Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

న్యూయార్క్ సిటీ నిద్రపోదు.. టైమ్ స్క్వేర్ అస్సలు అలసిపోదు! 

October 10, 2026 by M S R

.

అమెరికాకు న్యూయార్క్… మనకు ముంబైలాగా! దేశ ఆర్థిక రాజధానిగా ముంబైకి ఎలాంటి గుర్తింపు ఉందో.. ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, వినోద రంగాల్లో న్యూయార్క్‌కు అలాంటి ప్రత్యేక స్థానం ఉంది. అయితే న్యూయార్క్‌ను చూసినప్పుడు ఆశ్చర్యం కలిగించే అంశం ఒక్కటే కాదు. అడుగడుగునా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ముఖ్యంగా టైమ్ స్క్వేర్‌లో అడుగుపెడితే.. మనం ఒక నగరంలో ఉన్నామా, ప్రపంచ నాగరికత పోగుపడిన ఓ అడ్డాలో ఉన్నామా అనిపిస్తుంది!

న్యూయార్క్ నిద్రపోదు.. ఇది మాట కాదు, అక్కడి జీవనశైలిని, యాక్టివిటీని చూస్తే అర్థమయ్యే వాస్తవం! తెల్లవారుజాముదాకా రోడ్లపై జనసందోహం, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల నుంచి వచ్చిన టూరిస్టులు… కార్ల రద్దీ, కాంతులతో మెరిసిపోయే భారీ బిల్‌బోర్డులు, సెల్ఫీలు తీసుకునేవారు, రీల్స్ చేసేవారు.. ఎటు చూసినా సందడే సందడి… టైమ్ స్క్వేర్‌లో నిలబడి చుట్టూ చూస్తే కళ్లకు విశ్రాంతి ఉండదు… ఒకవైపు భారీ డిజిటల్ తెరలపై ప్రకటనలు, మరోవైపు పర్యాటకుల సందడి, ఇంకోవైపు వీధి కళాకారుల ప్రదర్శనలు, వరుసగా స్ట్రీట్ ఫుడ్ కౌంటర్లు… ఎక్కడ చూసినా యాక్టివిటీనే!

Ads

ఇంతటి ప్రపంచ ప్రసిద్ధ ప్రాంతంలో రోడ్లు మాత్రం మన ఊహకు భిన్నంగా కనిపిస్తాయి. ఆకాశాన్ని తాకేలా 60, 70 అంతస్తుల భవనాలు ఒకదానికొకటి ఆనుకుని ఉన్నట్టుగా నిలబడితే.. వాటి కింద రోడ్లు మాత్రం కొన్ని చోట్ల సన్నగా, ఇరుకుగా కనిపిస్తాయి… ఆ దృశ్యం చూస్తే హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతం గుర్తుకొస్తుంది… అక్కడ కూడా పరిమిత స్థలంలో భారీ భవనాలు, పెరిగిపోతున్న జనసాంద్రత, వాహనాల రద్దీ కనిపిస్తాయి… అయితే న్యూయార్క్‌లో ఈ దృశ్యానికి ప్రపంచస్థాయి వాణిజ్య కార్యకలాపాలు, పర్యాటకం, వినోద రంగం అదనపు హంగులు అద్దుతాయి…

రోడ్లపై బంపర్ టు బంపర్ కార్లు కనిపిస్తాయి… భూగర్భంలో సబ్‌వే రైళ్లు పరుగులు తీస్తుంటాయి… పైన రోడ్లపై వాహనాలు, ఫుట్‌పాత్‌లపై పర్యాటకులు, ఆకాశంలోకి దూసుకెళ్లినట్టున్న భవనాలు.. ఇలా ఒకేసారి మూడు ప్రపంచాలు కనిపిస్తాయి… రద్దీ కనిపిస్తే నగరం అభివృద్ధి చెందలేదనుకోవడం పొరపాటే. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది వచ్చే నగరంలో ఇంతటి జనసాంద్రతను నిర్వహించడం కూడా ఒక పెద్ద వ్యవస్థే!

