ఆయనో రాజకీయ విశ్వవిద్యాలయం . ఊరకూరకనే ఆయాసపడే ఈతరం రాజకీయ నాయకులు రోశయ్య గారి సంయమనం , క్రమశిక్షణ వంటి ఎన్నో మంచి లక్షణాలను అధ్యయనం చేయాలి , నేర్చుకోవాలి . ఈరోజు ఆయన జయంతి . వారికి నివాళులను అర్పిస్తూ , ఓ సంఘటనను మిత్రులతో పంచుకుంటా …
1978 లో అనూహ్యంగా ఇందిరా కాంగ్రెస్ ఆం.ప్ర లో గెలిచింది . చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి . శాసనమండలిలో రోశయ్య గారు చెన్నారెడ్డి గారికి చుక్కలు చూపించేవారు . అంతటి ఘటనాఘటన సమర్ధుడు చెన్నారెడ్డి గారు కూడా ఇరుకున పడుతుండే వారు .
అటుచేసి ఇటుచేసి ఆయన్ని కాంగ్రెస్ లోకి తీసుకుని వచ్చి మంత్రిని చేసారు చెన్నారెడ్డి గారు . ఆయన తర్వాత రెండవ కృష్ణుడిగా అంజయ్య గారు CM అయ్యారు . ఆ మంత్రివర్గంలో కూడా రోశయ్య గారు మంత్రిగా ఉన్నారు . మూడవ కృష్ణుడిగా భవనం వెంకటరామిరెడ్డి గారు CM గా అయ్యారు . కానీ రోశయ్య గారికి మంత్రి పదవి ఇవ్వలేదు .
Ads
రాష్ట్రమంతా ఆశ్చర్యం . ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘాలు బాగా ఆసంతృప్తికి గురయ్యాయి . గుంటూరు జిల్లా ఆర్యవైశ్య మహాసభ Fancy Merchants Association Hall లో సమావేశమయి , బంద్ కు నిర్ణయం తీసుకున్నాం . ఇంతలో ఆయన గుంటూరు వచ్చారని , వియ్యంకులు కోట శంకరరావు గారింట్లో ఉన్నారని తెలిసింది .
మేమంతా ఆయన దగ్గరకి వెళ్ళి , మా బంద్ నిర్ణయాన్ని తెలియపరిచాం . ఆయన హడావుడి ఏమీ చేయకండి . మరో వైశ్య MLA ఓ పత్రికను సృష్టించి , తాను ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఇందిరాగాంధీ గారిని దుర్భాష ఆడినట్లు , ఆ పత్రికలో ముద్రింపచేసి ప్రధానమంత్రి కి చేర్చారు , టైం పడుతుంది , హడావుడి చేయవద్దనీ మా అందరి నిర్ణయాన్ని ఆపేసారు .
ఆయన సంయమనం పాటించి , వాస్తవాలను ఇందిరాగాంధీ గారికి తెలియచేయటం , ఆ తర్వాత నాలుగవ కృష్ణుడు విజయభాస్కరరెడ్డి గారి మంత్రివర్గంలో మరలా మంత్రి కావటం జరిగి పోయింది .
అలానే మరోసారి జనార్ధనరెడ్డి గారి మొదటి కేబినెట్లో కూడా మంత్రిగా లేరు . అలా ఎప్పుడూ హడావుడి పడటం , వివాదం సృష్టించటం వంటి విన్యాసాలు చేయలేదు . కాబట్టే తర్వాత కాలంలో ముఖ్యమంత్రి , ఆ తర్వాత గవర్నరు పదవులు ఆయాసం లేకుండా వరించాయి ఆయన్ని . కేంద్రంలో NDA ప్రభుత్వం వచ్చినా ఆయన్ని గవర్నరుగా కొనసాగించారు .
ప్రశాంత జీవితానికి , రాజకీయానికి , సంతృప్తికి నిలువెత్తు రూపం రోశయ్య గారు . పదవి/బాధ్యత ఇస్తే చేస్తారు . లేకపోతే గాంధీ భవన్ కు వెళ్లి కూర్చుంటారు . అంతటి సంయమనం సహనం . ఆయనకు నేను తెలుసు , నేనంటే ఇష్టం అని చెప్పుకోవటం నాకెప్పుడూ గర్వమే …. By డోగిపర్తి సుబ్రహ్మణ్యం
Share this Article