్నా కనిపించడు, కానీ తనే మన దగ్గరకు వచ్చి మరీ కరుణిస్తాడు… దేవుళ్లను నమ్మే చాలామందికి ఇది అనుభవైకవేద్యమే…
ఫేస్‌బుక్‌లో Srinu Vasa ప్రొఫైల్‌లో ఓ ఆసక్తికరమైన టెంపుల్ జర్నీ ఎపిసోడ్ కనిపించింది… ఆ పోస్టులో కొన్ని ముఖ్య భాగాలు ఇలా…
Ads
‘‘తీర్థయాత్రలు, దర్శనాలు అంటే భయపడాల్సిన రోజులు. నాలాంటి బడ్జెట్ పద్మనాభాల కైతే గుండె గుభేలే.
ఆరుగురితో వెళ్ళి వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవలసిన ట్రిప్, అనుకోని అనివార్య కారణాలవల్ల ఇద్దరికి, సహస్ర దీపాలంకరణ సేవకు కుదించబడింది. కొండమీద రూం దొరకలేదు. ఎనిమిది గంటల డ్రైవింగ్, హోటల్ రూం రెజర్వేషన్లో ఏదో తేడా కొట్టడం, అన్నీ ఇబ్బందులే.
సేవ తరవాత, పల్లకీ వెంట మాడవీధుల్లో చక్కగా తిరిగేవాళ్ళం. కానీ రోజురోజుకీ జనం పెరిగిపోవడం వల్లనో ఏమో, ఊరేగింపు సమయంలో మాడవీధుల్లోకి జనాన్ని అనుమతించట్లేదు. సేవ ఎలాగూ ఆరుబయటే! ఆమాత్రం దానికి ఇంక సేవా టిక్కెట్ తీసుకొని ఉపయోగమేంటి, సుపధం ద్వారా దర్శనం తప్ప? కొంచెం కోపమొచ్చింది.
మాడవీధులకి ఎక్కడికక్కడ గేట్లు పెట్టేసారు. సరే అని జనం లేని చోట నించున్నాం. స్వామివారి పల్లకీ సరిగ్గా మా ముందు వరకూ వచ్చి ఆగింది. దాదాపు పావుగంట కదల్లేదు, అక్కడే ఉంది. అంత సేపు ఎందుకు ఆగిందో అర్థం కాలేదు. స్వామివారినే చూస్తూ నిలబడ్డాం. ఇంతలో ఒక అర్చక స్వామి వచ్చి, అలా చూస్తారే, గోవింద బొబ్బ కొట్టండి అన్నారు. గోవిందా గోవింద అన్నాం.
స్వామివారికి హారతిచ్చారు, జీయర్ స్వాములంతా సాష్టాంగ పడ్డారు, పాదుకలందుకున్నారు, ఇంకా ఏవో చేస్తూ అక్కడే ఒక పదిహేను నిమిషాలు ఉండిపోయారు. ఇంతలో ఒక అర్చక స్వామి, స్వామివారికి అక్కడ చెల్లించిన అరటిపళ్ళలో ఒక పండు తీసుకొచ్చి పార్వతి చేతికిచ్చారు. మాడవీధులకి ఇరువైపులా ఎక్కడ బడితే అక్కడ జనం. అక్కడ మాత్రం మేము తప్ప ఎవరూ లేదు.
- ఊరేగింపుకి వెనకాల వెళ్ళనివ్వలేదని అలిగిన మమ్మల్ని బుజ్జగించడానికా అన్నట్టు స్వామి మేము తప్ప ఎవరూ లేని అక్కడికే వచ్చి అంత సేపు ఉండిపోయారా అనిపించింది. అది అనుగ్రహం కాక ఇంకేమిటి? ఆ భావనతో మనసు ఒక్కసారిగా పులకించిపోయింది.
తిరిగి బయలుదేరుతూ.. “ఇంటికేనా?” అన్నాను. “మరి కాళహస్తి?” అంది తను. అసలే అలసిపోయాం. పైగా ఒక్కడినే డ్రైవ్ చెయ్యాలి. అనకూడదు గానీ, కాళహస్తి గుడి అంటే “దోపిడీ” అని మనసులో ఒక ముద్ర పడిపోయింది (అప్పటి వరకూ). “అసలే లో-బడ్జెట్ ట్రిప్. ఇప్పుడు కాళహస్తి అంటే అంత బడ్జెట్ లేదు, ఓపిక అసలే లేదు. మళ్ళీ సారి వెళ్దాంలే” అనేసా.
కానీ కారెక్కేక చేతివేళ్ళు గూగుల్ మ్యాప్ లో “శ్రీకాళహస్తి టెంపుల్ పార్కింగ్” అని టైప్ చేసాయి.
“ఇదేంటి, ఇక్కడికొచ్చాం” అంది. “సరే పద, ఒకసారి పెద్దాయన్ని కూడా చూసేసి పోదాం” అన్నాను.
“సర్వదర్శనమే” అని మనసులో ఫిక్స్ అయ్యాం. ఆ లైన్లోకే వెళ్ళాం. తీరా చూస్తే, గుడి లోపలి వరకూ వెళ్ళాక, జస్ట్ దర్శనానికి ముందు, ఒకతను వచ్చి “ఇలా పొండి” అని వేరే లైన్ లోకి పొమ్మన్నాడు. అది 200 రూపాయల శీఘ్ర దర్శనం లైను! స్వామివారి దర్శనం బ్రహ్మాండంగా అయ్యింది.
తరవాత మళ్ళీ అమ్మవారి దగ్గరకి వచ్చాం. మేము అమ్మవారి ముందుకు రాగానే లైన్ అక్కడితో ఆగిపోయింది. తరవాత ఎవ్వరూ లేరు. పది నిమిషాలు తరవాత ఒకామె (స్టాఫ్) మా దగ్గకి వచ్చింది. వెళ్ళమంటుందేమో అనుకుంటూండగా.. పార్వతితో అంది. “అమ్మవారి వడ్డాణం చూడమ్మా. ఎంత బావుంటుందో. వడ్డాణం ముడిదగ్గర పెద్ద నాగ సర్పం ఉంటుంది. అది చూస్తే చాలా మంచిది. అలాగే తాటంకాలు, బంగారు చీర …” ఇలా అమ్మవారి నగల్నీ, అలంకారాన్నీ వివరిస్తూ, అది చూడు, ఇది చూడు అని చెప్పిమరీ చూపించింది! ఇద్దరం ఆమె చెప్పింది వింటూ, అమ్మవారినే చూస్తున్నాం. ఎంతసేపు గడిచిందో మాకే తెలీదు.
జీవితంలో ఎప్పుడూ లేనిది “ఇంక చాలు” అనిపించిన దర్శనం అది. మళ్ళీ అలాంటి దర్శనం కలుగుతుంతో కలగదో!
బడ్జెట్ లేదు, నీ దర్శనానికి రాను అన్నందుకు.. పంతానికి తీసుకెళ్ళి అలా ఫ్రీగా, తనివితీరా చూసే దర్శనం ఇప్పించారు ఆ శివయ్య, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు!
గుడి ప్రాంగణం మొత్తం రెండుసార్లు కలియ తిరిగేసాం. కాలభైరవుడు, శనీశ్వరుడు, దక్షిణా మూర్తి, బోల్డుమంది సుబ్రహ్మణ్యుళ్ళు, శంకరాచార్యులవారి స్ఫటికలింగంతో సహా లెక్కలేనన్ని శివలింగాలు, అంజంజి గణపతి మొదలుకొని లెక్కలేనంతమంది గణపతులు, కన్నప్ప, నాయనార్లు అందరినీ చూసి, దణ్ణాలు పెట్టి, రాలేక రాలేక వచ్చేసాం!
Share this Article