టైమ్ స్క్వేర్ అంటే కేవలం లైట్లు, సెల్ఫీలు, రీల్స్ మాత్రమే కాదు. ప్రపంచ వాణిజ్యానికి కనిపించే ముఖచిత్రాల్లో అదొకటి… ఇక్కడే నాస్‌డాక్‌కు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రానిక్ స్టాక్ మార్కెట్ కేంద్రం ఉంది… ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, టెక్నాలజీ కంపెనీలు, ఆర్థిక మార్కెట్ల గురించి మాట్లాడేటప్పుడు న్యూయార్క్ పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది… అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి.. వాల్ స్ట్రీట్ టైమ్ స్క్వేర్‌లో లేదు. అది డౌన్‌టౌన్ మన్‌హట్టన్‌లో, దక్షిణం వైపు కాస్త దూరంలో ఉంటుంది. అయినప్పటికీ రెండూ న్యూయార్క్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలబెట్టే ప్రధాన గుర్తింపులే…

ఇక నైట్ లైఫ్ గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు… బ్రాడ్‌వే థియేటర్లు, ప్రపంచ ప్రసిద్ధ సంగీత నాటకాలు, రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు… ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తాయి… వీధుల్లో అప్పటికప్పుడు మొదలయ్యే సంగీత ప్రదర్శనలు, ఫ్లాష్ మాబ్‌లను తలపించే నృత్యాలు, రంగురంగుల దుస్తుల్లో కళాకారులు… నడుస్తున్న దారినే వినోద వేదికగా మార్చేస్తారు. రోడ్డు పక్కన ఆహారం విక్రయించే స్టాళ్ల దగ్గర కూడా జనం కనిపిస్తారు… ప్రపంచంలోని వివిధ దేశాల వంటకాలు, భిన్నమైన రుచులు… అన్నీ ఒకే ప్రాంతంలో దొరికే అవకాశం ఉంటుంది…

time square

ఇక్కడ కనిపించే మరో విశేషం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన మనుషులు… ఏ దేశం నుంచి వచ్చారో, ఏ భాష మాట్లాడతారో తెలియని వేలాది మంది ఒకే చోట కలుస్తారు… ఎవరో ఒకరు భారీ బిల్‌బోర్డు ముందు నిలబడి ఫొటో తీసుకుంటుంటారు… ఇంకొకరు కుటుంబంతో కలిసి వీడియో రికార్డు చేస్తుంటారు… మరొకరు వీధి కళాకారుడి ప్రదర్శనను ఆస్వాదిస్తుంటారు… అందరి లక్ష్యం ఒక్కటే… టైమ్ స్క్వేర్ అనుభవాన్ని తమ జ్ఞాపకాల్లో పదిలపరుచుకోవడం… రాత్రి 3 గంటల దాకా అక్కడక్కడే తిరుగుతూనే ఉన్నాను…

ఇంతటి సందడి ఉన్న ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాణిజ్య, రిటైల్ ప్రాంతాల్లో ఒకటిగా నిలవడంలో ఆశ్చర్యమేముంది? ఇక్కడి ప్రముఖ ప్రాంతాల్లో వ్యాపార స్థలం అద్దె, ప్రకటనల ఖర్చు సామాన్యమైనవి కావు… ఒక భారీ బిల్‌బోర్డుపై ప్రకటన కనిపించడం కూడా ఒక బ్రాండ్‌కు ప్రపంచం దృష్టిని ఆకర్షించే అవకాశంగా మారుతుంది… కొన్ని సెకన్ల పాటు కనిపించే ప్రకటన వెనుక భారీ వ్యాపార విలువ దాగి ఉంటుంది…

న్యూయార్క్ ప్రాధాన్యం టైమ్ స్క్వేర్‌తోనే ముగిసిపోదు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం కూడా ఈ నగరంలోనే ఉంది… టైమ్‌స్క్వేర్‌కు కాస్త దగ్గరలోనే… వివిధ దేశాల దౌత్య కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు, మీడియా సంస్థలు, ప్రపంచ స్థాయి వ్యాపార కంపెనీలు.. న్యూయార్క్‌ను అంతర్జాతీయ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా నిలబెట్టాయి…

ఏటా ఇయర్ ఎండ్ వేడుకలు టైమ్ స్క్వేర్ మరో ప్రత్యేకత… వేలాది మంది గుమిగూడతారు ఓ భవనం, ఆ చౌరస్తాల్లో… జోష్ పీక్స్… ఉగ్రవాదం కూల్చిన జంట టవర్ల స్థానంలో ఆ జ్ఞాపకంగా జీరో గ్రౌండ్… పక్కనే ఆధునికంగా నిర్మించిన మరో భవనం… మూణ్నాలుగు వందల గజాల్లో 60 అంతస్థుల బిల్డింగ్ మీరు ఊహించగలరా..? ఉంది, నిటారుగా అదే ఓ భారీ స్థంభంలాగా…!! అలా బోలెడు…

ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే సంస్థలు ఒకవైపు ఉంటే.. వీధుల్లో సంగీతం, నృత్యం, వినోదంతో జీవనాన్ని ఆస్వాదించే సాధారణ మనుషులు మరోవైపు కనిపిస్తారు…. బిలియన్ డాలర్ల వ్యాపారాల నుంచి వీధి పక్కన అమ్మే ఆహారం వరకు.. అత్యాధునిక సాంకేతికత నుంచి వీధి కళల వరకు… న్యూయార్క్‌లో అన్నింటికీ చోటుంది… ఆ వీథుల్లో లేని ఫ్యాషన్ లేదు, బట్టలు సరేసరి…

దొరకని ఫుడ్ లేదు, వరల్డ్ క్యూజిన్స్ అన్నీ… అదే టైమ్‌లో రోడ్డు పక్కన ఓ చీప్ హాట్ డాగ్ కూడా…! చివరకు జాతరల్లో ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్లు ఉంటారు కదా… వాళ్లు కూడా వందల్లో… అవును, టైమ్ స్క్వేర్ ఓ అత్యాధునిక మేడారం జాతర !!

అందుకే టైమ్ స్క్వేర్‌ను ఒక కూడలిగా మాత్రమే చూడలేం… ఇది ప్రపంచం తనను తాను ప్రదర్శించుకునే ఒక వేదిక… ఇక్కడ డబ్బుంది, దర్పముంది, వినోదముంది, వ్యాపారముంది, విభిన్న సంస్కృతులున్నాయి… అదే సమయంలో జనసాంద్రత, ట్రాఫిక్, అధిక జీవన వ్యయం వంటి సమస్యలూ ఉన్నాయి… అభివృద్ధికి మెరుపులుంటాయి… దాని వెనుక ఒత్తిళ్లూ ఉంటాయి…

అయినా సరే.. రాత్రి వేళ టైమ్ స్క్వేర్‌లో నిలబడి ఆ కాంతులను, జనసందోహాన్ని, ఆగకుండా సాగిపోయే జీవితాన్ని చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది… ప్రపంచం ఎంత మారుతున్నా, మనుషుల ఆశలు, ఆకాంక్షలు, కలలు మాత్రం ఆగడం లేదు… వాటికి ఒక చిరునామా ఉంటే.. అలాంటి చిరునామాల్లో న్యూయార్క్ ఒకటి!

వాట్ నాట్..? ప్రపంచ నాగరికతకు ఒక అడ్డా.. ప్రపంచ వ్యాపారానికి ఒక వేదిక.. ప్రపంచ పర్యాటకానికి ఒక ఆకర్షణ.. అన్నింటికీ మించి, ఒక్క క్షణం కూడా ఆగని మహానగర జీవనానికి ఒక సజీవ దృశ్యం—టైమ్ స్క్వేర్!

PS: రెండు మూడు తెలుగు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • న్యూయార్క్ సిటీ నిద్రపోదు.. టైమ్ స్క్వేర్ అస్సలు అలసిపోదు! 
  • బ్రాడ్‌వే షో – ఓ రంగస్థల అబ్బురం..! సురభి నాటకాలకు వంద మెట్లు పైన !!
  • స్టాక్ మార్కెట్… మహా పతనం వైపా? తాత్కాలిక సర్దుబాటా?
  • అవే పాత్రలు- భాషలు వేరు – నానా పటేకర్ ముందు ప్రకాశ్ రాజ్ దిగదుడుపే !!
  • ఇదొక ‘PRESS’ దందా ! ఐడీ కార్డులిస్తారట – స్టిక్కర్లు కూడా ఇస్తారట !!
  • ఎలన్ మస్క్ Vs ముఖేష్ అంబానీ ! స్టార్‌లింక్‌ అడ్డుకునే ఆలిగార్కులు !!
  • తన స్టెప్పులతో రష్యన్లను మరోసారి షేక్ చేసిన డిస్కో డ్యాన్సర్!
  • బిగ్గర్ దేన్ హీరో ! అందుకే హీరోలు తన పక్కన చేయడానికి భయపడతారు !!
  • Evil Dead – నానా పటేకర్ మృతిపై ఓ చేదు స్పందన – ఎవరామె? ఏంటీ కథ?
  • నానా పేర్లన్నీ ఒకవైపు – నానా పేరొకవైపు..! వీరుడా సెల్యూట్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions