Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రష్యాకు అనూహ్య నష్టాలు… తెగించి తిప్పికొడుతున్న ఉక్రెయిన్…

February 27, 2022 by M S R

…. by… పార్ధసారధి పోట్లూరి………   నాకు ఆయుధాలు ఇవ్వండి… ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదమీర్ జెలెనస్కి నిన్న అన్న మాటలవి… అమెరికా అధ్యక్షుడు బిడెన్ జెలెనస్కిని అమెరికాకి వచ్చేయమని సలహా ఇచ్చాడు. అంటే దేశం వదిలి పారిపోయి రమ్మని ఆహ్వానించాడు. అక్కడితో ఆగక ప్రత్యేక విమానం పంపిస్తాను అంటూ వాక్రుచ్చాడు బిడెన్ ! నాకు ఫ్లైట్ కాదు, ఆయుధాలు కావాలి అని అడిగాడు జెలెనస్కి… మిలటరీ దుస్తులు ధరించి తానే స్వయంగా యుద్ధరంగంలోకి దిగి, తన ప్రజలని కూడా ఆయుధాలు చేతబట్టి దేశ రక్షణలో భాగం కమ్మని సందేశం ఇస్తున్నాడు…

చెచెన్యా పాఠాలు :: గతంలో చెచెన్యా రాజధాని గ్రోజ్ని మీద దాడిచేసిన రష్యా దళాలు చెచెన్ తిరుగుబాటు దళాలో చేతిలో చావు దెబ్బ తిన్నాయి. సైనికపరంగా ఇది తప్పు వ్యూహం ! రెండవ ప్రపంచయుద్ధ సమయంలో వాడిన వ్యూహమే పదేళ్ళ క్రితం చెచెన్ తిరుగుబాటు దళాల మీద ప్రయోగించి భంగపడ్డది రష్యా.. అంటే నేరుగా అర్బన్ నగరాల మీద దాడి చేయకూడదు. ముందు దాడి చేయబోయే నగరానికి చుట్టూ ఉండే పల్లెలు స్వాధీనం చేసుకొని, మెల్లగా నగరంలోకి ప్రవేశించి దాడి మొదలుపెట్టాలి. గ్రోజ్ని దాడిలో నేర్చుకున్న పాఠాల ప్రకారం, నిన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీద నేరుగా దాడి చేయకుండా నగరానికి బయటే ఉండి ముందు షార్ట్ రేంజ్ మిసైళ్ళ ద్వారా కీవ్ మీద దాడి చేసింది… కానీ కీవ్ నగరంలోకి ప్రవేశించలేదు రష్యన్ దళాలు. మూడవ రోజుకి ఉక్రెయిన్ ని స్వాధీనం చేసుకోవాలనే పుతిన్ వ్యూహం అంత త్వరగా నెరవేరదు అని గ్రహించాడు…

జావెలిన్ అటాక్ :: అమెరికా దాదాపుగా 3 వేల యాంటీ టాంక్ గైడెడ్ జావెలిన్ మిసైల్స్ ని ఇచ్చింది. నిన్నటి వరకు దాదాపుగా 15 రష్యన్ T-80,T-90 యుద్ధ టాంక్ లని నాశనం చేసింది ఉక్రెయిన్ సైన్యం జావెలిన్ లతో. ఇదేమీ తక్కువ సంఖ్య కాదు. ఇక రష్యన్ Su-27 లు రెండు, ఒక Su-35, ఒక Su-57s లని ఉక్రెయిన్ దళాలు కూల్చేసాయి. విశేషం ఏమిటంటే ఒకే ఒక ఉక్రెయిన్ MIG-29 విమానం నాలుగు రష్యన్ ఫైటర్ జెట్లని కూల్చివేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో కానీ అటు నాటో దేశాలలో కానీ ఒకే ఒక్క విషయం మిస్టరీగా ఉంది అది ఏమిటంటే… నాలుగు రష్యన్ జెట్లు అదీ వాటిలో అదునాతనమయిన Su -57 ని కూల్చడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఆ MIG-29 నడుపుతున్న పైలట్ ఎవరో తెలీదు.

