సేమ్, మళ్లీ ఆరోజులే… జగన్ అక్రమాస్తుల కేసు… సీబీఐ దర్యాప్తు… అరెస్టులు… రోజూ పుంఖానుపుంఖాలుగా లీకులు, వార్తలు, కథలు, పేజీలకు పేజీలు… టీడీపీ మీడియా మొత్తం అదే పని… సీబీఐ అప్పటి జేడీ లక్ష్మినారాయణ రోజువారీ ముఖ్యవిధుల్లో ఒకటి పత్రికలకు లీకులు ఇవ్వడం… అన్నింటి లక్ష్యం ఒకటే జగన్ అవినీతిపరుడు, వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్నాడు అనే భావనను జనంలోకి విస్తృతంగా తీసుకుపోవడం…
జగన్ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు దొరికింది ఇప్పుడు ఆ మీడియాకు… ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూస్తే… 8 వార్తలున్నయ్… ఉక్రెయిన్ బ్యానర్‌కు దీటుగా ఈ వివేకా లీకు వార్త మరో బ్యానర్… అంత ప్రయారిటీ… దాదాపు రెండు పేజీల్లో ఇలాంటి కథనాలే… ఫలానా వాంగ్మూలం… ఇవిగో వివరాలు… అవన్నీ ఎలా లీకవుతున్నయ్..? ప్రజెంట్ ‘‘జేడీ లక్ష్మినారాయణ’’ ఎవరు..? ఈనాడు కూడా జ్యోతిలో వచ్చిన బాపతు కథనాల్నే కాస్త ఎడిట్ చేసుకుని, దాదాపు సగం పేజీలో 4 వార్తలుగా అచ్చేసింది…
Ads
అప్పట్లో టీవీ9, ఎన్టీవీ, టీవీ5, ఈటీవీ, ఏబీఎన్… దాదాపు ప్రతి టీవీ జగన్ వ్యతిరేకమే… జేడీ నుంచి లీక్ రాగానే వార్తల్ని కుమ్మిపారేసేవి… అప్పటికీ ఇప్పటికీ సీన్ మారింది… టీవీ5, ఏబీఎన్ మినహా దాదాపు ప్రతి చానెల్ కేసీయార్ చెప్పుచేతల్లో ఉన్నయ్… జగన్‌కు సొంత మీడియా ఉంది… టీడీపీ కార్యకర్తల్లాగే వ్యవహరించే టీవీ5, ఏబీఎన్ చానెల్సే పచ్చక్యాంపులో మిగిలినయ్… అందుకే టీవీల్లో వివేకా మర్డర్ కేసు వాంగ్మూలాల స్టోరీల గగ్గోలు పెద్దగా లేదు…
ఓ ప్రముఖ దేశ్‌కీనేత హత్యేమీ కాదు ఇది… ఇప్పుడు వస్తున్నవన్నీ సాక్షులు, పాత్రధారుల వాంగ్మూలాలు మాత్రమే… కోర్టు విచారణలో నిలిచేవెన్నో తెలియదు గానీ… ఇప్పుడు జగన్‌ను ఫుల్ బదనాం చేయడానికి ఉపయోగపడుతున్నయ్… నిజానికి ఈ మర్డర్ కేసు జగన్‌కు పెద్ద తల్నొప్పే… కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్టుగా ఉందని సజ్జల తనే ఓసారి ప్రెస్‌మీట్‌లో అన్నాడు… అదే పరిస్థితి… ఇది ఎంత రచ్చ అయితే జగన్‌కు అంత మైనస్… టీడీపీ మీడియా ఉద్దేశం కూడా అదే… మాగ్జిమం జనంలోకి తీసుకుపోతే అది జగన్ మీద వ్యతిరేకతకు ఉపయోగపడుతుంది అనేదే భావన…
ఇక అసలు విషయానికి వస్తే… ఈ కథనాలు చదివితే అత్యంత గందరగోళంగా ఉంటున్నయ్… అన్నింటి ప్రధాన లక్ష్యం జగన్ కుటుంబం, ఎంపీ అవినాష్‌ను దోషిగా చూపించడం, జగన్‌ను ఇంకా ఇంకా బదనాం చేయడం… ఐతే ఆరోజు ఏం జరిగింది, దానికి ముందు ఏం జరిగిందో, ఎవరి వెర్షన్ ఏమిటో రాస్తున్నారు గానీ… ఓ క్లియర్ పిక్చర్ సగటు పాఠకుడికి రావడం లేదు… బహుశా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే స్వయంగా పూనుకుని, సీన్ రీక్రియేట్ చేసి మరో ఫుల్ పేజీ సొంత కథనాన్ని కుమ్మేయాలేమో…
మొత్తం ఆ పత్రికలోని రెండు పేజీల ప్రత్యేక కథనాల్ని ఎన్నిసార్లు చదివినా సరే… అసలు ఈ హత్య కేసులో ఎవరు ఎవరికి ఫాలోయరో, ఎవరికి చుట్టమో, ఎవడి పాత్ర ఏమిటో, వివేకా రెండు పెళ్లి బాగోతం ఏమిటో, ఆ ఆస్తుల పంచాయితీ ఏమిటో, అసలు మోటివ్ ఏమిటో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు… అనేకానేక అక్షౌహిణులు తన్నుకున్న, తెగనరుక్కున్న కురుక్షేత్ర కథ కాస్త నయం… ఎవడు ఎవడికి ఏమవుతాడో, ఎటువైపో అర్థమవుతుంది… కానీ ఈ వివేకా మర్డర్ కేసు మాత్రం ఎవరికీ అంతుచిక్కని ఓ పెద్ద చిక్కుముడి… ఇంకా ఈ ప్రచార నిర్వాకానికి తోడు ఈ కథనాలన్నీ తెలంగాణ ఎడిషన్లలో కూడా అచ్చేసి చావగొడుతున్నారు…
ఫాఫం, ఈ మొత్తం యవ్వారంలో ఎడ్డి వేషం సాక్షి వంతు… యెల్లో మీడియా ఏది రాసినా కస్సుమని ఇంతెత్తున లేచి కౌంటర్లు దంచి కొట్టే సాక్షికి ఇప్పుడేం రాసుకోవాలో అర్థం కావడం లేదు…!! అవును గానీ… జగనన్న ప్రజెంట్ ట్రెండ్ తెలుసుకోవడం లేదా..? కోర్టుకు వెళ్లి ఈ కేసుపై ఏమీ రాయవద్దని గాగ్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు కదా..?! మరో వంద మంది సలహాదారుల్ని పెట్టుకొని చూడు, కొత్త అవుడియాలు ఏమైనా వస్తాయేమో..!!
Share this Article