.
ఒకడు అంటాడు, రామాయణ్ ట్రెయిలర్‌లో హనుమంతుడు లేడేమిట్రా అని… వాడికి తెలియనిది ఈ పార్ట్ వన్ కేవలం సీతాపహరణం వరకు మాత్రమేనని..! మరొకడి విమర్శ ఏమిటంటే, ఆకాలంలో ఈ మోడరన్ డ్రెస్టులున్నాయా అని… ఇంకొకడి విమర్శ, సాయిపల్లవి ఆ సీత పాత్రకు నప్పలేదని… అశోకవనంలో సీతను ఓ ధీరురాలిగా కత్తిపట్టుకుని చూపించాడేమిటబ్బా అని మరో సందేహం…
విష్ణువును చూపించారు కదా, అది మహేశ్ బాబేనా..? ఇదో చర్చ, బాబూ, అది సీఈఐ క్రియేషన్..! రణబీర్ డబుల్ యాక్షన్, పరుశురాముడిగా కూడా తనే, ఇదో చర్చ… సో వాట్, రెండూ విష్ణువు అవతారాలే కదా… సరే, ఎవడిష్టం వాడు… కానీ, ఎవరూ గమనించని ఓ సూక్ష్మ విశేషం ఏమిటో తెలుసా..?
Ads
జస్ట్, ఒకటీరెండు సెకన్లు కనిపించే ఓ పాత్ర… పోషించింది అనామకుడేమీ కాదు, వివేక్ ఒబెరాయ్… తను పోషించిన పాత్ర పేరు విద్యుత్ జిహ్వుడు… ఎవరో తెలుసా..? శూర్ఫణఖ భర్త! ఒక విషయం చెప్పుకుందాం…
అందరూ అనుకున్నట్టు మహాభారత కథకు ఎపిసెంటర్ పాచికలాట కాదు… అంతకుముందు మయసభలో దుర్యోధనుడి భంగపాటు, ద్రౌపది నవ్వు… తరువాత అదే దుర్యోధనుడి తమ్ముడు వికర్ణుడు ఒక్కడే వస్త్రాపహరణాన్ని నిరసిస్తాడు… సేమ్, శూర్పణఖ భర్త కూడా రావణుడి పోకడల్ని వ్యతిరేకిస్తాడు…
వావ్… ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలి… రామాయణ్ దర్శకుడు నితేశ్ తివారీ రామాయణ కథలోని ఇలాంటి పాత్రల్ని కూడా విస్మరించకుండా కథలోకి తీసుకురావడం… శూర్పణఖ కథకూ చోటుండటం! రామాయణంలో అందరికీ తెలిసిన పాత్రలు రాముడు, సీత, రావణుడు, హనుమంతుడు తదితరాలు.
కానీ కొన్ని చిన్న పాత్రలే మొత్తం కథను మలుపు తిప్పుతాయి. నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం ట్రైలర్‌లో అలాంటి ఓ పాత్రను చూసిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో అదే చర్చగా మారింది. వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్న విద్యుత్జిహ్వుడు (Vidyutjihva). అసలు ఆ శూర్పణఖకు భర్త ఉన్నాడని, అతని పేరు విద్యుత్జిహ్వుడు అని కోట్లాది మందికి తెలియదు…
పురాణాల ప్రకారం విద్యుత్జిహ్వుడు కాలకేయ వంశానికి చెందిన పరాక్రమశాలి. శూర్పణఖను వివాహం చేసుకున్న అతడిని రావణుడు యుద్ధంలో పొరపాటున లేదా కోపోద్రిక్తుడై హతమార్చాడని కొన్ని రామాయణ సంప్రదాయ కథనాలు చెబుతాయి.

అదే కారణంగా శూర్పణఖకు రావణుడిపై మనసులో గాయం మిగిలిందని, తర్వాత పంచవటిలో జరిగిన సంఘటనలు మరింత తీవ్ర పరిణామాలకు దారితీశాయని కొన్ని ప్రాంతీయ రామాయణాల్లో ప్రస్తావన ఉంది. అయితే ఈ కథనం వాల్మీకి రామాయణంలో ప్రధానంగా కనిపించదు; ఉత్తర, ప్రాంతీయ, పురాణ సంప్రదాయాల్లో విస్తృతంగా చెప్పబడుతుంది.
అందుకే ట్రైలర్‌లో విద్యుత్జిహ్వుడి పాత్రను చూపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే నితేశ్ తివారీ కేవలం రామ– రావణ యుద్ధం మాత్రమే కాదు, రావణుడి కుటుంబం, శూర్పణఖ నేపథ్యం, ఆమె జీవితంలో జరిగిన విషాదాన్ని కూడా కథలో భాగం చేయాలని భావించినట్టు కనిపిస్తోంది. సూపర్…
ఇది దర్శకుడి మైక్రో అబ్జర్వేషన్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది దర్శకులు ప్రధాన కథతో సరిపెడితే, నితేశ్ మాత్రం తర్వాతి పరిణామాలకు కారణమైన చిన్న చిన్న సంఘటనలను కూడా తెరపైకి తీసుకొస్తున్నాడు. ఇలాంటి పాత్రల వల్లే మహాకావ్యాలకు మరింత భావోద్వేగ లోతు వస్తుంది.

ఈ పాత్రలో వివేక్ ఒబెరాయ్ దాదాపు గుర్తుపట్టలేనంతగా కనిపించడం మరో విశేషం. ట్రైలర్‌లో కేవలం కొన్ని సెకన్లే కనిపించినా, యశ్ పోషిస్తున్న రావణుడితో ఆయనకు ఎదురెదురయ్యే సన్నివేశాలు ఉండొచ్చని అభిమానులు ఇప్పటికే చర్చిస్తున్నారు.
ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే… ఈ సినిమా కోసం వివేక్ ఒబెరాయ్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. తన రెమ్యూనరేషన్‌ను క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారుల కోసం విరాళంగా ఇవ్వాలని నిర్మాత నమిత్ మల్హోత్రాను కోరినట్లు ఆయనే వెల్లడించాడు. భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో తాను భాగస్వామి కావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
రామాయణంలో అందరికీ తెలిసిన కథను మాత్రమే కాదు… చాలా మందికి తెలియని కథల్ని కూడా నితేశ్ తివారీ వెండితెరపై చూపిస్తే… నిజంగానే ప్రశంసనీయం!!
Share this Article