Ads

రష్యా పాలిట ఘోస్ట్ :: ప్రస్తుతానికి ఇటు ఉక్రెయిన్ లో కానీ అటు నాటో దేశాలలో కానీ ఈ MIG-29 ని ఘోస్ట్ [GHOST ] పేరుతో పిలుస్తున్నారు. మొదట్లో ఇది అబద్ధం అని అనుకున్నారు కానీ నాలుగు విమానాలని ఎయిర్ to ఎయిర్ మిసైల్ తో కూల్చడం మొబైల్ ఫోన్ లలో వీడియో తీసారు కొంతమంది ఉక్రెయిన్ పౌరులు. దృశ్యాలు అంత క్లియర్ గా లేవు కానీ ఫైటర్ జెట్ ల మీద అవగాహన ఉన్న సైనిక నిపుణులు మాత్రం కూలిపోయిన నాలుగు జెట్ల లో ఒకటి రష్యాకి చెందిన అదునాతాన Su-57s గా గుర్తించారు. అలాగే అది కూలుతున్న సమయంలో దాని చుట్టూ ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఉక్రెయిన్ MIG-29 ఎగురుతూ వీడియోలో స్పష్టంగా కాకపోయినా అది MIG-29 అని గుర్తుపట్టే విధంగానే ఉంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని చోట్ల రష్యా దళాలు ముందుకు చొచ్చుకు రాకుండా ఉక్రెయిన్ దళాలు తీవ్ర ప్రతిఘటనని ఇస్తున్నాయి. సంఖ్యలో ఎక్కువగా ఉన్నా సరే రష్యా దళాల కదలికలు ప్రొఫెషనల్ సైన్యానికి ఉన్నట్లుగా లేవని వార్తలు వస్తున్నాయి. మరోవైపు బ్రిటన్ సప్లై చేసిన మాన్ పోర్టబుల్ యాంటి ఎయిర్ మిసైల్స్ ని ఉపయోగించి ఉక్రెయిన్ సైనికులు నాలుగు రష్యన్ ఎటాక్ హెలికాప్టర్లనూ కూల్చేశారు. ఇది పెద్ద వార్త!

అప్పట్లో రష్యాకు పరాభవం :: ఆఫ్ఘన్ యుద్ధంలో రష్యా దళాలకి వ్యతిరేకంగా, గతంలో ముజాహిదీన్ లకి అమెరికా స్టింగర్ మిసైల్స్ ని భారీ మొత్తంలో ఇచ్చింది. స్టింగర్ మిసైల్స్ ని వాడి ముజాహిదీన్ లు రష్యన్ ఎటాక్ హెలికాప్టర్లతో పాటు Su-24 ఫైటర్ జెట్లని కూడా కూల్చేశారు. 1989 లో అమెరికా దాదాపుగా 600 స్టింగర్ మిసైల్ లాంచర్స్ ని పాకిస్థాన్ ద్వారా ముజాహిదీన్ లకి ఇచ్చింది. ఎప్పుడయితే స్టింగర్ మిసైల్స్ ముజాహిదీన్ ల చేతికి వచ్చాయో అప్పటి నుండి వరుసగా రష్యన్ హెలికాప్టర్లనూ, ఫైటర్ జెట్లని పిట్టలని కూల్చినట్లు కూల్చడం మొదలు పెట్టేసరికి రష్యా భూమి మీద ఉండే టార్ గేట్ల మీద దాడి చేయడం నిలిపివేసింది దాంతో ముజాహిదీన్ లు స్వేచ్చగా తిరగడానికి వీలయింది. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధంలో అప్పటి సోవియట్ విఫలం అయ్యి వెనక్కి వెళ్ళిపోవడంలో ప్రముఖ పాత్ర వహించింది స్టింగర్ మిసైల్స్ అనే చెప్తారు.

సేమ్, ఆ పాత కథే ఇప్పుడూ :: మీకు నేను రెండు పోలికలు చెప్తాను స్పష్టంగా ! ఆఫ్ఘనిస్థాన్ లో యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు పాకిస్థాన్ ISI తో పాటు ముజాహిదీన్ లతో కలిసిపోయిన పాకిస్థాన్ సైనికులు సమాచారం చేరవేసేవారు. పాకిస్థాన్ లో తిష్ట వేసిన పెంటగాన్ వ్యూహకర్తలు ఎప్పటికప్పుడు రష్యన్ దళాలని ఏ ఆయుధాలతో ఎలా ఎదుర్కోవాలో సూచనలు ఇస్తూ ముజాహిదీన్ లకి సహకరించారు. మొదట్లో ముజాహిదీన్ లు భూమి మీద నుండి స్టింగర్లని ప్రయోగించేవారు కానీ వాటి రేంజ్ తక్కువ కావడంతో, కింద నుండి వచ్చే స్టింగర్ లని చూసి పైలట్లు వేగంగా దిశ మార్చేవారు దాంతో అవి టార్గెట్ లని కొట్టలేకపోయేవి. సమాచారం పాకిస్తాన్ లోని అమెరికన్ వ్యూహకర్తలకి వెళ్ళగానే వెంటనే ఎత్తయిన కొండల మీదకి ఎక్కి, హెలికాప్టర్లు వాళ్ళ ముందు నుండి వెళ్ళగానే వెనుక నుండి ఫైర్ చేయమని సూచనలు ఇచ్చారు. ఈ సారి వ్యూహం ఫలించింది. వరుసగా రష్యన్ గన్ షిప్ లని కూల్చడం మొదలు పెట్టారు. ఆ తరువాత స్టింగర్ లని ఎలా వాడాలో బాగా నేర్చుకున్నారు ముజాహిదీన్ లు. ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్ కమాండర్లు నేరుగా నాటో కమాండ్ సెంటర్ లకి యుద్ధ వార్తలని ఇస్తున్నారు అదీ GPS కో ఆర్డినేషన్ లతో సహా… దాంతో అమెరికన్, నాటో వ్యూహకర్తలు ఉక్రెయిన్ కమాండర్ల కి సూచనలు ఇస్తున్నారు. వాటి ఫలితమే రష్యా ఫైటర్ జెట్ల కూల్చివేత జరిగింది. అలాగే జావెలిన్ ని ఉపయోగించి టాంక్ లని ధ్వంసం చేయడం కూడా నాటో పని మాత్రమే…

పుతిన్ ఏం చేయాలి :: ఇప్పుడు పుతిన్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. 1. సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడాలి 2. సంధి చేసుకోవడానికి మధ్యవర్తిని చూసుకోవాలి. ఆ మధ్యవర్తి బహుశా నరేంద్ర మోదీ కావొచ్చు ఎందుకంటే నిన్న మోదీ నేరుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనస్కితో ఫోన్ లో మాట్లాడారు. మరోవైపు పుతిన్ ఉక్రెయిన్ కి ఆఫర్ ఇస్తున్నాడు. మీరు మీ రాజకీయ నాయకులని పక్కన పెట్టేసి, చర్చలకి వస్తే పరిష్కారం దొరుకుతుంది అని… అంటే ఉక్రెయిన్ రాజకీయ నాయకులతో చర్చలు జరపడానికి సిద్ధంగా లేడు పుతిన్…

మింగుడుపడని జెలెనస్కి :: తన సైన్యాన్ని వెనక్కి పిలిపించాలి అంటే భవిష్యత్తులో నాటో కూటమిలో కలవము అంటూ ఉక్రెయిన్ హామీ ఇవ్వాలి, అదీ రాజకీయ నాయకుల నుండి కాదు అంటాడు పుతిన్. మరి ? సైన్యం తరుపున కావాలట లేదా ప్రజలలో ఎవరో ఒకరిని తమ నాయకుడిని ఎన్నుకొని అతన్ని చర్చలకి రమ్మని అడుగుతున్నాడు. ఒకరకంగా ఈ సమస్య తమ దేశ రాజకీయ నాయకుల వల్లనే వచ్చింది అనే భావాన్ని ఉక్రెయిన్ ప్రజల్లో బలంగా నాటడానికి ప్రయత్నిస్తున్నాడు పుతిన్. దీనిని ముందుగానే పసిగట్టిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనస్కి తాను స్వయంగా మిలటరీ దుస్తులు ధరించి, తుపాకీ చేత పట్టి, తన సైనికులతో ఫోటో తీసుకొని దానిని వైరల్ చేసాడు. పైగా అమెరికా అధ్యక్షుడు తమ దేశంలో ఆశ్రయం ఇస్తాను అన్నా తిరస్కరించి, తన దేశ భక్తిని చాటుకునే ప్రయత్నము చేసాడు ఆల్రేడి! నిజానికి ప్రపంచం మమ్మల్ని ఒంటరిని చేసింది అని బాధపడేవాడు పుతిన్ తో సంధి చేసుకొని ఆ డిమాండ్లని నెరవేర్చి తన పౌరులు, సైనికుల ప్రాణాలు కాపాడి ఉండవచ్చుగా ? ఆలా చేస్తే తన పదవిని కోల్పోవాల్సి రావొచ్చు… అది ఇష్టం లేదు జెలెనస్కికి… తన పదవి పోకూడదు కానీ ప్రజలు తుపాకీ చేత పట్టి వాళ్ళు చనిపోయినా ఫరవాలేదా ?

రష్యాకూ భారమే :: ఒకపక్క రాజీ చేసుకోవడానికి అవకాశమిస్తూనే, మరోవైపు తన చెచెన్ ముస్లిం స్పెషల్ కమాండో దళాలు 10 వేల మందిని రంగంలోకి దించాడు ఇప్పటికే! వీళ్ళు అత్యంత క్రూరులు అని పేరు ఉంది. ఈ చెచెన్ స్పెషల్ కమాండోలని భరించడం మాత్రం ఉక్రెయిన్ కి చాలా కష్టం! చూద్దాం, సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడతాడో లేక రాజీకి పచ్చ జెండా ఊపుతాడో ! నాటో, అమెరికాలు వెనక నుండి నడిపిస్తున్న ఉక్రెయిన్ ని ముజాహిదీన్ లతో పోల్చవచ్చు. ఆ అనుభవం మళ్ళీ రిపీట్ అవుతుంది అని భావిస్తే మాత్రం పుతిన్ ఒక అడుగు వెనక్కి వేయాల్సి రావొచ్చు. ఎందుకంటే రోజుల తరబడి యుద్ధం చేయాలంటే భారీ ఖర్చుతో కూడిన పని… అది పుతిన్ భరించే స్థితిలో లేడు. అందుకే చెచెన్ స్పెషల్ కమాండోలని పంపుతున్నది. ఈ ప్రయోగం విఫలం అయితే మాత్రం ఇక ఇప్పట్లో ఈ యుద్ధం ఆగదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions