సినిమా సమీక్షకుడు, రచయిత సూర్యప్రకాష్ ఫేస్‌బుక్ వాల్ మీద ఓ బొమ్మ కనిపించింది… పాత బొమ్మే… అది 1989లో ఆంధ్రజ్యోతిలో కనిపించిన ప్రకటన… అందులో బాలకృష్ణ సినిమా అశోక చక్రవర్తి కథకు సంబంధించిన నిజానిజాల ఆక్రోశం ఉంది…
3 లక్షలకు మలయాళ చిత్రం ఆర్యన్ కథను మేం కొనుగోలు చేస్తే, తెలుగులో రీమేక్ చేస్తే… అదే కథను చౌర్యం చేసి మరో తెలుగు సినిమాను నిర్మించారు… ఇదేమైనా భావ్యంగా ఉందా..? అని సినిమా మేకర్స్ ధైర్యంగా విడుదల చేసిన అసాధారణ ప్రకటన ఇది… అప్పట్లో ఇది పెద్ద వార్తే…
ఇప్పుడంటే ఇలాంటి కథాచౌర్యాలను, కాపీ నైచ్యాలను సోషల్ మీడియా బయటికి తీసి ఎండగడుతోంది గానీ అప్పట్లో ఇండస్ట్రీ మీద పల్లెత్తుపదం కూడా నెగెటివ్‌గా రాసేది కాదు మీడియా… అందుకే కడుపు మండిపోయి ఇలా ప్రకటన రిలీజ్ చేసుకున్నట్టున్నారు…
Ads
నిజానికి స్కార్‌ఫేస్ అని హాలీవుడ్‌లో ఓ సినిమా వచ్చింది, అల్ పాసినో హీరో… దాన్ని మలయాళీలు ఎవరో ఫ్రీమేక్ చేసుకున్నారు… దాన్ని మన తెలుగు నిర్మాతలు కొనుక్కున్నారు రీమేక్ కోసం… మరో తెలుగు చిత్రం సేమ్ కథతో నిర్మించబడింది అప్పుడే… అందులోనేమో వెంకటేశ్ హీరో… సినిమా పేరు ధ్రువనక్షత్రం…
ఆ కథా చౌర్యానికి పాల్పడింది అద్వితీయ సోదరులు అని ప్రకటనలో ఉంది… అంటే పరుచూరి బ్రదర్స్ అని వాళ్ల ఉద్దేశం… సరే, ఒరిజినల్ కొనుగోలుదారు సినిమా హిట్టయిందా, కాపీ కథ హిట్టయిందా అనే డిబేట్ పక్కన పెడితే… మన సినిమా కథలు, కాపీలు, ఫ్రీమేకులు, రీమేకులు అన్నీ ఓ మాయాప్రపంచం… అప్పటి నుంచే…
ఈ రెండు సినిమాల టైటిల్స్‌లో కూాడా పరుచూరి బ్రదర్సే కథారచయితలు అని పడుతుంది… ఒకే కథలో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల కాగా, ఒరిజినల్ కొన్న నిర్మాత సినిమా ఫట్… కాపీ కథ రాయించుకున్న నిర్మాత సినిమా హిట్… అదీ మాయ… సరే, ఇక్కడ దర్శకుల ప్రతిభను బట్టి ఫలితాలు వచ్చి ఉంటాయి…
నిజానికి ఇలాంటి కేసుల్లో ఇది కాపీ, పేటెంట్ ఉల్లంఘన అని నిరూపించడానికి కూడా చాన్స్ ఉండదు పెద్దగా… ఎందుకంటే..? ఒరిజినల్ ప్లాట్‌కు కాసిన్ని మార్పులు చేసి, రీరైట్ చేయిస్తారు… రెండు పాత్రలు తీసేస్తారు, మరో రెండు పాత్రలు కలిపేస్తారు… పాత్రల వృత్తులు, ప్రవృత్తుల్ని మారుస్తారు… అంతే, కొత్త కథలాగే మేకప్ చేస్తారు…
విదేశీ సినిమాలు చూడటం, మన ఇండియన్ నేటివిటీకి తగినట్టు… లేదా టిపికల్ తెలుగు సినిమా అవ- లక్షణాలకు తగినట్టు రీరైట్ చేయించుకోవడం ఏనాటి నుంచో ఉన్న అలవాటే… దొరికితే దొంగలు… లేకపోతే దొరలే… ఇప్పుడంటే నెట్ విస్తృతి బాగా పెరిగి, ప్రేక్షకులు చాలా భాషల సినిమాలు చూస్తున్నారు, దాంతో మనవాళ్లు పాటల్ని, కథల్ని, ట్యూన్లను ఎక్కడి నుంచి కాపీ కొడుతున్నారో ఇట్టే పట్టేస్తున్నారు…
కోర్టులకు వెళ్లినా కాపీ నిరూపణ కష్టమే కాదు, అది అటోఇటో తేలిపోయేలోపు సినిమా రిలీజు కావడం డబ్బులు రావడమో, డబ్బాలు వెనక్కి రావడమో జరిగిపోతుంది… ఇప్పుడంటే శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ గట్రా ఉన్నాయి కాబట్టి సినిమా రిలీజయ్యాక కూడా వివాదాలకు, విచారణలకు విలువ ఉంటోంది, గతంలో ఇవన్నీ లేవు కదా… చాలా సినిమాలకు ఇప్పుడు థియేటర్ ఆదాయంకన్నా ఓటీటీ, టీవీ ఆదాయమే ప్రధాన వనరుగా ఉంటోంది కాబట్టి కోర్టుల దాకా వెళ్తున్నాయి..!!
Share this Article